Roti Festival: వైభవంగా రొట్టెల పండగ ప్రారంభం

నెల్లూరుకు పోటెత్తిన భక్తజనం

ఈనాడు డిజిటల్‌, నెల్లూరు: కులమతాలకు అతీతంగా నెల్లూరు బారాషహీద్‌ దర్గా ఆవరణలో రొట్టెల పండగ మంగళవారం ఘనంగా ప్రారంభమైంది. ఐదు రోజులు జరిగే ఈ పండగకు తొలిరోజు భక్తులు పోటెత్తారు. 12మంది అమరవీరుల పవిత్ర సమాధులను దర్శించుకునేందుకు దేశవిదేశాల నుంచి తరలివచ్చారు. బారాషహీద్‌ దర్గా, స్వర్ణాల చెరువు కళకళలాడాయి. కోరికలు నెరవేరాలని ఒకరికొకరు రొట్టెలు మార్చుకున్నారు. గతేడాది తమ మొక్కులు పూర్తయినవారు ఈ ఏడాది రొట్టెలను వదులుతున్నారు. షహదత్‌ సందర్భంగా మంగళవారం రాత్రి భక్తిశ్రద్ధలతో సొందల్‌మాలి కార్యక్రమం నిర్వహించారు. ముజావర్లు, మత పెద్దల ఆధ్వర్యంలో అమరవీరుల సమాధులపై గలేఫ్‌ వస్త్రాలు తీసి సుగంధ పరిమళాలతో శుభ్రం చేశారు. కొవిడ్‌ కారణంగా రెండేళ్లుగా నిర్వహించకపోవడంతో ఈసారి భక్తులు భారీగా వస్తారని అధికారులు అంచనా వేసి తదనుగుణంగా సదుపాయాలు కల్పించారు. వాహనాల పార్కింగ్‌ ప్రాంతాలను దూరంగా ఏర్పాటుచేయడం, దర్గాకు దాదాపు కిలోమీటరు దూరం నుంచే బారికేడ్లు ఏర్పాటుచేసి ఆంక్షలు విధించడంతో వృద్ధులు, పసిపిల్లలున్నవారు ఇబ్బంది పడ్డారు. బుధవారం గంధోత్సవానికి భారీగా భక్తులు తరలిరానున్నారు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని