CM Jagan: నిధులివ్వండి.. రోడ్లేయండి

సీఎం జగన్‌తో భేటీలో సమస్యలను ఏకరవు పెట్టిన రాజాం వైకాపా కార్యకర్తలు

ఈనాడు, అమరావతి: ‘రాజాం నియోజకవర్గంలో మురుగు కాలువల పరిస్థితి దారుణంగా ఉంది. తాగునీటి సమస్యకు పరిష్కారం చూపాలి. తోటపల్లి కాలువల పనులు అసంపూర్తిగానే మిగిలిపోవడంతో పంటకు నీరు అందడంలేదు’ అంటూ ఆ ప్రాంతంలోని సొంత పార్టీ కార్యకర్తలే ముఖ్యమంత్రి జగన్‌ ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 50మంది క్రియాశీలక కార్యకర్తలతో సీఎం జగన్‌ నిర్వహిస్తున్న సమావేశాల్లో భాగంగా శుక్రవారం రాజాం కార్యకర్తలతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు, ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్‌ పాల్గొన్నారు. సమావేశంలో పలువురు కార్యకర్తలు సంతకవిటి-పొందూరు రహదారిని రెండు వరుసలుగా విస్తరించి రాజాం వరకు కలపాలని కోరారు. ‘మిల్లర్లు కూడబలుక్కుని ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడుతున్నారు. ముక్క పేరుతో రైతుల నుంచి తక్కువ ధరకే కొంటున్నారు. ధాన్యం అమ్మిన రైతులకు ప్రభుత్వం నుంచి రావాల్సిన మొత్తాలు సకాలంలో రావట్లేదు’ అని ఫిర్యాదు చేశారు.

పింఛన్లు నిలిపివేస్తున్నారు
కొందరికి పింఛన్లను మధ్యలో నిలిపివేస్తున్నారని కార్యకర్తలు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకురాగా ఆయన స్పందిస్తూ.. ‘అర్హత ఉన్న ఏ ఒక్కరికీ పథకాలు నిలిచిపోవు. అర్హత లేకుండా ఇమ్మంటే కుదరదు. మనం ఒక పద్ధతి పెట్టుకున్నాం, అందుకు అనుగుణంగా అడుగులు వేయాలి’ అని సీఎం చెప్పినట్లు సమాచారం.

జోగులు గెలిస్తే మంత్రి?
రాజాంలో ఎమ్మెల్యే కంబాల జోగులును వచ్చే ఎన్నికల్లోనూ గెలిపిస్తే ఆయన్ను మంత్రిని చేస్తానని ముఖ్యమంత్రి చెప్పినట్లు పలువురు కార్యకర్తలు సమావేశానంతరం బయట చర్చించుకున్నారు.

రాజాంలోనే రూ.775 కోట్లు పంచాం: సీఎం
ఈ సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడిన వివరాలను ఆయన కార్యాలయం ప్రకటించింది. అందులో.. ‘రాజాం నియోజకవర్గంలోనే ప్రత్యక్ష నగదు బదిలీ (డీబీటీ) కింద రూ.775 కోట్లు ఇచ్చాం. రూ.240 కోట్ల విలువైన 12,403 ఇళ్ల పట్టాలను ఇచ్చాం.. 9,599 ఇళ్లను నిర్మిస్తున్నాం, వీటి విలువ కనీసం రూ.171 కోట్లు ఉంటుంది. గత తెదేపా పాలనకు, మన పాలనకు తేడా చూస్తే మనం చేసిన మంచిని ప్రజలకు ఇంకా ప్రభావవంతంగా చెప్పగలగాలి. మనం చేసిన మంచిని మీరు ఓట్ల రూపంలోకి మార్చాలి. ఆ బాధ్యత మీపైనే ఉంది, మీరు కష్టపడితే తప్ప అది జరగదు’ అని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు.


లక్ష్యం 151 కాదు.. 175

‘మన లక్ష్యం 151 కాదు.. మొత్తం 175 రావాలి. అది కష్టం కాదని కూడా నేనెందుకు చెప్పగలనంటే ప్రతి నియోజకవర్గంలోని ప్రతి ఇంటికీ మంచి జరుగుతోంది. ప్రతి గ్రామంలో 87% ఇళ్లకు అందిన ప్రయోజనం గురించి మీరే అడగండి. లబ్ధిదారులు వీటిని ఖండించలేరు. ప్రతి నియోజకవర్గం ఇలాగే ఉంది. అందుకే చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో కూడా మున్సిపాలిటీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ, పంచాయతీ అన్నీ స్వీప్‌ చేశాం. ప్రజల్లో అంత మార్పు కనిపిస్తోంది. కానీ మొత్తం 175 సాధించాలంటే ఒక్క జగన్‌ వల్ల జరగదు. మీ సహాయ సహకారాలూ కావాలి. అందరం కలిసికట్టుగా చేయాల్సిందే’ అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.


సీఎంకు రాజాం కార్యకర్తల నివేదన

* పంచాయతీల నుంచి ప్రభుత్వం తీసుకున్న నిధులను తిరిగి ఇప్పించండి. ఆ నిధులొస్తే పనులు చేయగలుగుతాం.
* రాజాంలో రహదారుల విస్తరణకు రూ.20 కోట్లు మంజూరు చేసినా ఇప్పటికీ పనులు కాలేదు..
* రెల్లిగడ్డ వంతెన మరమ్మతులు చేపట్టాలి.
ఇవీ రాజాం నియోజకవర్గ సమీక్షలో వైకాపా కార్యకర్తలు సీఎం జగన్‌ ముందు ఏకరవు పెట్టిన సమస్యలు.మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని