విశాఖలో 36 గంటల ఉక్కు సత్యాగ్రహ దీక్ష

విశాఖపట్నం(కూర్మన్నపాలెం, కార్పొరేషన్‌), న్యూస్‌టుడే: వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కొనసాగుతున్న పోరాటాల్లో భాగంగా స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని దండి ఉప్పు సత్యాగ్రహ దీక్ష స్ఫూర్తితో నగరంలో ‘36 గంటల ఉక్కు సత్యాగ్రహ దీక్ష’ ఆదివారం మొదలైంది. కూర్మన్నపాలెం కూడలిలో ఉదయం 6 గంటలకు ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పాకాలపాటి రఘువర్మ దీక్షలను ప్రారంభించారు. వందల మంది కార్మికులు, నిర్వాసితులు శిబిరంలో కూర్చున్నారు. రాజకీయ పార్టీల నాయకులు, కార్మిక, ప్రజాసంఘాల ప్రతినిధులు సంఘీభావం ప్రకటించారు. అలుపెరుగని పోరాటాలతోనే దేశానికి స్వాతంత్య్రం వచ్చిందని, అదే స్ఫూర్తితో ఉక్కు పరిరక్షణకు ఉద్యమిస్తామని వారంతా ప్రతినబూనారు. సోమవారం సాయంత్రం 6 గంటల వరకు దీక్ష కొనసాగుతుందని సంస్థ పరిరక్షణ కమిటీ నాయకులు డి.ఆదినారాయణ, జె.అయోధ్యరామ్‌, ఎం.రాజశేఖర్‌ తెలిపారు. జీవీఎంసీ వద్ద కొనసాగుతున్న ఉక్కు ప్రైవేటీకరణ వ్యతిరేక దీక్షలు 500వ రోజుకు చేరుకున్న నేపథ్యంలో నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. దేశభక్తి ముసుగులో జాతి సంపదను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టేలా ప్రధాని మోదీ వ్యవహరిస్తున్నారని కార్మిక సంఘాల నాయకులు పి.రమణ, మస్తానప్ప, డి.అప్పారావు, ఎం.వెంకటేశ్వర్లు ఆరోపించారు.


మరిన్ని

ap-districts
ts-districts