Jhanda uncha rahe hamara : ఆ గీతాన్ని రాసినందుకు జైలు శిక్ష..

స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లయినా ఆ గీతానికి వన్నె తగ్గలేదు.. ఇప్పటికీ ఎప్పటికీ దేశభక్తికి ప్రేరణ కలిగిస్తూనే ఉంటుంది. అదే.. ‘ఝండా ఊంచా రహే హమారా.. విజయీ విశ్వ తిరంగా ప్యారా..’ గీతం. కోట్ల మంది భారతీయుల హృదయాలను ఉప్పొంగించిన ఆ గీతాన్ని రచించింది ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాన్పుర్‌కు చెందిన శ్యామ్‌లాల్‌గుప్తా పర్షద్‌. 1924లో ఆయన ఈ గీతాన్ని జైలులోనే అక్షరబద్ధం చేశారు. అనంతర స్వాతంత్య్రోద్యమంలో ఈ గీతం ఒక భాగంగా మారింది. జలియన్‌ వాలాబాగ్‌ అమరవీరుల జ్ఞాపకార్థం శ్యామ్‌లాల్‌ 1924 మార్చి 3న కాన్పుర్‌లోని ఫూల్‌బాగ్‌ మైదానంలో జవహర్‌లాల్‌ నెహ్రూ సమక్షంలో తొలిసారి ఆలపించారు. వెంటనే నెహ్రూ.. శ్యామ్‌లాల్‌ను కౌగిలించుకుని ఈ గీతం దేశచరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని అభినందించారు. ఈ గీతాన్ని రాసినందుకు శ్యామ్‌లాల్‌కు బ్రిటిష్‌ ప్రభుత్వం జరిమానా విధించి, మరోసారి జైలుకు పంపింది. స్వాతంత్య్రం వచ్చాక ఎర్రకోట నుంచి ఈ జాతీయ గీతాలాపన జరిగింది. అప్పటి నుంచి దీనికి ఫ్లాగ్‌సాంగ్‌ పేరు స్థిరపడిపోయింది. 1952 ఆగస్టు 15న ఎర్రకోట వద్ద శ్యామ్‌లాల్‌ స్వయంగా ఈ గీతాన్ని ఆలపించారు. ఆయన కృషికి గుర్తింపుగా భారత ప్రభుత్వం 1973లో పద్మశ్రీతో సత్కరించింది. 1977లో ఆయన కన్నుమూశారు.


మరిన్ని

ap-districts
ts-districts