బంగారం ఖనిజాన్వేషణ బిడ్లకు సెప్టెంబరు 2తో గడువు ముగింపు

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో బంగారం ఖనిజాన్వేషణ లైసెన్సుల జారీకి బిడ్ల దాఖలు గడువును ప్రభుత్వం మరోసారి పొడిగించింది. శ్రీసత్యసాయి జిల్లాలోని రామగిరిలో ఉత్తర, దక్షిణ క్షేత్రాలు, రొద్దం మండలం బొక్సంపల్లిలో ఉత్తర, దక్షిణ క్షేత్రాలు, కదిరి మండలం జౌకుల పరిధిలో ఎ, బి, సి, డి, ఇ, ఎఫ్‌ క్షేత్రాల్లో ఖనిజాన్వేషణ అనుమతుల జారీకి మార్చిలో గనులశాఖ టెండర్లు పిలిచింది. బిడ్‌లో పాల్గొనే సంస్థలు మన రాష్ట్రంలోనే జీఎస్టీ చెల్లించాలనే నిబంధన విధించింది. దీంతో ఇతర రాష్ట్రాలకు చెందిన సంస్థలు టెండర్ల గడువు పెంచాలని కోరడంతో పలు దఫాలు పెంచుతూ వస్తోంది. తాజాగా సెప్టెంబరు 2తో గడువు ముగుస్తుందని ప్రకటించింది. ఆ తర్వాత వారంలో బిడ్లను పరిశీలించి ఈ-వేలం ద్వారా లైసెన్సులు జారీచేయనుంది. ఒక్కో క్షేత్రం దాదాపు 10 చదరపు కి.మీ. చొప్పున మొత్తం పది క్షేత్రాల్లో కలిపి 97.4 చదరపు కి.మీ. మేర ఉన్నాయి. వీటిలో లైసెన్సులు పొందిన సంస్థలు తొలుత ఖనిజాన్వేషణ చేస్తాయి. బంగారం లభ్యత ఎక్కడ ఉందో గుర్తించి ఆ ప్రాంతాన్ని లీజుకు తీసుకుంటాయి. టన్ను మట్టి తవ్వితీస్తే సగటున 3-4 గ్రాముల బంగారం లభిస్తుందని అంచనా వేస్తున్నారు.


మరిన్ని

ap-districts
ts-districts