ఇంజినీరింగ్‌లో 1.42 లక్షల సీట్లు

ఒక్క సీఎస్‌ఈలోనే పెరిగిన 15,952 సీట్లు

రెండు కళాశాలల్లో తెలుగు మాధ్యమంలోనే

డీమ్డ్‌ వర్సిటీల్లో 7,690 ప్రవేశాలకు ఏఐసీటీఈ ఆమోదం

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో 261 ఇంజినీరింగ్‌ కళాశాలల్లో 1,42,257 సీట్లకు అఖిల భారత సాంకేతిక విద్యామండలి(ఏఐసీటీఈ) ఆమోదం తెలిపింది. ఏఐసీటీఈ అనుమతుల ప్రక్రియ జులైతో ముగిసింది. కరోనా పరిణామాలతో డిజిటల్‌ విభాగంలో ఉద్యోగాలు పెరగడంతో కంప్యూటర్‌ సైన్సు ఇంజినీరింగ్‌(సీఎస్‌ఈ) బ్రాంచికి డిమాండ్‌ ఏర్పడింది. దీంతో కళాశాలలన్నీ ఈ ఏడాది సీఎస్‌ఈలో భారీగా సీట్లు పెంచుకున్నాయి. ఇంజినీరింగ్‌ సివిల్‌, మెకానికల్‌, ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ (ఈఈఈ)లాంటి కోర్‌ కోర్సుల్లో సీట్లు తగ్గించుకొని, సీఎస్‌ఈ సీట్లను పెంచుకున్నాయి. గతేడాదితో పోల్చితే సీఎస్‌ఈలో 15,952 సీట్లు పెరిగాయి. మొత్తంగా చూస్తే 2,395 సీట్ల పెరుగుదల ఉంది. విశ్వవిద్యాలయాల కళాశాలలు 17 ఉండగా.. వీటిల్లో 5,040 సీట్లు, ప్రైవేటులో 244 విద్యాసంస్థలు ఉండగా.. 1,37,217 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇవికాకుండా రాజీవ్‌గాంధీ విజ్ఞాన, సాంకేతిక విశ్వవిద్యాలయం(ఆర్జీయూకేటీ)పరిధిలోని నాలుగు ట్రిపుల్‌ఐటీల్లో 1,440 సీట్లకు ఏఐసీటీఈ ఆమోదం తెలిపింది. గీతం, కేఎల్‌, విజ్ఞాన్‌ తదితర వర్సిటీల్లో 7,690 సీట్లు ఉన్నాయి.

తెలుగులో ఇంజినీరింగ్‌.. తెలుగు మాధ్యమంలో ఇంజినీరింగ్‌ కోర్సులను ఈ ఏడాది రెండు కళాశాలలు ఆహ్వానిస్తున్నాయి. గతేడాదే విజయవాడ సమీపంలో ఆగిరిపల్లిలోని ఎన్‌ఆర్‌ఐ కళాశాల సీఎస్‌ఈ కోర్సును తెలుగు మాధ్యమంలో ప్రారంభించింది. ఈ ఏడాదీ తెలుగు మాధ్యమాన్ని కొనసాగిస్తోంది. ఒంగోలులోని మరో కళాశాల పీస్‌ విద్యా సంస్థ తెలుగు మాధ్యమంలో సీఎస్‌ఈని ప్రారంభించింది. ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో కలిపి ఫార్మసీలో 6,670 సీట్లు, డీమ్డ్‌ వర్సిటీల్లో 260 సీట్లకు ఏఐసీటీఈ ఆమోదం లభించింది.
జిల్లాల వారీగా సీట్లు.. ఉమ్మడి గుంటూరు జిల్లాలో అత్యధికంగా 21,690 సీట్లు అందుబాటులో ఉండగా.. అత్యల్పంగా శ్రీకాకుళం జిల్లాలో 2,880 సీట్లు ఉన్నాయి. ఉమ్మడి నెల్లూరు, ప్రకాశం, పశ్చిమగోదావరి జిల్లాల్లో ప్రభుత్వ ఇంజినీరింగ్‌ కళాశాలలు లేవు. అత్యధికంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మూడు ప్రభుత్వ కళాశాలలు ఉండగా.. వీటిలో 1,020 సీట్లు అందుబాటులో ఉన్నాయి.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని