ఐఐపీఈ ప్రాజెక్టుకు తొలగిన అవరోధం

పరిహారంపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు

ఈనాడు, అమరావతి: అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం వంగలి గ్రామ పరిధిలో తలపెట్టిన భారత పెట్రోలియం, శక్తి సంస్థ (ఐఐపీఈ) నిర్మాణానికి అవరోధం కలగకుండా మధ్యేమార్గంగా హైకోర్టు ఉత్తర్వులిచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం, ఐఐపీఈ, పరిహారం కోరుతున్న భూయజమానులు.. అందరూ ఈ ప్రాజెక్టు నిర్మాణం కొనసాగాలని కోరుకుంటున్నారని, ఈ వ్యవహారం జాతీయ ప్రాధాన్యతాంశం కావడంతో మధ్యేమార్గంగా ఈ ఉత్తర్వులు ఇస్తున్నట్లు పేర్కొంది. న్యాయమూర్తి జస్టిస్‌ డీవీఎస్‌ఎస్‌ సోమయాజులు శుక్రవారం ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. ఐఐపీఈ నిర్మాణానికి అడ్డంకులు సృష్టించకుండా ఆదేశాలు జారీ చేయాలని ఆ సంస్థ హైకోర్టులో వ్యాజ్యం వేయగా, తమకు పరిహారం ఇప్పించాలని పట్టాదారులు, భూములను సాగుచేసుకుంటున్నవారు, ఆ భూములపై ఆధారపడిన వ్యవసాయ కూలీలు మొత్తం 29 మంది హైకోర్టును ఆశ్రయించారు. ఐఐపీఈ తరఫున సీనియర్‌ న్యాయవాది ఎ.సత్యప్రసాద్‌, భూయజమానుల తరఫున సీనియర్‌ న్యాయవాది కేఎస్‌ మూర్తి, రెవెన్యూశాఖ తరఫున ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపించారు. వాదనల అనంతరం హైకోర్టు స్పందిస్తూ.. తాత్కాలిక చర్యల్లో భాగంగా 20.88 ఎకరాల విషయంలో ఎకరాకు రూ. 13 లక్షల చొప్పున పరిహారం సొమ్మును కోర్టులో జమచేయాలని, పునరావాసం, పునర్నిర్మాణం ప్యాకేజీ కింద ప్రతి పిటిషనరుకు రూ. 5.50 లక్షలు రెండు వారాల్లో జమచేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. 8 మంది ఎసైనీదారులు రూ. 2.12 కోట్లు, ఆక్రమణదారులుగా వర్గీకరిస్తున్న 15 మంది 86.66 లక్షలు ప్రభుత్వం జమ చేసే సొమ్ము నుంచి తీసుకోవచ్చని పేర్కొంది. పరిహారం తీసుకున్నాక ఐఐపీఈ నిర్మాణ, అభివృద్ధి పనులకు అడ్డంకులు కలిగించడానికి వీల్లేదని.. భూములను ఖాళీ చేయాలని తేల్చిచెప్పింది. ఇరుపక్షాలు తుది విచారణ సందర్భంగా కోర్టు ముందు వాదనలు వినిపించొచ్చని పేర్కొంది. కోర్టులో దాఖలు చేసిన మెమోకు అనుగుణంగా ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజ్‌ (పొరుగుసేవల ఉద్యోగాలు, పరోక్ష ఉద్యోగ కల్పన, తదితర విషయాలు) స్థానిక గ్రామస్థులకు కల్పించే విషయంలో ఐఐపీఈ సంస్థ కట్టుబడి ఉండాలని స్పష్టం చేసింది. వ్యవసాయ కూలీలకు ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజ్‌ అర్హత విషయంలో 45 రోజుల్లో ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలంది. విచారణను ఈనెల 22కి వాయిదా వేసింది.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని