క్వార్ట్‌జైట్‌ తవ్వకాలతో పర్యావరణానికి తీవ్ర విఘాతం

పౌరహక్కుల సంఘం నాయకుడు వి.ఎస్‌.కృష్ణ

కె.కోటపాడు, న్యూస్‌టుడే: అనకాపల్లి జిల్లా కె.కోటపాడు మండలం దాలివలసలో క్వార్ట్‌జైట్‌ తవ్వకాల కోసం ఈ నెల 18న నిర్వహించబోయే ప్రజాభిప్రాయ సేకరణ.. లీజుదారులకు కట్టబెట్టే తంతుగా కనిపిస్తోందని పౌరహక్కుల సంఘం నాయకుడు వి.ఎస్‌.కృష్ణ ఆందోళన వ్యక్తం చేశారు. సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు డి.వెంకన్న, మండల కార్యదర్శి రొంగలి ముత్యాలనాయుడు, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు గండి నాయనబాబుతో కలిసి మైనింగ్‌ కోసం ప్రతిపాదించిన ప్రాంతాన్ని ఆదివారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజాభిప్రాయ సేకరణకు సంబంధిత శాఖ అధికారులు నిబంధనలను పాటించడం లేదన్నారు. ఇప్పటికే రూ.కోట్ల విలువ చేసే ఖనిజాన్ని అనుమతులు లేకుండా తరలించినా  పట్టించుకోలేదని విమర్శించారు. దీనిపై ఫిర్యాదులు రావడంతో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారని పేర్కొన్నారు. దీనికి పంచాయతీల నుంచి తీర్మానాలు, రెవెన్యూ శాఖ నుంచి నిరభ్యంతర ధ్రువీకరణ (ఎన్‌ఓసీ) లేవన్నారు. మైనింగ్‌కు ప్రతిపాదించిన ప్రాంతంలో అనేక చెరువులు, విశాఖకు తాగునీరు అందించే రైవాడ కాలువ ఉన్నందున వీటిపైనా ప్రభావం ఉంటుందని తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రజాభిప్రాయ సేకరణ రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని