మిలియన్‌ మార్చ్‌ వాయిదాకే అధ్యయన డ్రామా?

రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌ వెళ్లిన సీపీఎస్‌ ఉద్యోగ నాయకులకు దక్కని ఓడీ

త్వరలో సీపీఎస్‌ సంఘాలతోనే చర్చలని నిఘా విభాగం బాస్‌ హామీ

ఇప్పటికే ఓసారి ఐఏఎస్‌ అధికారితో అధ్యయనం

మళ్లీ అనధికారికంగా నాయకులను తీసుకెళ్లడంపై అనుమానాలు

ఈనాడు, అమరావతి: కాంట్రిబ్యూటరీ పింఛన్‌ పథకం (సీపీఎస్‌) ఉద్యోగులు నిర్వహించ తలపెట్టిన ‘మిలియన్‌ మార్చ్‌’ను వాయిదా వేయించేందుకే సీపీఎస్‌ సంఘాల నాయకులను  ఇంటెలిజెన్స్‌ అధికారులు రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాలకు తీసుకువెళ్లినట్లు ప్రచారం సాగుతోంది. అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో సీపీఎస్‌ రద్దు చేసి, పాత పింఛను విధానం (ఓపీఎస్‌) అమల్లోకి తెస్తామని ఎన్నికల ప్రచారంలో జగన్‌ హామీ ఇచ్చారు. ఇప్పటికీ రద్దు చేయకపోవడంతో.. సెప్టెంబరు 1న విజయవాడలో మిలియన్‌ మార్చ్‌ నిర్వహించేందుకు సీపీఎస్‌ ఉద్యోగ సంఘాలు పిలుపునిచ్చాయి. దీంతో నిఘా విభాగం అనధికారిక అధ్యయనాన్ని తెరపైకి తెచ్చిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లో సీపీఎస్‌ను రద్దు చేసి, ఓపీఎస్‌ను అమలు చేస్తున్నారు. దీనిపై అధ్యయనం చేసి, తమకు నివేదిక సమర్పించాలంటూ సీపీఎస్‌ ఉద్యోగ సంఘాలకు చెందిన అయిదుగురు నాయకులను నిఘా విభాగం ఇటీవల ఆ రాష్ట్రాలకు పంపించింది. నివేదిక సమర్పించే వరకు ఈ విషయాన్ని ఎక్కడా బయటపెట్టొద్దని వారిని హెచ్చరించింది. ఉద్యోగ సంఘాల నాయకులతోపాటు ఒక డీఎస్పీ, సీఐ, ఎస్సై సైతం వెళ్లారు. పర్యటన అధికారికంగా నిర్వహించేందుకు తమకు ఓడీ సదుపాయం ఇవ్వాలని ఉద్యోగ సంఘాల నాయకులు కోరగా.. అలాగే ఇప్పిస్తామని నిఘా అధికారులు నచ్చజెప్పి పంపారు. పర్యటన అనధికారికం కావడంతో ఓడీ సదుపాయం కల్పించలేదు. దీంతో ఉద్యోగులు సొంతంగా సెలవులు పెట్టుకున్నారు.

తెగే వరకు లాగొద్దంటూ..
సంఘాల నాయకుల నుంచి అధ్యయన నివేదిక తీసుకున్న నిఘా విభాగం ఉన్నతాధికారి  దాన్ని ప్రభుత్వానికి సమర్పిస్తామన్నారు. సీపీఎస్‌పై  ఉద్యోగ సంఘాలతోనే ప్రత్యేకంగా ప్రభుత్వం చర్చించేలా ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. మిలియన్‌ మార్చ్‌ నిర్వహించి అంశాన్ని తెగే వరకు లాగొద్దని నాయకులకు సూచించారు. రాజస్థాన్‌ సీపీఎస్‌ను రద్దు చేసి, ఓపీఎస్‌ అమలుకు సిద్ధమైనప్పుడు అక్కడ తీసుకుంటున్న చర్యలపై.. అప్పట్లో ఏపీ ముఖ్యమంత్రి కార్యాలయంలో పని చేసిన ఓ అధికారి వెళ్లి అధ్యయనం చేసి వచ్చారు. ఆ తర్వాతే సీపీఎస్‌ స్థానంలో గ్యారంటీ పింఛన్‌ పథకం (జీపీఎస్‌) అమలు చేస్తామని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. సీపీఎస్‌ రద్దుపై అధ్యయనానికి ఎన్నిసార్లు వస్తారు? గతంలో ఒక ఐఏఎస్‌ అధికారి వచ్చారు కదా? అని రాజస్థాన్‌ అధికారులు ప్రశ్నించడంతో తాజాగా అక్కడికి వెళ్లిన ఉద్యోగ సంఘాల నాయకులు అవాక్కయ్యారు.

అంత రహస్యం ఎందుకు?
అయిదుగురు ఉద్యోగ సంఘాల నాయకులు 5రోజులపాటు రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌ల్లో పర్యటించడానికి ఖర్చులు, రానూపోనూ విమాన టికెట్లను నిఘా విభాగమే భరించింది. ఖర్చులు భరించి, సీపీఎస్‌ ఉద్యోగ సంఘాల నాయకులతోనే అధ్యయనం ఎందుకు చేయించారు? ఈ సంఘాలకు జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌లో సభ్యత్వం సైతం లేదు. చర్చల సమయంలోనూ జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌లోని సభ్య సంఘాలనే పిలిచారు. ఇప్పుడు సీపీఎస్‌ సంఘాల నాయకులతో రహస్యంగా అధ్యయనం చేయించడం, ఐఏఎస్‌ అధికారి అధ్యయనం చేసి నివేదిక ఇచ్చాక మళ్లీ అనధికారికంగా ఉద్యోగ సంఘాల నాయకుల్ని తీసుకెళ్లడం.. ఇదంతా మిలియన్‌ మార్చ్‌ను వాయిదా వేయించేందుకు అధ్యయనం పేరుతో సాగుతున్న డ్రామా అని ఉద్యోగవర్గాలు ఆరోపిస్తున్నాయి.


మరిన్ని

ap-districts
ts-districts