ప్రైవేట్‌ డీఈడీ కళాశాలలను కౌన్సెలింగ్‌కు అనుమతించండి

పాఠశాల విద్య కమిషనర్‌, డీఈఈ సెట్‌ కన్వీనర్‌కు హైకోర్టు ఆదేశం

ఈనాడు, అమరావతి: డీఈఈ సెట్‌ ద్వారా నిర్వహించే విద్యార్థుల ప్రవేశ కౌన్సెలింగ్‌ ప్రక్రియలో పాల్గొనేందుకు కోర్టును ఆశ్రయించిన ప్రైవేట్‌ డీఈడీ కళాశాలలను అనుమతించాలని డీఈఈ సెట్‌ కన్వీనర్‌, పాఠశాల విద్య కమిషనర్‌ను హైకోర్టు ఆదేశించింది. అవసరమైతే కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ తేదీలను పొడిగించాలని స్పష్టం చేసింది. అనుబంధ గుర్తింపు పొందే వ్యవహారంలో రుసుము చెల్లింపు, తదితర ప్రక్రియను పూర్తిచేయాలని కోర్టును ఆశ్రయించిన ప్రైవేటు డీఈడీ కళాశాలల యాజమాన్యాలను ఆదేశించింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బి.కృష్ణమోహన్‌ గురువారం ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశిస్తూ విచారణను నాలుగు వారాలకు వాయిదా వేశారు. డీఈఈ సెట్‌-2022 కౌన్సెలింగ్‌లో పాల్గొనేందుకు కేవలం ప్రభుత్వ డైట్‌ కళాశాలలకే అనుమతి ఇవ్వడాన్ని సవాలు చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 79 ప్రైవేట్‌ డీఈడీ కళాశాలలు హైకోర్టును ఆశ్రయించాయి. న్యాయవాది మతుకుమిల్లి శ్రీవిజయ్‌ వాదనలు వినిపిస్తూ.. విద్యార్థుల ప్రవేశ కౌన్సెలింగ్‌ ప్రక్రియలో కేవలం ప్రభుత్వ కళాశాలలను అనుమతించి ప్రైవేటు కళాశాలలను నిరాకరించడం వివక్ష చూపడమేనన్నారు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని