Electricity bill: కార్పొరేట్ల మేలుకే విద్యుత్తు బిల్లు

ఆమోదం పొందితే ప్రభుత్వ డిస్కంలకు నష్టాలు ఖాయం

లాభదాయక ప్రాంతాలన్నీ ‘ప్రైవేటు’ చేతుల్లోకి...

రైతులు తీవ్రంగా నష్టపోతారు

‘ఈనాడు’ ముఖాముఖిలో అఖిల భారత విద్యుత్తు సంఘాల సమాఖ్య ఛైర్మన్‌ శైలేంద్ర దూబే

ఈనాడు, హైదరాబాద్‌ : ‘‘కార్పొరేటు సంస్థలకు మేలు చేసేందుకే విద్యుత్తు చట్ట సవరణ బిల్లును హడావుడిగా కేంద్రం పార్లమెంటులో ప్రవేశపెట్టింది. దీనిని యథాతథంగా ఆమోదిస్తే ప్రస్తుతం లాభాలు వస్తున్న ప్రాంతాల్లో ప్రైవేటు డిస్కంలు పాగా వేస్తాయి. ప్రభుత్వ డిస్కంలు నష్టాలు వచ్చే ప్రాంతాలకే పరిమితమై నిండా మునిగిపోతాయి. విద్యుత్తు శాఖ ఉద్యోగుల భవితవ్యం ప్రశ్నార్థకమవుతుంది’’ అని అఖిలభారత విద్యుత్తు సంఘాల సమాఖ్య ఛైర్మన్‌ శైలేంద్ర దూబే ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్‌ చట్ట సవరణ బిల్లు-2022ను కేంద్ర ప్రభుత్వం ఈనెల 8న పార్లమెంటులో ప్రవేశపెట్టింది. ఈ బిల్లును ప్రతిపక్షాలతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న ఉద్యోగ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. దీంతో కేంద్రం ఈ బిల్లును పార్లమెంటు స్థాయీ సంఘం అధ్యయనానికి పంపింది. ‘‘ప్రధాని మోదీ బాధ్యతలు స్వీకరించిన తరవాత గత 8 ఏళ్లలో చట్ట సవరణ బిల్లులను పార్లమెంటులో నిరసనల మధ్య ఆమోదించారే తప్ప ఏనాడూ స్థాయీ సంఘానికి పంపలేదు. ఈ బిల్లు ఇలా పంపడానికి మేము చేపట్టిన ఆందోళనలే కారణమని’’ దూబే అంటున్నారు. దేశవ్యాప్తంగా 27 లక్షల మంది విద్యుత్తు ఉద్యోగులకు చెందిన సంఘాల  సమాఖ్యకు ఛైర్మన్‌గా పనిచేస్తున్న ఆయనకు ఈ రంగంలో అపార అనుభవముంది. ఈ బిల్లుతో ఏం జరగబోతోందనే విషయంపై ఆయనను ‘ఈనాడు’ ప్రత్యేకంగా ఇంటర్య్వూ చేసింది...

విద్యుత్తు చట్ట సవరణ బిల్లును ప్రతిపక్షాలతో పాటు ఉద్యోగులు ఎందుకు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు? దానివల్ల కలిగే నష్టాలేంటి?

వినియోగదారుల నుంచి నెలనెలా బిల్లు వసూలు చేసుకునే విద్యుత్తు పంపిణీ రంగంలో ప్రాంతాలవారీగా ప్రైవేటు డిస్కం లేదా కంపెనీలకు లైసెన్సు ఇస్తామని బిల్లులో పేర్కొన్నారు. దీనివల్ల లాభాలు వచ్చే ప్రాంతాల్లోనే ప్రైవేటు డిస్కంలు లైసెన్సులు తీసుకుంటాయి. వాణిజ్య, పరిశ్రమల వినియోగదారులకే అవి కరెంటు సరఫరా చేస్తామంటాయి. అప్పుడు రాష్ట్ర ప్రభుత్వ డిస్కంలు నష్టాలు వచ్చే ప్రాంతాలకు పరిమితమై నష్టాల్లో కూరుకుపోతాయి. వినియోగదారులపై ఆర్థికభారం పడటమే కాకుండా విద్యుత్తు ఉద్యోగుల మనుగడ ప్రశ్నార్థకమవుతుంది.

ఇప్పటికే ప్రభుత్వ డిస్కంలకు తీవ్ర నష్టాలు వస్తున్నాయి కదా... తప్పెవరిది ?

డిస్కంలకు నష్టాలు రావడానికి పూర్తిగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే కారణం. రాష్ట్ర ప్రభుత్వాలు డిస్కంలను స్వతంత్రంగా పనిచేయనీయడం లేదు. రాయితీపై లేదా ఉచితంగా కరెంటు ఇవ్వమని డిస్కంలను ఆదేశిస్తూ వాటికి నిధులను మాత్రం విడుదల చేయడం లేదు. దీనివల్ల డిస్కంలు నష్టాల్లో మునిగిపోతున్నాయి.

ఈ నష్టాల నుంచి బయటపడేసి డిస్కంలను కాపాడేందుకే బిల్లు తెస్తున్నట్లు కేంద్రం చెబుతోంది కదా?

కేంద్రం కేవలం ప్రైవేటు కార్పొరేటు సంస్థలకు మేలు చేసేందుకే విద్యుత్తు చట్ట సవరణ బిల్లును తెస్తోంది. ప్రైవేటు విద్యుదుత్పత్తి సంస్థలకు డిస్కంలు బకాయిలు చెల్లించడం లేదని కేంద్రం చెబుతోంది. మరి రాష్ట్ర ప్రభుత్వ యాజమాన్యాల్లోని విద్యుదుత్పత్తి సంస్థ (జెన్‌కో)లకు డిస్కంలు బకాయిలు కట్టడం లేదు. వాటి గురించి కేంద్రం ఎందుకు మాట్లాడటం లేదు. మా సంఘాలుగానీ, సమాఖ్యగానీ ఏ రాజకీయ పార్టీకీ, ప్రభుత్వానికీ మద్దతివ్వదు. విద్యుత్తు రంగాన్ని ప్రైవేటీకరించకుండా కాపాడుకోవడానికే మేం పోరాడుతున్నాం.

విద్యుత్తు బిల్లు తేవడంలో కేంద్రం తొందరపాటుగా వ్యవహరిస్తోందని భావిస్తున్నారా?

అవును, కచ్చితంగా అంతే. విద్యుత్తు చట్ట సవరణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టడానికి ప్రజాస్వామ్య ప్రక్రియను పాటించాలని ప్రధాని మోదీకి ఇప్పటికే రెండుసార్లు లేఖలు రాశాం. బిల్లు తయారీ దశలో ఈ రంగానికి సంబంధించిన అన్ని భాగస్వామ్య పక్షాల అభిప్రాయాలూ తెలుసుకోవాలని కోరాం. బిల్లు పార్లమెంటులో ప్రవేశపెట్టడానికి చాలా ముందుగా విద్యుత్తు శాఖ వెబ్‌సైట్‌లో ప్రజలు ముందుంచాలి. ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లో 34 బిల్లులు ప్రవేశపెడతామని 2022 జులై 17 ఇచ్చిన నోట్‌లో చెప్పారు. వాటిలో విద్యుత్తు బిల్లు లేదు. కానీ ఆగస్టు 6న విద్యుత్తు బిల్లును పార్లమెంటులో ప్రవేశ పెడుతున్నట్లు సప్లిమెంటరీ నోట్‌ ఇచ్చారు. 8వ తేదీ ఉదయం మరో సప్లిమెంటరీ ఇచ్చి బిల్లు ఇచ్చి పాస్‌ చేయమని ఎంపీలను కోరారు. ఇది  ప్రజాస్వామ్య ప్రక్రియ ఎలా అవుతుంది? అందుకే దీన్ని వ్యతిరేకిస్తూ రోడ్లపైకి వచ్చాం.

సామాన్య వినియోగదారులపై బిల్లు ప్రభావం ఎలా పడుతుంది?

ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వాలు తక్కువ ఛార్జీలకు లేదా ఉచితంగా కొన్ని వర్గాలకు కరెంటు సరఫరా చేస్తున్నాయి. ప్రైవేటు డిస్కంలు వస్తే రాయితీలుండవు. అవి లేకపోతే రైతులకు ఉచిత కరెంటు ఇవ్వడం సాధ్యం కాదు. ఉదాహరణకు ఒక రైతు తన పొలానికి నీరు పెట్టేందుకు వ్యవసాయ బోరు వద్ద 7.5 హెచ్‌పీ మోటారును రోజుకు 6 గంటలు నడిపితే నెలకు రూ.10 వేల కరెంటు బిల్లు వస్తుంది. అంతమొత్తం పేద రైతులు ఎలా కట్టగలుగుతారు. ఇలాగే పేదల ఇళ్లకు ఇచ్చే కరెంటు బిల్లులూ పెరుగుతాయి.

ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు రాయితీ నిధులివ్వనందున డిస్కంలు నష్టాల్లో కూరుకుపోతున్నాయి కదా? వాటిని ఎలా కాపాడాలి?

డిస్కంలు దేశవ్యాప్తంగా జెన్‌కోల నుంచి కరెంటు కొన్నందుకు రూ.1.10 లక్షల కోట్లు బకాయిలు చెల్లించడం లేదని కేంద్రం ప్రైవేటీకరణకు బిల్లు తెస్తోంది. కానీ డిస్కంలకు రూ.1.40 లక్షల కోట్లు రాష్ట్ర ప్రభుత్వాలు ఇవ్వాలి. ఇందులో రూ.77 వేల కోట్లకు పైగా రాయితీ నిధులే ఉన్నాయి. ఇవికాకుండా ప్రభుత్వ శాఖల బిల్లులు మరో రూ.66 వేల కోట్లు బకాయిలున్నాయి. ఇవన్నీ డిస్కంలకు రాష్ట్రాలు విడుదల చేస్తే ఇక జెన్‌కోలకు చెల్లించాల్సిన రూ.1.10 లక్షల కోట్ల బకాయిలు ఎందుకుంటాయి. తప్పు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలదే.

