గతి తప్పిన పింఛను

లబ్ధిదారుల ఇళ్ల వద్దకే అందిస్తున్నామని ప్రభుత్వం ప్రచారం

మంత్రుల ఇళ్లు, క్యాంపు కార్యాలయాల్లో పంపిణీ

నగదు అందజేసిన ప్రజాప్రతినిధులు

కొత్త పింఛన్ల పంపిణీలో వాలంటీర్ల ప్రేక్షకపాత్ర

ఈనాడు డిజిటల్‌, అమరావతి: సూర్యోదయం కాకముందే వాలంటీర్లు లబ్ధిదారుల ఇళ్ల ముంగిటకు వచ్చి పింఛన్లు పంపిణీ చేస్తారని రాష్ట్ర ప్రభుత్వం పదే పదే చెబుతోంది. కానీ ఆగస్టు నెల పంపిణీ పలు చోట్ల గతి తప్పింది. వాలంటీర్లు ఇళ్ల వద్దకు వెళ్లకుండా వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, ఇతర పింఛనుదారుల్ని ప్రజాప్రతినిధుల ఇళ్ల వద్దకు, ప్రభుత్వ కార్యాలయాలకు తీసుకెళ్లి వారితో పింఛన్లు పంపిణీ చేయించారు. మంత్రులు నుంచి కార్పొరేటర్లు, సర్పంచుల వరకు పంపిణీలో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు నెలలో కొత్తగా 3.10 లక్షల మందికి పింఛన్లు మంజూరు చేసినట్లు ప్రకటించింది. వాటిని ఈ నెల 1 నుంచి అందిస్తున్నారు. గడిచిన మూడు రోజుల్లో కొన్ని ప్రాంతాల్లో లబ్ధిదారుల ఇళ్ల వద్ద పింఛను ఇవ్వకుండా నాయకుల ఇళ్లకు తీసుకెళ్లారు. కొత్త పింఛన్ల పంపిణీలోనే ఎక్కువగా నూతన పోకడ చోటు చేసుకుంది.

ఆదోనిలో వృద్ధులకు తప్పని పడిగాపులు 

ఆదోని పట్టణానికి కొత్తగా 930 పింఛన్లు మంజూరయ్యాయి. బుధవారం పురపాలక సంఘ కార్యాలయ ఆవరణలో వైకాపా ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి వారికి పంపిణీ చేపట్టారు. అధికారులు సుమారు 500 మంది లబ్ధిదారుల్ని కార్యాలయానికి తీసుకెళ్లారు. పడిగాపులకు అవకాశం లేకుండా పంపిణీ చేస్తున్నామని ప్రభుత్వం చెబుతుండగా ఇక్కడ మాత్రం వృద్ధులకు నిరీక్షణ తప్పలేదు. భారీ వర్షానికి కార్యాలయ ప్రాంగణంలోకి వర్షపు నీరు చేరి, లబ్ధిదారులు అవస్థలు పడ్డారు. కూర్చోవడానికి కుర్చీలు కూడా ఏర్పాటు చేయలేదు. చలికి తట్టుకోలేక కొంతమంది వృద్ధులు కార్యాలయం లోపల నేలపైనే పడుకున్నారు.

* కర్నూలు జిల్లా ఆలూరు మండలంలో కొత్తగా పింఛన్లు మంజూరైన 20 మంది వృద్ధులు, వితంతువులను అధికారులు కార్మికశాఖ మంత్రి జయరాం ఇంటి వద్దకు తీసుకెళ్లి ఆయనతో పంపిణీ చేయించారు.

* గత ప్రభుత్వాల మాదిరిగా పింఛన్లకు పడిగాపులు పడే రోజులకు సీఎం జగన్‌ స్వస్తి పలికారని ఉపముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు ఒకవైపు చెబుతూనే.. లబ్ధిదారుల ఇళ్ల వద్ద కాకుండా సోమవారం ఎన్‌.గజపతినగరంలోని రహదారి పక్కన కొంతమందికి పింఛను మంజూరు పత్రాలు, నగదు అందించారు. 

* తూర్పుగోదావరి జిల్లా సీతానగరంలో వైకాపా నాయకులే పింఛన్లను సోమవారం లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి పంచారు. వాలంటీర్లను కాదని అన్ని పంచాయతీల్లోనూ ప్రత్యేకంగా నాయకులు, కార్యకర్తలతో కమిటీలు ఏర్పాటు చేసుకుని మరీ పింఛన్లు అందించారు. వీటిని ఫొటోలు తీసుకుని సామాజిక మాధ్యమాల్లోనూ పెట్టారు.

* తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్‌ గుంటూరు నెహ్రూనగర్‌లో 55వ డివిజన్‌ కార్పొరేటర్‌ చేతుల మీదుగా నగదును సోమవారం లబ్ధిదారులకు అందించారు.

* అనంతపురం జిల్లా గుంతకల్లులో ఎమ్మెల్యే వెంకటరామిరెడ్డి కొత్త పింఛనుదారులకు సోమవారం తన క్యాంపు కార్యాలయంలో పింఛను అందజేశారు.

* చిత్తూరు జిల్లా గుడిపాల ఎంపీపీ కార్యాలయంలో వైకాపా ఎమ్మెల్యే శ్రీనివాసులు, మేయర్‌ అముద కొంతమందికి సోమవారం పింఛను పంపిణీ చేశారు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని