సంక్షిప్త వార్తలు

495 పోస్టుల భర్తీకి త్వరలో ప్రకటన

ఈనాడు, అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా 495 పోస్టుల భర్తీకి త్వరలో ఉపాధ్యాయ నియామక పరీక్ష నిర్వహించనున్నారు. జిల్లాలో మిగిలిపోయిన బ్యాక్‌లాగ్‌ పోస్టుల భర్తీకి ఈ డీఎస్సీ నిర్వహిస్తున్నారు. పోస్టుల భర్తీకి ఈ నెలలో ప్రకటన విడుదల కానుంది.


ఆ ఉద్యోగుల జాబితా ఇవ్వండి: ఆర్థిక శాఖ

ఈనాడు, అమరావతి: సీపీఎస్‌ అమల్లోకి రాకముందు ఎంపిక ప్రక్రియ జరిగి, ఆ తర్వాత విధుల్లో చేరిన డీఎస్సీ-2003 ఉపాధ్యాయులు, ఇతర ఉద్యోగులకు పాత పెన్షన్‌ అమలు చేసేందుకు ఆర్థిక శాఖ వివరాలు కోరింది. ఒక్క పాఠశాల విద్యా శాఖలోనే 6,510మంది ఉన్నారు.


ప్రజాప్రతినిధుల కోర్టుకు హాజరైన ఎమ్మెల్యే

మంగళగిరి, న్యూస్‌టుడే: ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి విజయవాడలోని ప్రజాప్రతినిధుల కేసుల ప్రత్యేక కోర్టుకు మంగళవారం హాజరయ్యారు. ఆయనతోపాటు మరో 14 మందీ హాజరయ్యారు. గత ప్రభుత్వ హయాంలో రామకృష్ణారెడ్డి మీద, వైకాపా నాయకులపై పెట్టిన కేసుల విచారణ ఉండటంతో వారు వచ్చారు. విచారణను కోర్టు సెప్టెంబరు నెలకు వాయిదా వేసింది.


ఛైర్మన్‌ జీతభత్యాలకు గ్రంథాలయాల డబ్బులు

ఈనాడు, అమరావతి: ఏపీ గ్రంథాలయ పరిషత్‌ ఛైర్మన్‌ జీతభత్యాలను గ్రంథాలయాలకు వచ్చే పన్నుల ఆదాయం నుంచి చెల్లించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. గ్రంథాలయ అభివృద్ధి, పుస్తకాల కొనుగోళ్లు, పాఠకులకు సౌకర్యాలు కల్పించడానికి వినియోగించాల్సిన నిధులతో జీతాలివ్వాలని ఆదేశించడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఛైర్మన్‌ పదవిని కేటగిరీ ‘ఆర్‌’లో పెట్టిన ప్రభుత్వం ఆ భారాన్ని గ్రంథాలయాలపై పడేసింది. గతేడాది డిసెంబరు 29న ఛైర్మన్‌ను ప్రభుత్వం నియమించింది. అప్పటినుంచి ఆయనకు జీతభత్యాలు చెల్లించలేదు. నెలకు రూ.3.82 లక్షల చొప్పున 8 నెలలకు రూ.30.56 లక్షలు చెల్లించాలి. ఈ నిధులను అన్ని జిల్లాల గ్రంథాలయాలు సమానంగా భరించాలని డైరెక్టర్‌ ఆదేశాలు ఇచ్చారు. సీఎఫ్‌ఎంఎస్‌లోని కోడ్‌కు జమ చేయాలని సూచించారు.


విద్యాశాఖ ద్వారానే పురపాలక ఉపాధ్యాయులకు జీతాలు

ఈనాడు, అమరావతి: పురపాలక ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బందికి ఆగస్టు నెల జీతాలను పాఠశాల విద్యాశాఖ ద్వారానే చెల్లించనున్నారు. ఈ ప్రతిపాదనకు సీఎఫ్‌ఎంఎస్‌ ఆమోదం తెలిపింది. పురపాలక ప్రాథమిక, ప్రాథమికోన్నత బడుల ఉపాధ్యాయులకు ఎంఈఓ, నగరాల్లో పని చేస్తున్న వాటికి అర్బన్‌ డీఐ, ఉన్నత పాఠశాలలకు ప్రధానోపాధ్యాయుడు జీతాల బిల్లులు సమర్పించేందుకు డ్రాయింగ్‌ అధికారాలు ఇవ్వనున్నారు. సర్వీస్‌ రిజిస్టర్ల నవీకరణ ప్రక్రియ పూర్తికాకపోతే డిప్యూటీ విద్యాధికారులకు అప్పగిస్తారు.


భూమి హక్కుల చట్టం నియమావళిపై తుది నోటిఫికేషన్‌ జారీ

ఈనాడు, అమరావతి: రాష్ట్ర రెవెన్యూశాఖ ఆంధ్రప్రదేశ్‌ భూమి హక్కుల చట్టం-(రికార్డ్సు ఆఫ్‌ రైట్స్‌)-1971 నియమావళిలో సవరణలతో కూడిన తుది నోటిఫికేషన్‌ను మంగళవారం జారీచేశారు. రీ-సర్వే జరుగుతున్న గ్రామాల్లో ఇకపై ఆర్‌ఓఆర్‌ డ్రాఫ్ట్‌ రిజిస్టర్‌ తయారీకి ఆర్‌ఎల్‌ఆర్‌ (రీ-సర్వే ల్యాండ్‌ రిజిస్టర్‌) ప్రామాణికంగా తీసుకునేలా ఆర్‌ఓఆర్‌ నిబంధనల్లో మార్పు తెచ్చారు. ఆర్‌ఓఆర్‌ రూపకల్పన త్వరగా జరిగేలా ప్రస్తుతం మార్పులు చేశారు. భూముల యాజమాన్య హక్కు నిర్ధారణకు ప్రస్తుతం ఉన్న 77 రోజుల గడువును 52కి కుదించారు.


సచివాలయాల ఉద్యోగుల బదిలీలపై ప్రత్యేక విధానం

ఈనాడు, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల బదిలీలకు సంబంధించి ప్రత్యేక విధానాన్ని రూపొందించారు. ఉన్నతాధికారుల పరిశీలనలో ఉన్న ఈ విధానంలో మార్పులు, చేర్పులు చేసి ఆర్థికశాఖ ఆమోదానికి పంపనున్నారు. ఉద్యోగుల ప్రొబేషన్‌ ఖరారు ప్రక్రియను దాదాపుగా పూర్తి చేసిన వార్డు, సచివాలయాల శాఖ... వారి బదిలీలపై దృష్టి సారించింది. వేర్వేరు చోట్ల పనిచేస్తున్న భార్యాభర్తలు, జిల్లాయేతర ప్రాంతాల్లో పనిచేస్తున్న వారి నుంచి బదిలీల కోసం వచ్చిన వినతులపై ప్రత్యేక విధానాన్ని రూపొందిస్తున్నారు. జిల్లా పరిధిలోనే బదిలీలు చేస్తారా? సర్వీసు పాయింట్లు ఏవిధంగా ఇవ్వనున్నారు? తదితర విషయాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. నెలాఖరులోగా మార్గదర్శకాలు ఖరారు చేసి, ఆర్థికశాఖ ఆమోదంతో జీవో విడుదల చేసే యోచనతో అధికారులు ఉన్నారు.


మరిన్ని

ap-districts
ts-districts