60 లక్షల మంది ఆర్థిక అవసరాలు తీర్చిన మార్గదర్శి

క్రమశిక్షణ కలిగిన ఖాతాదారులే సంస్థకు బలం

లబ్బీపేట శాఖ నూతన కార్యాలయం ప్రారంభోత్సవంలో ఎండీ శైలజా కిరణ్‌

ఈనాడు- అమరావతి, న్యూస్‌టుడే- విజయవాడ నగరపాలక సంస్థ: మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ సంస్థ త్వరలో 60 ఏళ్లు పూర్తి చేసుకోబోతోందని, ఇప్పటి వరకూ 60 లక్షల మందికి పైగా ఖాతాదారులు సంస్థలో చేరి తమ ఆర్థిక అవసరాలను తీర్చుకోవడం ఆనందంగా ఉందని సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ సీహెచ్‌ శైలజాకిరణ్‌ పేర్కొన్నారు. విజయవాడలోని మార్గదర్శి లబ్బీపేట శాఖ నూతన కార్యాలయాన్ని నగర మేయర్‌ రాయన భాగ్యలక్ష్మి, కృష్ణా జిల్లా మాజీ జడ్పీ ఛైర్‌పర్సన్‌ గద్దె అనురాధతో కలిసి శైలజా కిరణ్‌ ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మార్గదర్శిలో దాచుకున్న సొమ్ముతో తమ పిల్లలకు వివాహం చేశామని, ఇల్లు కట్టుకున్నామని, బంగారు వస్తువులు చేయించుకున్నామంటూ.. తనను కలిసిన ఖాతాదారులు చెబుతుంటే ఎంతో ఆనందం కలుగుతుందన్నారు. 1990లో తాను బాధ్యతలు స్వీకరించిన సమయంలో సంస్థ ఛైర్మన్‌ రామోజీరావు.. మార్గదర్శిలోని సొమ్ము ప్రజలదని, వారికి తిరిగి అప్పగించేవరకు తాము కేవలం కేర్‌టేకర్లు, కస్టోడియన్లు మాత్రమేనని ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలని సూచించారన్నారు. ఆ విషయాలు తన మనసులో ఎప్పటికీ నిలిచి ఉంటాయన్నారు. లబ్బీపేట బ్రాంచ్‌ మేనేజర్‌ బి.శ్రీనివాసరావు నూతన కార్యాలయంలోకి మారిన సందర్భంగా ఆగస్టు 14న ఒక్కరోజులో రూ.100 కోట్ల వ్యాపారం చేశారని, ఇది మార్గదర్శిలోనే అతిపెద్ద రికార్డు అన్నారు. క్రమశిక్షణ కలిగిన ఖాతాదారులు, అహర్నిశలు పని చేసే సిబ్బంది వల్లే ఇలాంటి విజయాలు దక్కుతున్నాయని చెప్పారు.

మహిళలకు స్ఫూర్తి శైలజాకిరణ్‌
విజయవాడ మేయర్‌ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ.. 20 శాఖలతో ఆరంభమైన మార్గదర్శి ప్రస్తుతం 108 శాఖలకు చేరడం చాలా గొప్ప విషయమన్నారు. రూ.11 వేల కోట్ల టర్నోవర్‌ కలిగిన సంస్థగా మార్గదర్శిని తీర్చిదిద్దిన శైలజాకిరణ్‌ను ప్రతి మహిళా స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. దేశాలే ఆర్థిక వ్యవస్థలను సక్రమంగా నిర్వహించలేక కుప్పకూలిపోతున్నాయని, అలాంటిది.. దశాబ్దాలుగా మార్గదర్శిని విజయవంతంగా నడపడం సాధారణ విషయం కాదని మాజీ జడ్పీ ఛైర్‌పర్సన్‌ గద్దె అనురాధ కొనియాడారు. కార్యక్రమంలో సమాచార హక్కు కమిషనర్‌ ఐలాపురం రాజా, మాజీ ఎమ్మెల్యే అంబికా కృష్ణ, మాజీ ఎమ్మెల్సీ చిగురుపాటి వరప్రసాద్‌, ప్రముఖ న్యాయవాది సుంకర రాజేంద్రప్రసాద్‌, ప్రముఖ దంత వైద్యులు ఎ.శ్రీధర్‌రెడ్డి, మార్గదర్శి వైస్‌ ప్రెసిడెంట్‌ పి.రాజాజీ, జనరల్‌ మేనేజర్‌ పి.మల్లిఖార్జునరావు, ఇతర శాఖల మేనేజర్లు పాల్గొన్నారు.


మరిన్ని

ap-districts
ts-districts