గోదావరికి పెరిగిన వరద

కుక్కునూరు, కాకినాడ, న్యూస్‌టుడే: గోదావరికి మళ్లీ వరద పెరుగుతోంది. భద్రాచలం వద్ద నదిలో నీటిమట్టం సోమవారం సాయంత్రం 46 అడుగులు ఉండగా, మంగళవారం ఉదయానికి 49.10 అడుగులకు చేరింది. సాయంత్రం 8 గంటలకు 53 అడుగులకు పెరిగింది. అధికారులు మూడో ప్రమాద హెచ్చరిక జారీచేశారు. ఈ సీజన్‌లో రెండు రోజులకోసారి వరద పెరగడం పరిపాటిగా మారింది. నదీ ఒడ్డు గ్రామాల్లో జనజీవనం అస్తవ్యస్తంగా తయారైంది. కుక్కునూరు-భద్రాచలం ప్రధాన రహదారి పలుచోట్ల వరద నీటిలో మునిగిపోవటంతో రవాణా వ్యవస్థ నిలిచిపోయింది. ఛత్తీస్‌గడ్‌, ఒడిశా, తెలంగాణ రాష్ట్రాల నుంచి ఉత్తరాంధ్ర జిల్లాలకు వెళ్లే వాహనాలన్నీ ఈ మార్గంలోనే పయనిస్తుంటాయి. అంతర్రాష్ట్ర రవాణా వ్యవస్థకు ఆటంకమేర్పడింది. కుక్కునూరు మండలంలోని వింజరం, తెలంగాణలో బూర్గంపాడు వద్ద రహదారి నీట మునిగింది. తూర్పుగోదావరి, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాల్లోనూ లంక గ్రామాలు, లోతట్టు ప్రాంతాలను వరద చుట్టేసింది. ధవళేశ్వరం కాటన్‌ బ్యారేజీ వద్ద నీటిమట్టం 13.70 అడుగులకు చేరగా, రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. 13.19 లక్షల క్యూసెక్కులు నీరు సముద్రంలోకి ప్రవహిస్తోంది.


మరిన్ని

ap-districts
ts-districts