ధార్మిక పరిషత్‌ సభ్యుల కుదింపుపై వాదనలు పూర్తి

తీర్పు రిజర్వు చేసిన హైకోర్టు

ఈనాడు, అమరావతి: ఏపీ ధార్మిక పరిషత్‌ కమిటీ సభ్యుల సంఖ్యను నలుగురికి కుదిస్తూ దేవాదాయ చట్టానికి సవరణ చేయడాన్ని సవాలు చేస్తూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంపై హైకోర్టులో వాదనలు ముగిశాయి. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం తీర్పును వాయిదా (రిజర్వు) వేసింది. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ సి.ప్రవీణ్‌కుమార్‌, జస్టిస్‌ దుప్పల వెంకటరమణతో కూడిన ధర్మాసనం గురువారం ఈమేరకు ఆదేశాలు జారీచేసింది.  ఏపీ ధార్మిక పరిషత్‌ కమిటీ సభ్యులను కుదిస్తూ దేవాదాయ చట్టానికి సవరణ చేశారని, దానిని రద్దు చేయాలని కోరుతూ ప్రకాశం జిల్లాకు చెందిన పాలెపు శ్రీనివాసులు హైకోర్టులో పిల్‌ దాఖలు చేశారు. న్యాయవాది పీవీజీ ఉమేశ్‌చంద్ర వాదనలు వినిపిస్తూ..‘దేవాదాయ చట్టంలోని సెక్షన్‌ 152 ప్రకారం ధార్మిక పరిషత్‌లో 21 మంది సభ్యులుగా ఉండాలి. తాజాగా తెచ్చిన సవరణ చట్టం ద్వారా దేవాదాయశాఖ మంత్రి ఛైర్మన్‌గా, ఆ శాఖ ముఖ్యకార్యదర్శి, ఎండోమెంట్‌ కమిషనర్‌, తితిదే కార్యనిర్వహణ అధికారి సభ్యులుగా పేర్కొన్నారు. ఈ నిర్ణయం సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధం. మఠాలు, మఠాధిపతుల నియామకాల వ్యవహారంలో వివాదం తలెత్తితే.. ప్రభుత్వ కనుసన్నల్లో ఉండే నలుగురు ధార్మిక పరిషత్‌ సభ్యులే నచ్చిన వారిని నియమించుకునే వీలుంది. అలాంటి చర్యలకు అడ్డుకట్ట వేయడానికే కమిటీలో మొత్తం 21 మంది సభ్యులుండాలి’ అన్నారు. ప్రభుత్వ న్యాయవాది(జీపీ) రజనీ వాదనలు వినిపిస్తూ వ్యక్తిగత ప్రయోజనం కోసం పిల్‌ వేశారన్నారు. 21 మంది సభ్యుల కమిటీని కుదించలేదన్నారు. అంతమందిని ఏర్పాటు చేయడం సాధ్యం కానప్పుడు మాత్రమే నలుగురు సభ్యుల కమిటీ విధులను నిర్వహిస్తుందన్నారు. త్వరలో పూర్తిస్థాయిలో కమిటీని ఏర్పాటు చేస్తామని తెలిపారు.

చాగంటి సతీష్‌పై చర్యలొద్దు: సీఐడీకి హైకోర్టు ఆదేశం
సామాజిక మాధ్యమంలో చీకోటి ప్రవీణ్‌ పేరుతో నకిలీ ఖాతాలు సృష్టించి అసత్య ప్రచారం చేశారనే ఆరోపణలతో సీఐడీ నమోదు చేసిన కేసులో వ్యాపారవేత్త చాగంటి సతీష్‌పై చట్టవిరుద్ధంగా ఎలాంటి చర్యలూ తీసుకోవద్దని హైకోర్టు పోలీసులను ఆదేశించింది. ఎఫ్‌ఐఆర్‌ ప్రతిని పిటిషనర్‌కు ఇవ్వాలని స్పష్టం చేసింది. పూర్తి వివరాలు కోర్టు ముందు ఉంచేందుకు విచారణను సోమవారానికి వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ రవినాథ్‌ తిల్హరీ గురువారం ఈ మేరకు ఆదేశాలిచ్చారు. చీకోటి ప్రవీణ్‌ పేరుతో నకిలీ ఖాతాలు సృష్టించి సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా సీఐడీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ కేసులో తనపై తొందరపాటు చర్యలు తీసుకోకుండా పోలీసులను నిలువరించాలని కోరుతూ చాగంటి సతీష్‌ గురువారం హైకోర్టులో అత్యవసరంగా వ్యాజ్యం వేశారు. న్యాయవాది పి.రవితేజ వాదనలు వినిపించారు. నకిలీ ఖాతాల సృష్టితో పిటిషనర్‌కు సంబంధం లేదన్నారు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని