వైద్యారోగ్య నిధులను వేగంగా వినియోగించుకోండి

రాష్ట్రాలకు కేంద్రం సూచన

ఈనాడు, దిల్లీ: రాష్ట్రాల్లో వైద్యారోగ్య సదుపాయాల కల్పన కోసం కేంద్రం ఇచ్చిన నిధుల వినియోగాన్ని వేగవంతం చేయాలని రాష్ట్రాలకు కేంద్ర వైద్యారోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ సూచించారు. కేంద్రం ఆరేళ్ల కాల పరిమితితో రూ.64,180 కోట్లతో ప్రధానమంత్రి ఆయుష్మాన్‌ భారత్‌ హెల్త్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ మిషన్‌ అమలు చేస్తోంది. వివిధ స్థాయుల్లో ల్యాబొరేటరీలు నిర్మించి ఐటీ ఆధారిత రోగ నిఘా వ్యవస్థను ఏర్పాటు చేయడం ఈ పథకం లక్ష్యం. 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు అయిదేళ్ల కాలానికి పట్టణ, గ్రామీణ స్థానిక సంస్థలకు రూ.70,051 కోట్లు ఇవ్వనుంది. ఎమర్జెన్సీ కొవిడ్‌ రెస్పాన్స్‌ ప్యాకేజీ-2 కింద రూ.23,123 కోట్లు ఇస్తోంది. ఈ నిధుల వినియోగంపై ఏపీ, తెలంగాణ సహా వివిధ రాష్ట్రాల వైద్యారోగ్యశాఖ మంత్రులతో కేంద్ర మంత్రి మంగళవారం సమీక్షించారు. ‘‘కేంద్రం ఇస్తున్న నిధులను కొన్ని రాష్ట్రాలు సరిగా ఉపయోగించుకోవడం లేదు. ఇప్పటికైనా వేగంగా ఖర్చు చేసి వైద్యారోగ్య పథకాల అమలు కోసం మళ్లీ నిధులు కోరాలి. ఎమర్జెన్సీ కొవిడ్‌ రెస్పాన్స్‌ ప్యాకేజీ-2 కింద విడుదల చేసిన నిధులను ఈ ఏడాది డిసెంబరులోపు వాడుకోవాలి. ఈ విషయంలో రాష్ట్రాలకు ఏవైనా సవాళ్లు ఎదురవుతుంటే మా దృష్టికి తీసుకురావాలి’’ అని మాండవీయ సూచించారు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని