ఇ-క్రాపింగ్‌ సత్వరమే పూర్తి చేయాలి

అధికారులను ఆదేశించిన సీఎం

వ్యవసాయ శాఖపై సమీక్ష

ఈనాడు, అమరావతి: వచ్చే నెల మొదటివారంలోగా ఇ-క్రాపింగ్‌ వంద శాతం పూర్తి చేయాలని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. రైతు భరోసా కేంద్రాల్లోని వ్యవసాయ, రెవెన్యూ సహాయకులు ఈ ప్రక్రియ పూర్తి చేసేలా చూడాలని సూచించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో శుక్రవారం వ్యవసాయశాఖపై సీఎం సమీక్ష నిర్వహించారు. ‘ఇ-క్రాప్‌ విషయంలో రోజూ నిశితంగా పరిశీలించాలి. క్రాపింగ్‌ చేశాక భౌతిక, డిజిటల్‌ రశీదులివ్వాలి. ఇ-క్రాపింగ్‌ని వెబ్‌ల్యాండ్‌కి అనుసంధానించే క్రమంలో ఎక్కడైనా పొరపాట్లు ఉంటే.. వెంటనే సరిదిద్దాలి’ అని సీఎం అధికారులను ఆదేశించారు. ‘రైతులకు గరిష్ఠ లబ్ధి చేకూర్చేలా తగిన చర్యలు తీసుకోవాలి. వైఎస్‌ఆర్‌ ఉచిత పంటల బీమా పథకంతో ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజన భాగస్వామ్యం చేయాలి. వైఎస్‌ఆర్‌ యంత్ర సేవ కింద రైతులకు మరిన్ని పరికరాలు ఇవ్వాలి. రైతు భరోసా కేంద్రాల్లో ప్రతి కియాస్క్‌ పని చేసేలా చూడాలి. వాటి ఇంటర్నెట్‌ కనెక్షన్‌ పరిశీలించాలి. వ్యవసాయ రంగంలో డ్రోన్ల వినియోగం కోసం మాస్టర్‌ ట్రైనర్లను తయారు చేయాలి. నియోజకవర్గానికి ఒక ఐటీఐ, పాలిటెక్నిక్‌ కళాశాలలోని విద్యార్థులకు డ్రోన్ల వినియోగం, నిర్వహణ, మరమ్మతులపై సంపూర్ణ శిక్షణ ఇప్పించాలి’ అని సీఎం సూచించారు.

ఎరువుల పంపిణీలో లోపాలు ఉండొద్దు 

‘రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు ఎరువుల పంపిణీలో ఎలాంటి లోపాలు తలెత్తకుండా చూడాలి. ఎక్కడి నుంచి ఎలాంటి సమాచారం వచ్చినా వెంటనే పరిశీలించి చర్యలు తీసుకోవాలి. రైతు భరోసా కేంద్రాల్లోని వ్యవసాయ సహాయకుల నుంచి ఎరువుల పంపిణీపై ప్రతి రోజూ సమాచారం తెప్పించుకోవాలి.  విత్తనాల సరఫరా, ఎరువుల పంపిణీ, వ్యవసాయ ఉత్పత్తులకు అందుతున్న ధరలు తదితర అంశాలపై నిరంతరం పర్యవేక్షణ ఉండాలి’ అని అధికారులను సీఎం ఆదేశించారు.

16.2% అధిక వర్షపాతం: అధికారులు 

ఈనెల 3 నాటికి రాష్ట్రంలో సాధారణం కంటే 16.2% అధిక వర్షపాతం నమోదైనట్లు సీఎంకు అధికారులు వివరించారు. ఈ ఖరీఫ్‌ సీజన్‌లో 36.82 లక్షల హెక్టార్ల మేర సాగు విస్తీర్ణం ఉంటుందని అంచనా వేస్తున్నామని వెల్లడించారు. ఇప్పటికే 18.8 లక్షల హెక్టార్లలో పంటలు సాగు జరిగినట్లు పేర్కొన్నారు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని