Azadi Ka Amrit Mahotsav: ఔషధ యోగం.. ఆరోగ్య భాగ్యం

75 ఏళ్ల వైద్య రంగంలో గణనీయ ప్రగతి

భారీగా పెరిగిన సగటు ఆయుర్దాయం

నిర్మూలన దశలో వివిధ వ్యాధులు

మందుల తయారీలో స్వావలంబన

వ్యాక్సిన్ల ఉత్పత్తిలో ఘన చరిత్ర

ఆంగ్లేయుల 200 సంవత్సరాల  దుర్మార్గ పాలనలో అన్ని రంగాల మాదిరే వైద్య రంగమూ వ్యాధిగ్రస్థమైంది. వరుస కరవుల కారణంగా పౌష్టికాహారలోపం వెన్నాడి లక్షల మంది చిన్నచిన్న జబ్బులకూ పిట్టల్లా రాలిపోయారు. స్వాతంత్య్రం సిద్ధించాక ఒక్కో అడుగు వేసుకుంటూ జవసత్వాలు కూడదీసుకున్నాం. ఇప్పుడు అనూహ్యంగా 47 లక్షల మంది సిబ్బందితో ప్రపంచంలోనే అతిపెద్ద వైద్యారోగ్య రంగాన్ని సృష్టించుకున్నాం. మందు బిళ్లల కోసం అంగలార్చిన మనమే... ప్రపంచ ఔషధ అవసరాల్లో 20% తీరుస్తున్నాం. కలరా, మశూచి, పోలియో వంటి మహమ్మారులను తరిమేశాం. కరోనా సంక్షోభంలోనూ టీకాల ఉత్పత్తితో మానవాళికి బతుకుపై భరోసా కల్పించాం. ఇలాంటి  మెరుపులతోపాటు దృష్టి సారించాల్సిన కొన్ని మరకలూ ఉన్నాయి. అమృత మహోత్సవాల నేపథ్యంలో... వైద్య రంగంలో ఇన్నేళ్ల ప్రయాణం ఎలా సాగింది? రానున్న 25 సంవత్సరాల్లో చేరుకోవాల్సిన మైలురాళ్లు ఏమిటి?  


దేశంలో ఆరోగ్య రంగానికి ప్రభుత్వం కేటాయిస్తున్న నిధులు జీడీపీలో 2.1 శాతం


ఇది 1947లో భారతీయుడి సగటు ఆయుర్దాయం. 32 సంవత్సరాలు:  ఇప్పుడది 70 ఏళ్లు


ఆంగ్లేయులు వెళ్లిపోయే నాటికి ప్రతి 1000 మందిలో ఏడాదికి చనిపోయేవారి సంఖ్య 45 మంది:  నేడు అది 7 మాత్రమే


 

ఇది స్వాతంత్య్రం వచ్చే నాటికి ప్రతి వెయ్యి మంది పురుషులకు స్త్రీల నిష్పత్తి 946: ప్రస్తుతం అది 1020


 

భారత్‌ స్వేచ్ఛా వాయువులు పీల్చుకునే నాటికి ఏటా మలేరియా మరణాల సంఖ్య ఇది 8 లక్షలు: ఇప్పుడవి 1000 మాత్రమే


ప్రాథమిక వైద్యమే ప్రాణాధారం

గ్రామాలకూ అందుబాటులో వైద్య సేవలు

పురోగమనంలో ఆరోగ్య భారతం

ఆంగ్లేయుల నుంచి 1947లో విముక్తి పొంది, స్వతంత్ర దేశంగా అవతరించిన భారత్‌కు అధిక జనాభా, కొడిగట్టిన ఆర్థిక పరిస్థితి, అంటువ్యాధులు శాపంగా పరిణమించాయి. జవసత్వాలు కూడదీసుకుంటూ.. ప్రభుత్వాలు చేసిన కృషి ఫలితంగా ఆరోగ్య సూచికల్లో, మౌలిక వసతుల్లో భారత్‌ పురోభివృద్ధి దిశగా పయనిస్తోంది. మన వైద్యనిపుణులు మశూచి, ప్లేగు వ్యాధులను నిర్మూలించగలిగారు. మలేరియాను అదుపులోకి తీసుకొచ్చారు. పిల్లలకు ఉచిత టీకాల పంపిణీ కోసం 2014లో ప్రారంభించిన ఇంద్రధనుష్‌ కార్యక్రమం సత్ఫలితాలనిస్తోంది. 2014లోనే భారత్‌ను పోలియో రహిత దేశంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. జిల్లాకొక వైద్య కళాశాలను స్థాపించడం ద్వారా స్పెషాలిటీ, సూపర్‌ స్పెషాలిటీ సేవలను ప్రజలకు చేరువ చేసేందుకు అవసరమైన కార్యాచరణ మొదలైంది. నాణానికి మరోవైపు... ఇప్పటికీ పట్టణాల్లో 60%, గ్రామాల్లో 50% మంది ఎక్కువగా ప్రైవేటు వైద్యులనే సంప్రదిస్తున్నారు. 18 ఏళ్లలోపు పిల్లల్లో ఏకంగా 47.2 కోట్ల మంది పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. క్షయ పీడితులు ఎక్కువగా ఉన్నది మన దేశంలోనే. నవజాత శిశువుల మరణాలూ ఆందోళన కలిగిస్తున్నాయి. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 వసంతాలు పూర్తవుతున్న నేపథ్యంలో ఇప్పటివరకు సాధించిన లక్ష్యాలు.. చేరుకోవాల్సిన గమ్యాలపై సింహావలోకనం..


మార్గదర్శకత్వానికి ఎన్నెన్నో కమిటీలు

ప్రజలకు ఆరోగ్యాన్ని చేరువ చేయడానికి ప్రభుత్వం భోర్‌, ఛద్దా, ముఖర్జీ, కర్తార్‌సింగ్‌ తదితర కమిటీలను ఏర్పాటు చేసింది. వీటి సూచనలతో పీహెచ్‌సీలు, సామాజిక ఆరోగ్య కేంద్రాలు, జిల్లా ఆసుపత్రుల ఏర్పాటు. ఆరోగ్య పరిరక్షణకు చికిత్స అనుసంధానం, మల్టీపర్పస్‌ హెల్త్‌ వర్కర్లు, ఏఎన్‌ఎంలు, ఆశ కార్యకర్తలు, ల్యాబ్‌ టెక్నీషియన్ల నియామకం, కుటుంబ నియంత్రణకు ప్రత్యేక కార్యక్రమం, ప్రధానమంత్రి జన్‌ ఆరోగ్య యోజన వంటి ఎన్నో కార్యక్రమాలు అమలయ్యాయి. జాతీయ ఆరోగ్య విధానం(1983, 2002, 2017)తోనూ ప్రగతికి బాటలు వేశారు.


అవకాశాల గని ‘ఈ-హెల్త్‌’

దేశంలో ఇంటర్నెట్‌ ఆధారిత వైద్య సేవలు అందిస్తున్న ఈ-హెల్త్‌ రంగం విలువ 2022 నాటికి రూ.86 వేల కోట్లకు చేరింది. దీన్ని ఆలంబనగా చేసుకుని విస్తృతమైన ఉపాధి కల్పించవచ్చు.


తల్లీబిడ్డల సంరక్షణలో ముందడుగు

దేశంలో ఏఎన్‌ఎం వ్యవస్థ (1960-70)ను ఏర్పాటు చేశాక మాతాశిశు సంరక్షణ కార్యక్రమాల నిర్వహణ పెరిగింది. అంగన్‌వాడీ వ్యవస్థ(1975) ద్వారా మహిళలకు కుటుంబ నియంత్రణ, పిల్లల పెంపకం, వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన తదితర కార్యక్రమాలను రూపొందించారు. ఆశా ఆరోగ్య కార్యకర్తల వ్యవస్థ(2005)తో మహిళల ఆరోగ్యంపై మరింతగా దృష్టి కేంద్రీకరించడానికి అవకాశాలు పెరిగాయి.

* 1992-93లో 26 శాతంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు ఇప్పుడు 86.6 శాతానికి పెరిగాయి. కొన్ని రాష్ట్రాల వెనుకబాటు ఫలితంగా ప్రసూతి మరణాల్లో 186 దేశాల్లో భారత్‌ 120వ ర్యాంకుతో దిగువన ఉంది. మహిళల్లో రక్తహీనత, అధిక రక్తపోటు, మధుమేహం, కీళ్లనొప్పులు, క్యాన్సర్‌ వంటి వ్యాధుల తీవ్రత పెరుగుతోంది.

* దేశంలో తట్టు (స్మాల్‌పాక్స్‌)ను ఏప్రిల్‌ 1977 నాటికి పూర్తిగా నిర్మూలించగలిగా.


ఔషధ రంగంలో ఘనం

ఔషధాల ఉత్పత్తిలో పరిమాణం పరంగా భారత్‌ ప్రపంచంలోనే 3వ స్థానంలో ఉంది. ప్రపంచ దేశాల అవసరాల్లో 20% మనమే తీరుస్తున్నాం. ప్రపంచానికి జనరిక్‌ ఔషధాలను సమకూరుస్తున్న అతిపెద్ద దేశం భారత్‌. ప్రపంచవ్యాప్తంగా ఎయిడ్స్‌ వ్యాధిగ్రస్థులు వినియోగించే యాంటీ వైరల్‌ ఔషధాల్లో 80% మన దేశం నుంచి సరఫరా చేస్తున్నవే.


టీకాల హబ్‌

దేశంలో టీకాల ఉత్పత్తి అనూహ్యంగా పెరిగింది. ప్రపంచంలో వినియోగించే వ్యాక్సిన్లలో 60% భారత్‌ నుంచే సరఫరా అవుతున్నాయి. కరోనాను ఎదుర్కొనేందుకు భారత్‌ బయోటెక్స్‌ ద్వారా కొవాగ్జిన్‌, ఆక్స్‌ఫర్డ్‌-ఆస్ట్రాజెనికా ద్వారా కొవిషీల్డ్‌, బయోలాజికల్‌-ఈ ద్వారా కార్బోవాక్స్‌ టీకాలు భారత్‌లోనే ఉత్పత్తి అయ్యాయి.


గ్రామాలు.. నగరాల్లో ఒకేరకమైన వైద్యం!

రానున్న పాతికేళ్లలో వైద్యరంగం ఎలా పురోగమించాలో.. ఏయే లోపాలను సవరించుకోవాలో నిపుణులు ఇలా విశ్లేషిస్తున్నారు..

* వైద్యరంగానికి తమ ఆదాయంలో బ్రిటన్‌ 12%, అమెరికా 14%, జపాన్‌ 9-10%... చొప్పున నిధులు కేటాయిస్తుంటే.. మనం 2.1% దగ్గరే ఆగిపోయాం. దేశంలో గ్రామాలు, నగరాల్లో ప్రజలకు ఒకేరకమైన వైద్యం అందుబాటులో ఉండాలి. ఆరోగ్య సూచీల్లో కేరళ, తమిళనాడు వంటి రాష్ట్రాలు... ఐరోపా దేశాలతో సమానంగా పురోగమిస్తున్నాయి. ఇదే సమయంలో ఉత్తరప్రదేశ్‌, రాజస్థాన్‌, బిహార్‌ వంటి రాష్ట్రాలు దిగువన ఉన్నాయి. ఇలాంటి వ్యత్యాసాలను నివారించాలి.

వైద్య పర్యాటకంతో ఉపాధికి బాటలు 

అభివృద్ధి చెందిన దేశాలతో పోల్చితే భారత్‌లో అయిదో వంతు తక్కువ ఖర్చుతోనే నాణ్యమైన వైద్య సేవలు లభిస్తున్నాయి. మనదేశ వైద్యపర్యాటకం వ్యవస్థ విలువ 2022 నాటికి సుమారు రూ.90 వేల కోట్లకు చేరింది. దీని అభివృద్ధికి ప్రభుత్వాలు కృషి చేయాలి.

సమగ్ర ప్రాథమిక ఆరోగ్య వ్యవస్థ కావాలి

‘మహమ్మారులు వాస్తవం. వీటి నుంచి కాపాడుకోవడానికి ఖర్చు చాలా ఎక్కువ కావడంతోపాటు అవి మనం తట్టుకోలేనంతగా దాడి చేస్తాయని కొవిడ్‌ కాలంలో స్పష్టమైంది. దేశంలో ప్రజారోగ్య వ్యవస్థను పటిష్ఠం చేయడం, సమగ్ర ప్రాథమిక ఆరోగ్య వ్యవస్థను నెలకొల్పడం తప్ప మరో మార్గం లేదు. దీన్ని ప్రాధాన్యంగా గుర్తించి, నిధులు కేటాయించాలి. ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యం లాంటి ప్రయోగాలతో సమయాన్ని వృథా చేయకూడదు. ప్రాథమిక వైద్యం ప్రభుత్వ రంగంలోనే ఉచితంగా అందరికీ అందుబాటులో ఉండేలా నిధులు కేటాయించాల’ని కేంద్ర ఆరోగ్యశాఖ మాజీ కార్యదర్శి సుజాతారావు అభిప్రాయపడ్డారు.