* రాష్ట్రాలు బకాయిలు పెడుతున్నా మీరు ప్రభుత్వాలపై ఎందుకు పోరాడటం లేదు? డిస్కంలను కాపాడే బాధ్యత విద్యుత్తు ఉద్యోగుల సంఘాలకు లేదా ?

కచ్చితంగా పోరాడతాం. నేను నేను ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందినవాడిని. యూపీలో డిస్కంలకు రాష్ట్ర ప్రభుత్వం ఏటా రాయితీ నిధుల రూపంలో రూ.20 వేల కోట్లు ఇవ్వాలి. ఇవి కాక మరో రూ.12 వేల కోట్లు ప్రభుత్వ శాఖల బిల్లులు చెల్లించాలి. ఇవి ఇవ్వడం లేదని రెండేళ్ల క్రితం ఉద్యోగ సంఘాలు సమ్మె చేశాయి. చండీగఢ్‌, కశ్మీర్‌, పుదుచ్చేరి వంటి ప్రాంతాల్లో సైతం ఉద్యోగ సంఘాలు నిరసనలు తెలిపాయి. త్వరలో నేను తమిళనాడు వెళుతున్నాను. అక్కడ పొరుగుసేవల విధానంలో ఉద్యోగులను నియమించడాన్ని సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఏపీ, తెలంగాణలో రూ.వేల కోట్లు డిస్కంలకు రాష్ట్ర ప్రభుత్వాలు బకాయిలు పెట్టడం అక్కడి రాష్ట్ర ప్రభుత్వాలదే తప్పు.

* బిల్లును విద్యుత్తు ఉద్యోగ సంఘాలు పూర్తిగా వ్యతిరేకిస్తున్నాయా లేక మార్పులు చేస్తే సరిపోతుందా ?

ప్రజాస్వామ్య ప్రక్రియలో బిల్లు తేవాలనేది మా మొదటి డిమాండు. ఇక విద్యుత్తు రంగం లేదా ఉద్యోగులపై ప్రభావం చూపే ఏ విధాన నిర్ణయాన్నీ మా సమాఖ్య అంగీకరించదు. మా వాదన స్థాయీ సంఘానికి గట్టిగా చెబుతాం.

* స్థాపిత విద్యుదుత్పత్తి సామర్థ్యం చాలా ఎక్కువగా ఉన్నా కొన్ని ప్రాంతాల్లో కరెంటు కోతలుండటానికి కారణం ఏంటి? డిస్కంల అసమర్థతే కారణమా?

ఇదే ప్రశ్నను మా సమాఖ్య కూడా ప్రభుత్వాన్ని అడుగుతోంది. మనదేశంలో ఇప్పుడు అన్ని జెన్‌కోల స్థాపిత విద్యుదుత్పత్తి సామర్థ్యం దాదాపు 4 లక్షల మెగావాట్లుంటే రోజూవారీ డిమాండు కేవలం 2 లక్షల మెగావాట్లు మాత్రమే. అయినా అందరికీ కరెంటు నిరంతరం సరఫరా చేయలేకపోవడం ప్రభుత్వాల వైఫల్యమే. రాష్ట్ర ప్రభుత్వాలు శ్రద్ధ చూపిన ప్రాంతాల్లో నష్టాలొస్తున్నా డిస్కంలు కరెంటు సరఫరా చేస్తున్నాయి. లేనిచోట కోతలు విధిస్తున్నారు.

* జెన్‌కోలకు చెల్లించే సొమ్ము ఎక్కువగా ఉండడం వల్ల కరెంటు కొనుగోలు భారం పెరిగి డిస్కంలు నష్టపోతున్నాయనే వాదన ఉంది కదా ?

అవును కచ్చితంగా అది కూడా ఒక కారణమే.  మీకు ఒక ఉదాహరణ చెబుతాను. మధ్యప్రదేశ్‌లో ఏటా రూ.5 వేల కోట్లు విద్యుదుత్పత్తి కేంద్రాలకు ఉచితంగా నేరుగా చెల్లిస్తున్నాయి. విద్యుత్తు కొనుగోలు ఒప్పందాల(పీపీఏ)ను రాజకీయ ఒత్తిళ్లతో రాష్ట్ర ప్రభుత్వ డిస్కంలు చేసుకోవడం వల్ల దేశంలో కొన్నిచోట్ల జెన్‌కోలకు ఇలా డిస్కంలు చెల్లిస్తున్నాయి. ఒకసారి పీపీఏ చేసుకుంటే కొన్నేళ్ల పాటు కరెంటు కొన్నా కొనకపోయినా స్థిరఛార్జీ రూపంలో జెన్‌కోకు డిస్కం సొమ్ము చెల్లించాల్సిందే. కరెంటు కొనుగోళ్లలో ఇలాంటి తేడాలున్నందున డిస్కంలపై ఆర్థికభారం అధికంగా పడుతోంది.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని