తెలుగుకు పూర్వ వైభవం తీసుకువద్దాం

కంచి కామకోటి పీఠాధిపతి పిలుపు

ఘనంగా మహాభారత సహస్రాబ్ది ఉత్సవాలు

సర్పవరం జంక్షన్‌, గాంధీనగర్‌ (కాకినాడ), న్యూస్‌టుడే: విద్యార్థులకు మహాభారతంలోని 18 అధ్యాయాలు నేర్పించేలా భారతీయ సమాఖ్య ఆధ్వర్యంలో 18 సాంస్కృతిక సంస్థల కృషితో తెలుగుకు పూర్వ వైభవం వస్తుందని కంచి కామకోటి పీఠాధిపతి శ్రీశంకర విజయేంద్ర సరస్వతి స్వామీజీ అన్నారు. ఈ సమాఖ్య ఆధ్వర్యంలో రాజరాజనరేంద్రుడి పట్టాభిషేక సహస్రాబ్ది సందర్భంగా తెలుగు మహాభారత సహస్రాబ్ది ఉత్సవాలను కాకినాడ జిల్లా తిమ్మాపురంలోని ఆకొండి లక్ష్మీ స్మారక గోశాల ప్రాంగణంలో ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా కంచి కామకోటి పీఠాధిపతి అనుగ్రహభాషణం చేస్తూ తెలుగు ప్రాచీన భారతీయ భాషల్లో ఒకటిగా గుర్తింపు పొందిందన్నారు. తెలుగుపై మమకారాన్ని పెంచేలా, నేటి తరానికి ఈ భాషలోని మాధుర్యాన్ని పంచేలా భారతీయ సమాఖ్య ఆధ్వర్యంలో రేమెళ్ల అవధానులతో 18 సంస్థలు కృషి చేస్తున్నాయని తెలిపారు. ప్రముఖులు అందులో భాగస్వాములై తెలుగుకు పూర్వ వైభవం తీసుకురావాలని ఆయన సూచించారు. సంవత్సరం పాటు పద్దెనిమిది నగరాల్లో వేడుకలు నిర్వహించడం శుభపరిణామమని పేర్కొన్నారు. ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు తొలి పలుకులు పలికారు. మహాభారతాన్ని ఆంధ్రీకరించేందుకు సహకరించిన రాజరాజనరేంద్రుడితో పాటు నన్నయ, తిక్కన, ఎర్రాప్రగడలు చేసిన కృషిని మహా మహోపాధ్యాయ శలాక రఘునాథశర్మ వివరించారు. ఈ సందర్భంగా తెలుగు మహాభారత రత్నమాల- 1, రత్నమాల- 2 పుస్తకాలను ఆవిష్కరించారు. శాంతా బయోటెక్నిక్స్‌ వ్యవస్థాపక ఛైర్మన్‌ డాక్టర్‌ వరప్రసాదరెడ్డి మాట్లాడుతూ తాను చిన్నతనంలో విన్న పద్యాలు, నాటి సాహిత్య ప్రభావం తనపై నేటికీ ఉందన్నారు. విశ్రాంత ఐఏఎస్‌ అధికారి ఎల్వీ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ తెలుగు భాషా పరిరక్షణకు ఇలాంటి కృషి జరగడం ఆనందంగా ఉందన్నారు.


మరిన్ని

ap-districts
ts-districts