రాజధానులపై అసెంబ్లీకి విస్పష్టమైన అధికారమివ్వాలి

ఆ మేరకు రాజ్యాంగ సవరణ చేయాలి

రాజ్యసభలో విజయసాయిరెడ్డి ప్రైవేటు బిల్లు

ఈనాడు, దిల్లీ: ఒక రాష్ట్ర పరిధిలో రాజధానుల ఏర్పాటుపై అక్కడి శాసనసభకు విస్పష్టమైన అధికారం ఉండేలా రాజ్యాంగ సవరణ చేయాలని కోరుతూ వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి శుక్రవారం రాజ్యసభలో ప్రైవేట్‌ మెంబర్‌ బిల్లును ప్రవేశపెట్టారు. రాష్ట్రంలోని ఏ ప్రాంతంలోనైనా ఒకటి, అంతకంటే ఎక్కువ రాజధానులు ఏర్పాటు చేసే అధికారం వాస్తవానికి ఆ రాష్ట్ర శాసన వ్యవస్థకే ఉందన్నారు. దీనిపై మరింత స్పష్టత ఇస్తూ, ఈ ప్రక్రియలో రాష్ట్ర ప్రభుత్వానికి చట్టబద్ధంగా తిరుగులేని అధికారం కల్పించేలా ఆర్టికల్‌ 3కి అదనపు క్లాజ్‌ చేరుస్తూ రాజ్యాంగ సవరణ చేయాలని ఆయన కోరారు. ఏదైనా కేసులో విచారణ ఎదుర్కొంటూ కస్టడీలో ఉన్న, అరెస్టయిన పార్లమెంట్‌, అసెంబ్లీ సభ్యుడు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేలా ప్రజా ప్రాతినిధ్య చట్టానికి సవరణ చేయాలని కోరుతూ మరో ప్రైవేట్‌ మెంబర్‌ బిల్లునూ విజయసాయి ప్రవేశపెట్టారు. టీవీ ఛానళ్లు, డిజిటల్‌ మాధ్యమాల్లో వెల్లువెత్తుతున్న నకిలీ వార్తలను నియంత్రించే అధికారం ప్రెస్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియాకు కట్టబెడుతూ చట్టసవరణ చేయాలంటూ ఇంకో బిల్లునూ పెట్టారు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని