మరో ఆరు పీఎస్‌పీలకు డీపీఆర్‌లు

మూడు విడతల్లో మొత్తం 16 ప్రాజెక్టులు
5,820 మెగావాట్ల పునరుత్పాదక విద్యుత్‌కు అవకాశం

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో మరో ఆరు పంప్డ్‌ స్టోరేజి పవర్‌ ప్రాజెక్టులకు (పీఎస్‌పీ) వివరణాత్మక ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌)లు తయారు చేయాలని నెడ్‌క్యాప్‌ నిర్ణయించింది. వాటి ద్వారా 5,820 మెగావాట్ల పునరుత్పాదక విద్యుత్‌ అందుబాటులోకి వస్తుంది. అల్లూరి సీతారామరాజు జిల్లా పెదకోటలో 1,500, రైవాడలో 1000, గుజ్జిలిలో 1,400, చిట్టంవలసలో 800, వైయస్‌ఆర్‌ జిల్లా వేంపల్లెలో 800, రాజుపాలెంలో 320 మెగావాట్ల సామర్థ్యమున్న ప్రాజెక్టులను మూడో విడతలో ఏర్పాటు చేయాలని నెడ్‌క్యాప్‌ ప్రతిపాదించింది. వాటికి డీపీఆర్‌ల తయారీ కోసం ఆసక్తి వ్యక్తీకరణ ప్రకటన జారీ చేసింది. వీటితో కలిపి మూడు విడతల్లో మొత్తం 16 పీఎస్‌పీల ఏర్పాటుకు డీపీఆర్‌లను తయారు చేయిస్తోంది. వాటి నిర్మాణం పూర్తయితే 15,320 మెగావాట్ల పునరుత్పాదక విద్యుత్‌ అందుబాటులోకి వస్తుంది. రాష్ట్రంలో మొత్తం 29 పీఎస్‌పీల ద్వారా సుమారు 33 వేల మెగావాట్ల పునరుత్పాదక విద్యుత్‌ ఉత్పత్తికి అవకాశం ఉందని నెడ్‌క్యాప్‌ గుర్తించింది.

డీపీఆర్‌ల తయారీకి కసరత్తు

మొదటి విడతలో వైయస్‌ఆర్‌ జిల్లా గండికోట, అనంతపురంలోని చిత్రావతి, నెల్లూరులోని సోమశిల, నంద్యాల జిల్లా అవుకు, పార్వతీపురం మన్యంలోని కురుకుర్తి, కర్రివలస, అల్లూరి సీతారామరాజు జిల్లా ఎర్రవరంలోని ఏడు ప్రాజెక్టులకు డీపీఆర్‌ల తయారీకి నెడ్‌క్యాప్‌ టెండర్లు పిలిచింది. టాటా కన్సల్టెన్సీ, వ్యాప్కోస్‌, ఆర్‌వీ సంస్థలు వాటిని దక్కించుకున్నాయి. ఈ ప్రాజెక్టుల ద్వారా 6,300 మెగావాట్ల సౌర విద్యుత్‌ అందుబాటులోకి వస్తుందని అంచనా.

రెండో విడతలో పార్వతీపురం జిల్లా పైడిపాలెంలో ఒక్కొక్కటి 1000 మెగావాట్ల సామర్థ్యమున్న రెండు పీఎస్‌పీలు, అనంతపురం జిల్లా శింగనమలలో 1,200 మెగావాట్ల ప్రాజెక్టు ఏర్పాటుకు నెడ్‌క్యాప్‌ సొంతంగా డీపీఆర్‌లను తయారు చేస్తోంది.


మరిన్ని

ap-districts
ts-districts