దసపల్లా భూముల్లో తప్పటడుగులు

యంత్రాంగం తీరుపై అనుమానాలు

విశాఖపట్నం (వన్‌టౌన్‌), న్యూస్‌టుడే: విశాఖ దసపల్లా భూముల వ్యవహారంలో జిల్లా యంత్రాంగం తీరు తీవ్ర విమర్శలకు తావిస్తోంది. ముందుచూపు లేమి, న్యాయస్థానాల్లో బలంగా వాదనలు వినిపించకపోవడం, నిబంధనల అమలులో తప్పిదాలతో భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇంత జరిగినా భూమిపై హక్కుల (టైటిల్‌) కోసమే పోరు సాగించారు. అర్బన్‌ ల్యాండ్‌ సీలింగ్‌ (యూఎల్‌సీ) కింద భూములు చేజిక్కించుకొనే అవకాశం ఏర్పడినా అలా చేయకపోవడంతో ఇప్పుడు రూ.2వేల కోట్ల విలువైన భూములు చేజారే పరిస్థితి ఏర్పడింది. భూ వ్యవహారం వెనుక వైకాపా కీలక నేత ఉన్నారనే ఆరోపణలు రావడంతో ఎలా ముందుకెళ్లాలని అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు.

1976 నాటి వివాదం

* దసపల్లా హిల్స్‌లోని సర్వే నంబర్లు 1027, 1028, 1196, 1197ల్లో ఉన్న 60 ఎకరాల భూములు రాణీ కమలాదేవికి ఆమె తండ్రి నారాయణ గజపతిరాజు ద్వారా 1938లో సంక్రమించాయి. బ్రిటిష్‌ ప్రభుత్వ కాలంలో ఆ భూములకు శిస్తులు చెల్లించడంతో 1958లో దసపల్లా భూములకు రాణీ కమలాదేవి పేరుతో గ్రౌండు రెంట్‌ పట్టా లభించింది. 1976లో పట్టణ భూ గరిష్ఠ పరిమితి (యూఎల్‌సీ) చట్టం అమల్లోకి వచ్చింది. వెంటనే రాణి తన భూములను ప్రభుత్వానికి అప్పగించారు. ప్రభుత్వం నిబంధనల ప్రకారం 1500 గజాల భూమిని ఆమెకు ఇచ్చేసి మిగిలినది తీసుకోవాలి. ఈ ప్రకారమే అప్పటి అధికారులు చేశారు. అయితే తనకు ముగ్గురు పిల్లలు ఉన్నందున ఒక్కొక్కరికి 1500 గజాలు ఇవ్వాలని రాణీ కమలాదేవి కోరగా, అధికారులు అంగీకరించలేదు. దాంతో ఆమె హైకోర్టుకు వెళ్లారు. ఆ కేసు ఇంతవరకూ తేలలేదు. దీనిపై యంత్రాంగం దృష్టిపెట్టలేదు.

* భూముల విషయం కోర్టులో ఉన్నా... 1980 ప్రాంతంలో టౌన్‌ప్లానింగ్‌ అధికారులు మొత్తం 60 ఎకరాల్లో కొండ ప్రాంతంలో ఉన్న 20 ఎకరాలు వదిలేసి, మిగిలిన 40 ఎకరాలను లే అవుట్‌ అభివృద్ధి చేసి, అమ్మేశారు. వాటిలో ఒక్క ఎకరం మాత్రం నౌకాదళ అవసరాలకు కేటాయించారు. అప్పటి టౌన్‌ప్లానింగ్‌ అధికారులు ఈ 40 ఎకరాల భూములకు రాణీ కమలాదేవికి పరిహారం చెల్లించారు. మిగిలిన 20 ఎకరాలను నిషేధిత జాబితాలో చేర్చారు. అందులో 5 ఎకరాలు ఆక్రమణల పాలయ్యాయి. మిగిలిన 15 ఎకరాలను రాణీ కమలాదేవి కుటుంబసభ్యులు అనధికారికంగా అమ్మేసుకున్నారు.

యూఎల్‌సీ అంశాన్ని గాలికొదిలేసి..

* యూఎల్‌సీ కేసును పక్కన పెట్టి, రాణికి జారీచేసిన గ్రౌండ్‌రెంట్‌ పట్టా చెల్లదని, రెవెన్యూ రికార్డుల్లో ఆ భూములు ప్రభుత్వానివిగా ఉన్నాయని అధికారులు వాదిస్తూ వెళ్లారు. తొలుత సర్వే అండ్‌ సెటిల్‌మెంట్‌ కోర్టులో ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వచ్చినా.. హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో మాత్రం రాణీ కమలాదేవి నెగ్గారు. టైటిల్‌పై దృష్టిసారించిన అధికారులు, యూఎల్‌సీ వ్యవహారాన్ని పక్కన పెట్టేయడం సమస్యగా మారింది.

* 2009లో హైకోర్టులో ప్రభుత్వ పిటిషన్‌ను తిరస్కరించిన తర్వాత సుప్రీంకోర్టును ఆశ్రయించడంలో తీవ్ర జాప్యం జరిగింది. 90 రోజుల్లో వేయాల్సిన ఎస్‌ఎల్‌పీ (స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌)ని 570 రోజుల తర్వాత దాఖలుచేశారు. దీంతో 2013లో నాటి కలెక్టర్‌ అప్పటి సీతమ్మధార తహసీల్దార్‌ను సస్పెండ్‌ చేశారు.

* సకాలంలో ఎస్‌ఎల్‌పీ దాఖలు చేస్తే పరిస్థితి వేరేలా ఉండేది. యూఎల్‌సీ కేసు ఆధారంగా ముందుకెళ్లినా ప్రయోజనం ఉండేది. దాన్ని వదిలేసి కేవలం టైటిల్‌పై యంత్రాంగం దృష్టి సారించడంతో ఇప్పుడు విలువైన భూములు వేరేవారి చేతికి వెళ్లి భారీ స్థిరాస్తి వ్యాపార లావాదేవీలు జరగడం తీవ్ర విమర్శలకు తావిచ్చింది.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని