ఆటో మ్యుటేషన్‌కు ‘ఆర్‌ఓఆర్‌’ చట్టసవరణ

అధికారుల కసరత్తు

ఈనాడు, అమరావతి: త్వరలో ప్రవేశపెట్టనున్న ఆటో మ్యుటేషన్‌ కోసం రికార్డ్స్‌ ఆఫ్‌ రైట్‌-1971 చట్టాన్ని సవరించనున్నారు. ప్రస్తుత మ్యుటేషన్‌ విధానంలో కొనుగోలు చేసిన వ్యక్తి పేరు వెబ్‌ల్యాండ్‌లో నమోదుకావడానికి ఎక్కువ సమయం పడుతోంది. సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో దస్తావేజుల రిజిస్ట్రేషన్‌ జరిగి...కొనుగోలుదారుడు దరఖాస్తు చేసినప్పటి నుంచి మ్యుటేషన్‌ (పేరు మార్పు) 30 రోజుల్లో జరగాలి. వెబ్‌ల్యాండ్‌లో ఉన్న తప్పుల సవరణ కోసం దరఖాస్తు చేసిన తేదీ నుంచి 21 రోజుల్లో పరిష్కారం కావాలి. కొన్నిచోట్ల చాలా దరఖాస్తులు సకాలంలో పరిష్కారానికి నోచుకోవడంలేదు. నిర్దేశిత గడువు దాటినా పరిష్కారం కానందున దరఖాస్తుదారులు నష్టపోతున్నారు. ఈ పరిస్థితుల్లో రిజిస్ట్రేషన్‌ జరిగితే..వెంటనే ఆటోమేటిక్‌గా మ్యుటేషన్‌ జరిగేలా భూపరిపాలన శాఖ చర్యలు తీసుకుంటోంది. ఇందుకు అనుగుణంగా రికార్డ్స్‌ ఆఫ్‌ రైట్‌-1971 చట్టాన్ని సవరించాల్సిన అవసరం ఉన్నందున ఆ దిశగా అధికారులు కసరత్తు చేస్తున్నారు. వీలుంటే త్వరలో జరగనున్న శాసనసభ సమావేశాల్లో చట్టసవరణ బిల్లు తెచ్చే అవకాశాలు ఉన్నాయి.

దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి
జిల్లాల్లో మ్యుటేషన్‌ దరఖాస్తుల పరిష్కారంలో జరుగుతోన్న జాప్యంపై భూపరిపాలన శాఖ.. జిల్లా అధికారులతో నిర్వహించే సమీక్షల్లో ప్రశ్నిస్తూనే ఉంది. ఈ క్రమంలో గురువారం జరిగిన సమావేశంలోనూ దీనిపై చర్చించారు. ఇకపై దరఖాస్తులను త్వరగా పరిష్కరించకుండా బాధ్యతారాహిత్యంగా వ్యవహరించే రెవెన్యూ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని భూపరిపాలన శాఖ ప్రధాన కమిషనర్‌ సాయిప్రసాద్‌ జిల్లా కలెక్టర్లు, జాయింట్‌ కలెక్టర్లకు స్పష్టంచేశారు. జాప్యం తప్పనిసరైతే సహేతుక కారణాలు ఉండాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా తిరుపతిలో దరఖాస్తుల పరిష్కార తీరు గురించి చర్చించారు.

మళ్లీ శాసనసభకు టైటిలింగ్‌ యాక్టు సవరణ బిల్లు?
భూముల రీ-సర్వే అనంతరం యజమానులకు ‘శాశ్వత భూ యాజమాన్య’ హక్కు కల్పించేందుకు ఉద్దేశించిన టైటిలింగ్‌ యాక్టు సవరణ బిల్లును రానున్న శాసనసభ సమావేశాల్లో ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయి. శాసనసభలో ఆమోదించి పంపిన ఈ బిల్లుకు కేంద్ర ఆమోదం కావాలి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం పంపిన బిల్లుకు హోంశాఖ పలుమార్లు కొర్రీలు వేసింది. ఈ నేపథ్యంలో కేంద్రం సూచించిన మేరకు సవరణలు చేసి, మళ్లీ బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టాలని అధికారులు యోచిస్తున్నారు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని