‘అమరావతి డిజైన్ల’ కేసులో ఏఎంఆర్‌డీఏకు నోటీసులు

ఈనాడు, దిల్లీ: అమరావతి నిర్మాణ డిజైన్లకు సంబంధించిన మధ్యవర్తిత్వం కేసులో అమరావతి మెట్రోపాలిటన్‌ రీజియన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ(ఏఎంఆర్‌డీఏ)కి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. గత ప్రభుత్వ హయాంలో అమరావతి నిర్మాణానికి సంబంధించి ఫోస్టర్‌ ప్లస్‌ పార్ట్‌నర్స్‌ లిమిటెడ్‌ డిజైన్లు సిద్ధం చేసింది. ఆ డిజైన్లకు సంబంధించి తమకు రావల్సిన నిధులు విడుదల చేయాలని ఏఎంఆర్‌డీఏకి కంపెనీ నోటీసులు పంపించింది. ఏఎంఆర్‌డీఏ స్పందించకపోవడంతో సుప్రీంకోర్టులో మధ్యవర్తిత్వ పిటిషన్‌ దాఖలు చేసింది. పిటిషన్‌ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ, జస్టిస్‌ కృష్ణ మురారిలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. అమరావతి మెట్రోపాలిటన్‌ రీజియన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీకి నోటీసులు జారీ చేసింది. కేసు తదుపరి విచారణను సెప్టెంబరు 26వ తేదీకి వాయిదా వేసింది. ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ రాజధాని ప్రాంతంలో రాష్ట్ర ప్రభుత్వం పనులు చేపట్టడం లేదని, ఏపీసీఆర్‌డీఏ చట్టం ప్రకారం మాస్టర్‌ప్లాన్‌ అమలు చేయడంలేదని అమరావతి పరిరక్షణ సమితి తరఫున న్యాయవాది దివ్యేష్‌ ప్రతాప్‌ సింగ్‌ సీజేఐ జస్టిస్‌ ఎన్‌.వి.రమణ ధర్మాసనం ఎదుట గురువారం ప్రస్తావించారు. తమ పిటిషన్‌ను విచారణ జాబితాలో చేర్చాలని ఆయన కోరారు. అమరావతి పరిరక్షణ సమితి పిటిషన్‌ను విచారణ జాబితాలో చేర్చే అంశాన్ని పరిశీలిస్తామని సీజేఐ జస్టిస్‌ ఎన్‌.వి.రమణ తెలిపారు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని