ఎడ్‌సెట్‌లో 96%.. లాసెట్‌లో 89% అర్హత

ప్రవేశ పరీక్షల ఫలితాల విడుదల

ఈనాడు, అమరావతి: బీఈడీ ప్రవేశాలకు నిర్వహించిన ఎడ్‌సెట్‌లో 96.43%, న్యాయవిద్యలో ప్రవేశాలకు నిర్వహించే లాసెట్‌లో 89% మంది అర్హత సాధించారు. శ్రీపద్మావతి మహిళా విశ్వవిద్యాలయం నిర్వహించిన ప్రవేశపరీక్షల ఫలితాలను శుక్రవారం ఉన్నత విద్యామండలి కార్యాలయంలో ఛైర్మన్‌ హేమచంద్రారెడ్డి విడుదల చేశారు. 11,384 మంది ఎడ్‌సెట్‌ రాయగా, 10,978 మంది అర్హత సాధించారు. అబ్బాయిల్లో 97.25%, అమ్మాయిల్లో 96.14% అర్హులయ్యారు. వివిధ సబ్జెక్టులకు ఉమ్మడి పరీక్ష నిర్వహించారు. మూడేళ్లు, ఐదేళ్ల న్యాయవిద్య, రెండేళ్ల పీజీ న్యాయవిద్యలో ప్రవేశాలకు 13,180 మంది పరీక్ష రాయగా 11,730 మంది అర్హత సాధించారు. మూడేళ్ల కోర్సులో ప్రవేశానికి 9,645 మంది పరీక్ష రాయగా.. 8,759 (90.81%) మంది అర్హత సాధించారు. ఐదేళ్ల కోర్సుకు 2,630 మంది పరీక్షకు హాజరుకాగా.. 2,091(79.51%) అర్హత పొందారు. రెండేళ్ల పీజీలో ప్రవేశానికి 905మంది పరీక్ష రాయగా.. 880(97.24%) అర్హత సాధించారు. లాసెట్‌లో నాలుగు ప్రశ్నల జవాబులపై అభ్యంతరాలు వచ్చాయని, ఒక ప్రశ్నకు రెండు జవాబులు ఉండడంతో రెండింటికి మార్కులు ఇచ్చినట్లు హేమచంద్రారెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉన్నత విద్యామండలి వైస్‌ ఛైర్మన్లు రామమోహన్‌రావు, లక్ష్మమ్మ, కార్యదర్శి సుధీర్‌ ప్రేమ్‌కుమార్‌, ప్రత్యేక అధికారి సుధీర్‌రెడ్డి, ఉపకులపతి డి.జమున, కన్వీనర్లు అమృతవల్లి, సీతాకుమారి పాల్గొన్నారు.

ప్రభుత్వ ఉద్యోగికి రెండో ర్యాంకు
మూడేళ్ల న్యాయవిద్య కోర్సులో రాష్ట్ర సచివాలయ ఉద్యోగి కసిరెడ్డి వరప్రసాద్‌ 97మార్కులతో రెండోర్యాంకు సాధించారు. 18ఏళ్ల సర్వీసు ఉన్న ఈయన మొదట రాష్ట్ర ఆడిట్‌ విభాగంలో పనిచేశారు. ప్రస్తుతం ఆర్థికశాఖలో ఎస్‌ఓగా ఉన్నారు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని