ఎంపీ మాధవ్‌ వీడియోపై విచారణ జరపండి

సీబీఐకి హైకోర్టు న్యాయవాది లక్ష్మీనారాయణ లేఖ

ఈనాడు, అమరావతి: వైకాపా ఎంపీ గోరంట్ల మాధవ్‌ వీడియో క్లిప్‌పై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరుతూ చెన్నైలోని సీబీఐ సైబర్‌ నేరాల దర్యాప్తు విభాగానికి హైకోర్టు న్యాయవాది గూడపాటి లక్ష్మీనారాయణ మంగళవారం లేఖ రాశారు. సీబీఐ ఆర్డర్‌ నంబర్‌ 21/4/99 ప్రకారం కంప్యూటర్‌ నేరాలు, కంప్యూటరైజ్డ్‌ వాతావరణంలో జరిగినవి, టెలికం, ఇతర హైటెక్‌ నేరాల విచారణకు సైబర్‌ నేరాల దర్యాప్తు విభాగాన్ని నెలకొల్పిన విషయాన్ని ఆయన లేఖలో ప్రస్తావించారు. ఆ విభాగం జాతీయ స్థాయిలో అధికార పరిధి కలిగి ఉంటుందని గుర్తు చేశారు. ‘ఎంపీ మాధవ్‌ అశ్లీల వీడియోలోని అంశాలు క్రిమినల్‌ నేరం కిందకు వస్తాయి. వీటిని వ్యక్తికి మాత్రమే కాకుండా, సమాజానికి కలిగే గాయంగా పరిగణించాలి. ఇలాంటి వీడియోల వల్ల రాష్ట్రంలో రెండు సమూహాల మధ్య శత్రుత్వం, ద్వేషం పెరిగి సామరస్య వాతావరణం దెబ్బతింటోంది. ఆ వీడియోలో ఎంపీ అసభ్యంగా కనిపించిన తీరు మహిళల మనోభావాల్ని తీవ్రంగా దెబ్బతీసింది. ఇవి పునరావృతం కాకుండా మాధవ్‌పై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలి’ అని లేఖలో లక్ష్మీనారాయణ కోరారు.


మరిన్ని

ap-districts
ts-districts