ఇదో దోపిడీ కుటుంబం!

తండ్రి ఆర్టీసీ డ్రైవరు.. కొడుకు విద్యార్థి

తల్లిదండ్రుల సహకారంతో గొప్ప ప్లాన్‌

దారికాచి రూ. 12 లక్షల చోరీ

మూడురోజుల్లోనే ఛేదించిన పోలీసులు

చిత్తూరు (నేరవార్తలు), న్యూస్‌టుడే: దారి కాచి కారు మీద దాడి చేసి రూ.12 లక్షల దోపిడీకి పాల్పడిన ఓ ముఠాను చిత్తూరు పోలీసులు అరెస్టు చేశారు. ఈ దోపిడీకి సూత్రధారి ఒక ఇంజినీరింగ్‌ విద్యార్థి కావడం.. ఆర్టీసీ డ్రైవరైన అతడి తండ్రి సహా తొమ్మిది మంది స్నేహితులు ఈ దోపిడీలో పాల్గొనడం విశేషం. ఈ కేసు వివరాలను ఎస్పీ రిషాంత్‌రెడ్డి గురువారం వెల్లడించారు. చిత్తూరు జిల్లా ‘జీడీనెల్లూరు మండలం కాలేపల్లి మలుపు వద్ద ఈ నెల 1న ఒక దోపిడీ ముఠా కేసీసీ కన్‌స్ట్రక్షన్‌ సంస్థ పీఆర్వో జాన్సన్‌ కారును అటకాయించి అద్దాలు పగులకొట్టి అతడితో పాటు డ్రైవర్‌ విక్రమ్‌పై దాడి చేసి రూ.12 లక్షలు దోచుకుంది. డీఎస్పీ సుధాకరరెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం ఈ కేసు దర్యాప్తు ప్రారంభించింది. గురువారం జీడీనెల్లూరులోని చెర్లోపల్లి వద్ద నిందితులను అదుపులోకి తీసుకుని రూ. 11 లక్షలు స్వాధీనం చేసుకుంది. వారిని విచారిస్తే విస్మయం కలిగించే విషయాలు వెల్లడయ్యాయి.. ఈ దోపిడీకి పథకం రచించిన భరత్‌ చెన్నైలో ఇంజినీరింగ్‌ విద్యార్థి. చిత్తూరు షావుకారు సులేమాన్‌ వీధికి చెందిన అతడి తండ్రి పరంధామనాయుడు ఆర్టీసీ డ్రైవరు కాగా తల్లి తేజశ్రీ గృహిణి. వీరు కేసీసీ సంస్థలో రెండు కార్లు బాడుగకు పెట్టి డ్రైవరును నియమించారు. అతడి సహకారంతో నగదు లావాదేవీల ఆనుపానులన్నీ తెలుసుకుని ఈ దోపిడీకి పథకం వేశారు. తండ్రీకొడుకులు ఎనిమిదేళ్ల కిందట ముంబయిలో దోపిడీకి పాల్పడ్డారు. రెండు నెలల కిందట కూడా కడపకు చెందిన ఓ వ్యక్తిని అపహరించి, చిత్తూరుకు తెచ్చి బెదిరించి రూ.10 లక్షలు దోచుకున్నారు. అప్పులు తీర్చడం కోసమని తాజా దోపిడీకి కొడుకు భరత్‌ ప్లాన్‌ చేయగా తల్లిదండ్రులు సహకరించారు. భరత్‌ తన స్నేహితులకు మాయమాటలు చెప్పి ఈ దారిదోపిడీకి పాల్పడ్డారు. మక్కినేని భరత్‌ (19), కె.విక్రం (23), తేజశ్రీ (40), ఎస్‌.సందీప్‌ (21), జి.పవన్‌కుమార్‌ (30), ఎ.చరణ్‌రాజు (20), ఎ.లవకుమార్‌ (22), కె.పవన్‌కుమార్‌ (21), వి.కృష్ణ (19).. సహా భరత్‌ తల్లి తేజశ్రీ (గృహిణి)ని అరెస్టు చేయగా.. రూపేష్‌, సాయి, భరత్‌ తండ్రి పరంధామనాయుడు (చిత్తూరు-2 డిపో డ్రైవర్‌), ధనరాజ్‌ పరారీలో ఉన్నారని ఎస్పీ చెప్పారు. నిందితుల్లో ఒకడైన ఎస్‌.సందీప్‌కు మొన్ననే విప్రోలో ఉద్యోగం వచ్చింది. శుక్రవారం విధుల్లో చేరాల్సి ఉంది. ఈలోపు దోపిడీ కేసులో పట్టుబడ్డాడు. జి.పవన్‌కుమార్‌ ఈవెంట్‌ మేనేజర్‌. మిగిలినవారు ఇంజినీరింగ్‌, డిగ్రీ పూర్తిచేయగా రూపేష్‌ ఓ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటుంటాడని ఎస్పీ వివరించారు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని