Venkaiah naidu: సభ్యులకు మార్గదర్శిగా నిలిచారు

తెదేపా ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌

ఈనాడు, దిల్లీ: సభలో వివిధ బిల్లులపై చర్చ, బిల్లుల ఆమోద ప్రక్రియలో అనుసరించాల్సిన విధానాల్లో తనతోపాటు సభ్యులందరికీ ఛైర్మన్‌ వెంకయ్యనాయుడు మార్గదర్శిగా నిలిచారని తెదేపా రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్‌ కొనియాడారు. రాజ్యసభ ఛైర్మన్‌ వెంకయ్యనాయుడి పదవీ విరమణ సందర్భంగా రాజ్యసభలో సోమవారం నిర్వహించిన వీడ్కోలు చర్చలో ఆయన మాట్లాడారు. ఈ సమయంలో మాట్లాడడం గౌరవంగా భావిస్తున్నానని, అదే సమయంలో ఇది హృదయానికి ఎంతో భారమైన అంశమని అన్నారు. మంచి పార్లమెంటేరియన్‌గా ఎలా ఉండాలో ఛైర్మన్‌ నాయకత్వంలో నేర్చుకున్నానని చెప్పారు. వెంకయ్యనాయుడు దేశానికి, తెలుగు ప్రజలకు గర్వకారణమని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదని అన్నారు. ఛైర్మన్‌గా సభలో భారతీయ భాషల వినియోగాన్ని ప్రోత్సహించడం, సభ్యులు మాతృభాషల్లో మాట్లాడే అవకాశం ఎక్కువగా కల్పించడం ప్రతి ఒక్కరి అభినందనలకు పాత్రమైందని తెలిపారు. వివిధ విషయాలపై లోతైన పరిజ్ఞానంతో ఆయన ఎన్నో ఉపన్యాసాలిచ్చారని తెలిపారు. రాజ్యసభలో కాగితం వినియోగం తగ్గించడం, ఆన్‌లైన్‌ సేవలు అందుబాటులోకి తేవడాన్ని రవీంద్రకుమార్‌ ప్రస్తావించారు. తెలుగు రాష్ట్రాలకు స్వర్ణభారతి ట్రస్టు ద్వారా వెంకయ్య ఎన్నో సేవలు అందిస్తున్నారని గుర్తుచేశారు. సభ ఛైర్మన్‌గా పదవీ విరమణ పొందినా.. ఆయన సేవలు ప్రజలకు అందుతూనే ఉంటాయని భావిస్తున్నానని అన్నారు. అధికార, ప్రతిపక్ష సభ్యులకు ఛైర్మన్‌ ఎన్నో అవకాశాలనిచ్చారని, ఆయన మార్గదర్శనం తమకు ఎప్పుడూ లభిస్తుందని ఆశిస్తున్నానని పేర్కొన్నారు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని