కామన్‌వెల్త్‌ క్రీడల్లో భారత్‌ విజయం సంతోషదాయకం

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌

ఈనాడు-అమరావతి: కామన్‌వెల్త్‌ క్రీడల్లో భారత్‌ 22 స్వర్ణాలు, 16 రజతాలు, 23 కాంస్య పతకాలు సాధించి పతకాల పట్టికలో నాలుగో స్థానంలో నిలవడం, మన క్రీడాకారుల గెలుపు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.  క్రీడాభిమానులు, ఔత్సాహిక క్రీడాకారుల్లో ఈ విజయాలు నూతన ఉత్తేజాన్ని నింపిందనడంలో ఎలాంటి సందేహం లేదన్నారు. తెలుగు విజేతలు పి.వి.సింధు, ఆచంట శరత్‌ కమల్‌, సాత్విక్‌, సాయిరాజ్‌, నిఖత్‌ జరీన్‌, ఆకుల శ్రీజ, మేఘన, రజని, హుస్సాబుద్దీన్‌, కిదాంబి శ్రీకాంత్‌, గాయత్రీగోపీచంద్‌ తదితరులకు తెలుగు ప్రభుత్వాలు ఉదారంగా నగదు ప్రోత్సాహకాలు, ఉద్యోగావకాశాలు కల్పించాలని పేర్కొన్నారు.

రాజకీయ మేధావి వెంకయ్యనాయుడు
ఉపరాష్ట్రపతిగా పదవీ విరమణ చేయనున్న ఎం.వెంకయ్యనాయుడు రాజకీయ మేధావి అని పవన్‌కల్యాణ్‌ ఒక ప్రకటనలో అభివర్ణించారు. ‘అయిదు దశాబ్దాల రాజకీయ జీవితంలో ఏ పదవీ లేకుండా ఆయన ఏనాడూ లేరు. ఇటు శాసనసభ, అటు రాజ్యసభల్లో ఆయన చేసిన ప్రసంగాలు ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేశాయి. రాజ్యసభ ఛైర్మన్‌గా ఆయన సభను నడిపిన తీరు ఎంతో ప్రశంసనీయం’ అని జనసేన అధిపతి పేర్కొన్నారు. విశ్రాంతి తీసుకుంటే తనకు అలసట కలుగుతుందని అన్న ఆయన మాటల్లోనే వెంకయ్యను అర్థం చేసుకోగలమన్నారు. విద్యార్థి దశలోనే రాజకీయాల్లో ప్రవేశించి అత్యవసర పరిస్థితిని ఎదిరించి జైలు జీవితం గడిపి ఉపరాష్ట్రపతి పదవి వరకూ ఆయన సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో ఎన్నో మలుపులు ఉన్నాయని, అందుకే ఆయనను రాజకీయ బాటసారి అంటున్నానని పవన్‌ తెలిపారు.

* ఇస్లాం పరిరక్షణకు ప్రాణాలను తృణప్రాయంగా త్యజించిన అమరులను స్మరించి, ప్రార్ధించే ఈ మొహర్రం పవిత్ర దినాన ఇస్లాంపై విశ్వాసం ఉన్న ప్రతి ఒక్కరికీ భగవంతుడు ఆశీస్సులు అందజేయాలని కోరుకుంటున్నట్లు  పవన్‌కల్యాణ్‌ ప్రకటనలో పేర్కొన్నారు.


మరిన్ని

ap-districts
ts-districts