Visakhapatnam: వైద్య విద్యార్థికి మంకీపాక్స్‌ అనుమానిత లక్షణాలు

విశాఖపట్నం (వన్‌టౌన్‌), న్యూస్‌టుడే: విశాఖ నగరంలోని ఒక ప్రైవేటు వైద్య కళాశాలలో ఎంబీబీఎస్‌ చివరి ఏడాది చదువుతున్న వైద్య విద్యార్థికి మంకీపాక్స్‌ అనుమానిత లక్షణాలున్నట్లు వైద్యాధికారులు గుర్తించారు. దీంతో ఆరోగ్యశాఖ యంత్రాంగం అప్రమత్తమైంది. వ్యవహారాన్ని విశాఖ కలెక్టర్‌ మల్లికార్జున దృష్టికి అధికారులు తీసుకెళ్లారు. కొద్దిరోజులుగా వైద్య విద్యార్థి ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా శరీరం, చేతివేళ్లపై దద్దుర్లు వచ్చినట్లు వైద్యులు గుర్తించారు. ఇవి మంకీపాక్స్‌ లక్షణాల్లా కనిపించడంతో వైద్యకళాశాల అధికారులు శుక్రవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయానికి విషయాన్ని తెలియజేశారు. కలెక్టర్‌ ఆదేశాల మేరకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిణి డాక్టర్‌ విజయలక్ష్మి రాపిడ్‌ రెస్పాన్స్‌ టీమ్‌ను ఆ వైద్య కళాశాలకు పంపాలని ఆంధ్ర వైద్యకళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ బుచ్చిరాజుకు లేఖ రాశారు. కళాశాలకు చెందిన మెడిసిన్‌, డెర్మటాలజీ, ఎస్పీఎం, మైక్రోబయాలజీ విభాగాల సహాయ ప్రొఫెసర్లు, ఇద్దరు టెక్నీషియన్లతో కూడిన బృందాన్ని శుక్రవారం మధ్యాహ్నం ఆ వైద్యకళాశాలకు పంపారు. శనివారం నమూనాలు సేకరించి పుణెలోని వైరాలజీ ల్యాబ్‌కు పంపనున్నారు. కేవలం అనుమానిత లక్షణాలేనని, అయినా అప్రమత్తంగా ఉన్నామని వైద్యాధికారులు తెలిపారు. విద్యార్థి కుటుంబసభ్యులకు సమాచారం ఇవ్వడంతో వారు శనివారం హైదరాబాద్‌ నుంచి విశాఖ చేరుకునే అవకాశం ఉంది. ఆ విద్యార్థిని కలిసినవారి వివరాలను అధికారులు ఆరా తీస్తున్నారు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని