అప్పుల భారంలో రాష్ట్ర రైతాంగం

ఒక్కో రైతు కుటుంబంపైనా రూ. 2,45,554 రుణం

దేశంలో మరే రాష్ట్రంలోనూ లేనంత మొత్తం

5వ స్థానంలో తెలంగాణ

ఈనాడు, దిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో 31,58,700 రైతు కుటుంబాలు ఉండగా.. సగటున ఒక్కో కుటుంబం పైనా రూ. 2,45,554 మేర రుణ భారం ఉన్నట్లు కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌ వెల్లడించారు. ఆయన శుక్రవారం రాజ్యసభలో వివిధ రాష్ట్రాల సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. మంత్రి సభ ముందుంచిన సమాచారం ప్రకారం ఇంత భారీ స్థాయిలో తలసరి అప్పు మరే రాష్ట్రంలోని రైతు కుటుంబాలపైనా లేదు. దేశవ్యాప్తంగా ఉన్న 9,30,93,500 రైతు కుటుంబాలపై సగటున రూ. 74,121 రుణ భారం ఉంటే.. ఏపీ రైతులు అంతకు 221% అధిక భారాన్ని మోస్తున్నారు. తెలంగాణలోని 26,55,700 రైతు కుటుంబాలపై తలసరి రుణం సగటున రూ. 1,52,113 మేర ఉంది. దీంతో పోలిస్తే ఏపీ రైతులపై 61.42% భారం అధికంగా ఉంది. ఏపీ తర్వాత కేరళ (రూ. 2,42,482), పంజాబ్‌ (రూ. 2,03,249), హరియాణా (రూ. 1,82,922), తెలంగాణ (రూ. 1,52,113), కర్ణాటక (రూ. 1,26,240), తమిళనాడు (రూ. 1,06,553) రైతు కుటుంబాలు అత్యధిక రుణ భారాన్ని మోస్తున్నాయి. ఇందులో ఒక్క పంజాబ్‌ మినహాయించి మిగిలినవన్నీ దక్షిణాది రాష్ట్రాలే. నాగాలాండ్‌లో రైతు కుటుంబాలపై అత్యల్పంగా తలసరి అప్పు రూ. 1,750 మాత్రమే ఉంది. దేశవ్యాప్తంగా సగటున 54% రైతు కుటుంబాలు గ్రామీణ ప్రాంతాల్లో ఉండగా ఏపీలో 33.4% మాత్రమే ఉన్నాయి. తెలంగాణలో ఆ సంఖ్య 54.2% ఉంది. తమిళనాడులో 26.4% కాగా, కేరళలో 33.2% వ్యవసాయ కుటుంబాలు గ్రామీణ ప్రాంతాల్లో ఉంటున్నాయి.

వ్యవసాయ బడ్జెట్‌ 5 రెట్లు పెంచాం
2013-14 నుంచి 2022-23 నాటికి వ్యవసాయ బడ్జెట్‌ను 5 రెట్లు పెంచినట్లు వ్యవసాయమంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌ చెప్పారు. ఆయన రాజ్యసభలో తెరాస సభ్యుడు కేఆర్‌ సురేష్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు బదులిచ్చారు. వ్యవసాయం రాష్ట్ర పరిధిలోని అంశమైనప్పటికీ కేంద్ర ప్రభుత్వం వివిధ పథకాల ద్వారా మద్దతు ఇస్తున్నట్లు చెప్పారు. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌కు తోడు వివిధ రాష్ట్రాలు వ్యవసాయ కోసం ఇతోధికంగా బడ్జెట్‌ కేటాయిస్తున్నాయని పేర్కొన్నారు. 2013-14 నుంచి 2022-23 మధ్యకాలంలో కేంద్ర వ్యవసాయ బడ్జెట్‌ కేటాయింపులను రూ. 27,662.67 కోట్ల నుంచి రూ. 1,32,513.62 కోట్లకు పెంచినట్లు చెప్పారు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని