సీజీఎఫ్‌ కమిటీలో ముగ్గురు అనధికార సభ్యులు

మంత్రి అనుచరుడికి సభ్యుడిగా అవకాశం

ఈనాడు, అమరావతి: దేవాదాయశాఖలోని సర్వ శ్రేయోనిధి (సీజీఎఫ్‌) కమిటీలో కొత్తగా ముగ్గురు అనధికార సభ్యులను నియమిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. ఇప్పటివరకూ సీజీఎఫ్‌కు దేవాదాయశాఖ మంత్రి ఛైర్మన్‌గా, ఆ శాఖ కమిషనర్‌ కార్యదర్శి, కోశాధికారిగాను.. ఆ శాఖ ముఖ్యకార్యదర్శి, తితిదే ఈవో సభ్యులుగా కలిపి కమిటీ ఉండేది. అయితే కొత్తగా అనధికార సభ్యులుగా నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం ఇందుకూరుపేటకు చెందిన కలికి కోదండరామిరెడ్డి, విశాఖపట్నం జిల్లా జి.ఎండాడకు చెందిన మలిరెడ్డి వెంకటపాపారావు, పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడేనికి చెందిన కర్రి భాస్కరరావులను సభ్యులుగా నియమిస్తూ దేవాదాయశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్‌ ఉత్తర్వులు జారీచేశారు. ఈ ముగ్గురి పదవీకాలం రెండేళ్లు ఉంటుందని అందులో పేర్కొన్నారు. సీజీఎఫ్‌లో ఎప్పుడూ అధికారిక సభ్యులే ఉండేవారు. తొలిసారి అనధికార సభ్యులను నియమించారని దేవాదాయశాఖ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రంలో రూ.5 లక్షలకుపైగా వార్షిక ఆదాయం ఉన్న దేవాదాయశాఖ ఆలయాలు, తితిదే కలిపి ఏటా సీజీఎఫ్‌కు రూ.100 కోట్ల వరకు చెల్లిస్తుంటాయి. వీటిని పురాతన ఆలయాల పునరుద్ధరణ, వేదపాఠశాలల నిర్వహణ, వేదం వ్యాప్తికి ఖర్చుచేయాలి. ఇంత కీలకమైన సీజీఎఫ్‌ కమిటీలో అనధికార సభ్యుల నియామకం అంటే వారికి రాజకీయ పునరావాసమేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

మంత్రి అనుచరుడికి చోటు

ముగ్గురు అనధికార సభ్యుల్లో తాడేపల్లిగూడేనికి చెందిన కర్రి భాస్కరరావు.. దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణకు అనుచరుడు. మంత్రి సొంత నియోజకవర్గమైన తాడేపల్లిగూడెంలో భాస్కరరావు వైకాపా బూత్‌కమిటీ ఇన్‌ఛార్జ్‌గా ఉండగా, అయన భార్య విజయలక్ష్మి ఇప్పటికే స్పోర్ట్స్‌ అథారిటీ డైరెక్టర్‌గా నామినేటెడ్‌ పదవి పొందారు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని