గోదావరికి మళ్లీ వరద

రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ, పోలవరం, కుక్కునూరు, కూనవరం, ఎటపాక, న్యూస్‌టుడే: గోదావరికి వరదలు మళ్లీ పెరుగుతున్నాయి. నది ఉప్పొంగుతోంది. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ప్రవాహ వేగం గంటగంటకూ పెరుగుతోంది. కోనసీమలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కొన్ని ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. గురువారం రాత్రి 9 గంటలకు బ్యారేజీ వద్ద నీటిమట్టం 14.60 అడుగులు ఉంది. 14,09,029 లక్షల క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. పోలవరం నుంచి ప్రాజెక్టుకు వెళ్లే మార్గంలోని కడెమ్మ వంతెనపై, పోలీసు చెక్‌పోస్టులోకి గురువారం నీరు చేరడంతో రాకపోకలకు అంతరాయమేర్పడింది. ప్రాజెక్టు స్పిల్‌వే వద్ద సాయంత్రానికి నీటిమట్టం 34.50 మీటర్లకు చేరింది. 48 గేట్ల నుంచి 11.95 లక్షల క్యూసెక్కులను దిగువకు విడిచిపెడుతున్నారు.

* గోదావరి వరద భద్రాచలం వద్ద నెమ్మదిగా పెరుగుతోంది. గురువారం ఉదయం 51.30 అడుగులున్న వరద, సాయంత్రం 7 గంటలకు 52.40 అడుగులకు చేరింది. కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లోని గ్రామాల సమీపంలోకి నీరు చేరింది.

* అశ్వారావుపేట-భద్రాచలం వయా కుక్కునూరు అంతర్‌రాష్ట్ర రహదారి గోదావరి వరదలో మునిగిపోయింది. దీంతో ఈ రహదారిపై రాకపోకలు నిలిచాయి.

* అల్లూరి సీతారామరాజు జిల్లాలోని కూనవరం, టేకులబోరు, శబరికొత్తగూడెం, టేకుబాక, తాళ్లగూడెం గ్రామాల్లో వందల ఇళ్లు జలమయమయ్యాయి. నెల వ్యవధిలోనే రెండోసారి ఇళ్లు వరద పాలు కావడంతో పూర్తిగా దెబ్బతింటాయనే ఆందోళన బాధితుల్లో వ్యక్తమవుతోంది. ఎటపాక మండలం కన్నాయిగూడెం ప్రధాన రహదారిపై వరద ప్రవహిస్తోంది. దీంతో తెలంగాణ రాష్ట్రం చర్ల, వెంకటాపురం, వాజేడు, భద్రాచలం మండలాలకు రాకపోకలు నిలిచాయి. నెల్లిపాక, మురుమూరు, రాయనపేట జాతీయ రహదారులపై వరద కొనసాగుతోంది. దీంతో మహారాష్ట్ర, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా రాష్ట్రాలకు రాకపోకలు స్తంభించాయి. వరరామచంద్రాపురం, చింతూరు మండలాల్లోని పలు ప్రాంతాల్లోకి వరద చేరింది.


పరిహారం కోసం బాధితుల నిరసన

చింతూరు, వరరామచంద్రాపురం, న్యూస్‌టుడే: తమను 41.5 కాంటూరులో చేర్చి పోలవరం పరిహారం ఇప్పిస్తే వేరే ప్రాంతాలకు వెళ్లిపోతామని అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండలం శబరిఒడ్డు, వరరామచంద్రాపురం మండలం ఒడ్డుగూడెం వాసులు విన్నవించారు. ఏటా వరదలతో ఇబ్బంది పడుతున్నా తమను కనీసం పట్టించుకోవడం లేదని వాపోయారు. గురువారం చింతూరులో వరదలో మహిళలు, స్థానికులు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నెల రోజులు గడవకుండానే మళ్లీ వరద వస్తోందని, ఇంకెన్నాళ్లు ఈ కష్టాలు పడాలని ఆవేదన వ్యక్తం చేశారు. మమ్మల్ని జలసమాధి చేస్తారా? అని ప్రశ్నించారు. అఖిలపక్ష నాయకుల ఆధ్వర్యంలో చింతూరు నుంచి చట్టి వెళ్లే దారిలో మూడు గంటలపాటు రాస్తారోకో కూడా చేపట్టారు. ఆ ప్రాంతానికి జిల్లా కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ చేరుకుని వరద బాధితులతో చర్చించి డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని హామీనిచ్చారు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని