గాంధేయ మార్గాన్ని అనుసరించి పాదయాత్ర

అమరావతి జేఏసీ నేతల వెల్లడి

ఈనాడు డిజిటల్‌-ఏలూరు, న్యూస్‌టుడే-గోపాలపురం, నల్లజర్ల: ‘వచ్చే ఎన్నికల్లో అన్ని సీట్లు గెలుస్తామని చెబుతున్న ముఖ్యమంత్రి.. మా పాదయాత్ర చూసి ఎందుకు ఉలిక్కిపడుతున్నారు? మంత్రులు, వైకాపా నాయకులతో ఎందుకు విమర్శలు చేయిస్తున్నారు? ప్రజల్లో చైతన్యం వచ్చింది. అమరావతి రాజధానిగా ఉంటేనే అభివృద్ధి సాధ్యమని గ్రహించారు. మీ పీఠం కదిలిపోతోంది..’ అని అమరావతి ఐకాస కన్వీనర్‌ శివారెడ్డి ధ్వజమెత్తారు. తూర్పుగోదావరి జిల్లా దూబచర్లలో మహాపాదయాత్ర ముగిశాక విలేకరులతో ఆయన మాట్లాడారు. తాము గాంధేయ మార్గంలోనే పాదయాత్ర చేస్తున్నామని, అందుకే తమ దారిలో రెచ్చగొట్టే ఫ్లెక్సీలు ఉన్నా తాకకుండా సంయమనం పాటిస్తున్నామని పేర్కొన్నారు. ‘పాదయాత్రపై విమర్శలు చేస్తున్న మంత్రి బొత్స.. సమైక్య రాష్ట్రంలో జగన్‌ను అడ్డగోలుగా విమర్శించారు. దోపిడీదారు అన్నారు. ఎన్నికలకు ముందు రాజధానికి తాను వ్యతిరేకం కాదని చెప్పిన బొత్స.. అధికారంలోకి వచ్చాక మాట మారుస్తున్నారు. ’ అని ఐకాస నేత తిరుపతిరావు తెలిపారు. ‘ఉత్తరాంధ్ర ప్రజలారా.. మేలుకోండి. ఈ నాయకులు మనల్ని విభజించి పాలించాలని చూస్తున్నారు’ అని పేర్కొన్నారు.


మరిన్ని