కొవిడ్‌తో మానసిక ఒత్తిడి

ఫ్రంట్‌లైన్‌ వర్కర్స్‌పై ఎయిమ్స్‌-యునిసెఫ్‌ అధ్యయనం

ఈనాడు-అమరావతి: కొవిడ్‌ విషమ పరిస్థితుల్లో విశేష సేవలందించిన వైద్యులు, నర్సులు మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు. కొందరికి కంటినిండా నిద్ర కరవైంది. చిన్నచిన్న విషయాలకూ ఆందోళన చెందుతున్నారు. దీంతో రోజువారీ విధుల నిర్వహణలో వారికి ఉత్సాహం ఉండడం లేదు. వీరి తర్వాత పోలీసులూ మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. 2020 జులైనుంచి ఫ్రంట్‌లైన్‌ వర్కర్స్‌ కేటగిరిలో ఉన్నవారి మానసిక పరిస్థితిని మంగళగిరిలోని అఖిలభారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్‌), యునిసెఫ్‌ సంయుక్తంగా తెలుసుకుంటోంది. ఈ విభాగంలో ఉన్న ఆరువేల మందికి ప్రత్యేక ప్రశ్నావళిని ‘హెల్ప్‌లైన్‌’ ద్వారా వాట్సాప్‌, ఇతర మాధ్యమాల్లో పంపి సమాధానాలు రాబట్టింది. 15శాతం మంది మానసిక సమస్యలతో బాధపడుతున్నారని గుర్తించింది. 29% మందికి కౌన్సెలింగ్‌తోపాటు చికిత్స అవసరమని సూచించింది. ఈ జాబితాలో 69% మహిళలు ఉండగా, పురుషులు 25% ఉన్నారు. మానసిక ఆందోళనకు గురైన పురుషుల్లో మద్యం అలవాటున్నవారు 12% ఉన్నారు. నిద్ర సమస్య ఉన్న పురుషులు 4%, ఆందోళనతో ఉన్నవారు 92%, కుంగుబాటుతో ఉన్నవారు 76% చొప్పున ఉన్నారు. మహిళల్లో ఆందోళనకు గురవుతున్నవారు 89%, కుంగుబాటుతో ఉన్నవారు 84%, నిద్రలేమితో బాధపడుతున్నవారు 14% మంది చొప్పున ఉన్నట్లు సర్వేలో గుర్తించారు.

వైద్యుల్లోనే ఎక్కువ

నిద్రలో మార్పులు కనిపిస్తున్నాయా? చిన్నచిన్న విషయాలకే భయపడుతున్నారా? చేతులు వణుకుతున్నాయా? ఒత్తిడికి లోనవుతున్నారా? చిన్నచిన్న విషయాలకు ఏడుస్తున్నారా? విషయాసక్తి కోల్పోయారా? జీవితాన్ని ముగించాలన్న ఆలోచన మీ మనసులో ఉందా? త్వరగా అలసిపోతున్నారా? అన్న వివిధ ప్రశ్నలకు వచ్చిన సమాధానాల ఆధారంగా ఫ్రంట్‌లైన్‌ వర్కర్ల మానసిక స్థితిని గుర్తించారు. ఉమ్మడి 13 జిల్లాల్లో మార్చినాటికి గరిష్ఠంగా 2,046 మంది అనంతపురం జిల్లా, కనిష్ఠంగా నెల్లూరు జిల్లాలో 31 మంది ఈ ప్రశ్నావళికి స్పందించారు.

సైకాలజికల్‌ కౌన్సెలింగ్‌ ప్రాజెక్టు కింద ఫ్యామిలీ మెడిసిన్‌ వైద్యులు డాక్టర్‌ రాజీవ్‌, సత్యనారాయణన్‌, సైకియాట్రీ విభాగం హెడ్‌ డాక్టర్‌ విజయచంద్రారెడ్డి, క్లినికల్‌ సైకాలజిస్టులు గిరిషా, నాగవర్థిని బృందం వారికి అవసరమైన సలహాలు, సూచనలు ఇస్తోంది. ఎయిమ్స్‌కు నేరుగా వస్తే చికిత్సనందిస్తామని కూడా వైద్యులు వెల్లడించారు.


పగటిపూట నిద్ర వద్దు
- మానసిక వైద్య నిపుణులు

రాత్రిపూట ప్రశాంత నిద్ర కోసం పగటి వేళ నిద్రపోకూడదు. నిద్రించడానికి 6గంటల ముందు టీ/కాఫీ తాగకూడదు. నిద్రలేచాక 30 నిమిషాలపాటు నడవాలి. లేదా వ్యాయామం చేయాలి. రేపటి విషయాలపై ఎక్కువగా ఆలోచించకూడదు. పనులు వాయిదా వేయకూడదు. కుర్చీలో కూర్చొని రోజూ 10నిమిషాలపాటు నెమ్మదిగా శ్వాస పీల్చుకోవాలి.


మరిన్ని

ap-districts
ts-districts