ఇప్పటికీ ఆరోగ్య బీమా 15 శాతమే

‘తీవ్ర అనారోగ్య సమస్య వస్తే 70% మంది ప్రజలకు సొంత డబ్బులు, అప్పులే దిక్కు. ఆరోగ్యశ్రీ, ఆయుష్మాన్‌ భారత్‌ పథకాలతో కొంతవరకు మేలు జరిగినా... అన్ని వర్గాలకు ధీమా అందించడంలో బ్రిటన్‌ వైద్య విధానాన్ని అనుసరిస్తే మేలు. అక్కడ 97% మంది ప్రజలు నేషనల్‌ హెల్త్‌ సర్వీస్‌ పరిధిలోకి వస్తారు. అమెరికాలోనూ 70% మంది ప్రైవేటుగానైనా ఆరోగ్య బీమా చేసుకుంటున్నారు. భారత్‌లో 15% మంది మాత్రమే ఆరోగ్య బీమా పరిధిలో ఉన్నారు. పేదలు, మధ్యతరగతి ప్రజలందరినీ దీని పరిధిలోకి తీసుకురావాల్సిన అవసరం ఉంద’ని ప్రముఖ జీర్ణకోశ వ్యాధుల నిపుణులు డాక్టర్‌ డి.నాగేశ్వరరెడ్డి, ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం మాజీ ఉపకులపతి ఆచార్య రవిరాజు తాతపూడి సూచిస్తున్నారు.

చిన్న సమస్యలకూ పెద్దాసుపత్రులా?

‘ప్రాథమిక వైద్యాన్ని బలోపేతం చేయకుండా ఎన్ని సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రులు కట్టినా ఫలితం లభించదు. ఇందుకోసం మూడంచెల వైద్య విధానం ఉండాలి. ప్రతి గ్రామానికి ఒక పీహెచ్‌సీ, కనీసం 50 కి.మీ. దూరంలో మాధ్యమిక వైద్యం అందుబాటులో ఉండాలి. సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రులు ప్రతి రెండు జిల్లాలకు ఒకటి చొప్పున ఏర్పాటు చేయాలి. ప్రజలు చిన్న సమస్యలకూ పెద్దాసుపత్రులకు వస్తుండడంతో నిజంగా ఉన్నత వైద్యం అవసరమైన వారికి లభించడంలేద’ని నిమ్స్‌ నెఫ్రాలజీ విభాగాధిపతి ఆచార్య డాక్టర్‌ తాడూరి గంగాధర్‌, ప్రముఖ ఆర్థోపెడిక్‌ సర్జన్‌ డాక్టర్‌ కృష్ణయ్య వివరించారు.


75 ఏళ్ల కిందటితో పోల్చితే వైద్యుల సంఖ్య భారీగా పెరిగినా, వారిలో అత్యధికులు నగరాలు, పట్టణాలకే పరిమితం అవుతుండడం గ్రామీణ ఆరోగ్యానికి శాపంగా మారుతోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల ప్రకారం.. ప్రతి 1000 మందికి ఒక వైద్యుడు ఉండాలి. భారత్‌లో ప్రతి 1400 మందికి ఒకరున్నారు. కానీ మొత్తం వైద్యుల్లో 70% మంది పట్టణాలు, నగరాల్లోనే ఉన్నారు.


ప్రస్తుతం దేశంలో 80% మరణాలకు గుండెజబ్బులు, క్యాన్సర్‌, మధుమేహం, తీవ్ర శ్వాసకోశ వ్యాధులు కారణమవుతున్నాయి. ధూమపానం, మద్యపానం, పౌష్టికాహార లోపం, శారీరక వ్యాయామం లేకపోవడం  ఈ వ్యాధులకు దారి తీస్తున్నాయి.


తొలి అల్లోపతి ఆసుపత్రి ఎప్పుడంటే...

దేశంలో ఆధునిక వైద్య విధానాలను తొలిసారిగా 16వ శతాబ్దంలో ప్రవేశపెట్టింది పోర్చుగీసు వారు. కానీ, తొలి అల్లోపతి ఆసుపత్రిని నిర్మించిన బ్రిటిష్‌ (1664) వారు.. తొలి మెడికల్‌ స్కూలును 1846లో కోల్‌కతాలో నెలకొల్పారు.


ఏటా 1,500 మంది పిల్లల వైద్య నిపుణులకు పట్టాలు

పీడియాట్రిక్స్‌ అసోసియేషన్‌ ప్రకారం... ప్రస్తుతం దేశవ్యాప్తంగా సుమారు 50 వేల మంది పిల్లల వైద్యనిపుణులు ఉన్నారు. ఏటా 1,500 మంది వరకు కొత్తగా పట్టా పుచ్చుకుంటున్నారు. అయినా దేశంలో సగటున 10వేల జనాభాకు ఒక పిల్లల వైద్యుడు ఉండాలనే లక్ష్యం నెరవేరడం లేదు.


- ఈనాడు, హైదరాబాద్‌


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని