సీఎం జగన్‌ చేనేతలను విస్మరించారు

చేనేతల మహా సభల్లో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రామాంజనేయులు

ఎమ్మిగనూరు, న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి రాయితీపై ముడి సరకు ఇవ్వకుండా చేనేతలను విస్మరించారని చేనేత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రామాంజనేయులు ఆరోపించారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలోని కుర్ణి కల్యాణ మండపంలో ఆదివారం చేనేత రాష్ట్ర మహాసభలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా చేనేతలు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం జరిగిన సమావేశంలో రామాంజనేయులు మాట్లాడుతూ శాసనసభలో ఉన్న తమ వర్గ నేతలు చేనేతల సమస్యలను ప్రస్తావించడం లేదన్నారు. వేల మంది కార్మికులుంటే 80 వేల మందికే నేతన్న నేస్తం పంపిణీ చేశారని ఆరోపించారు. రాష్ట్ర బడ్జెట్‌ రూ.1.65 లక్షల కోట్లు ఉండగా, జనాభాలో 19శాతం ఉన్న చేనేతలకు రూ.200 కోట్లు మాత్రమే కేటాయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దక్షిణ భారత చేనేత మాజీ కన్వీనర్‌ (కర్నాటక) నిత్యానందస్వామి మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేయూత ఇవ్వకపోవడంతో చేనేత వృత్తి కనుమరుగవుతోందన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిల్లల మర్రి బాలకృష్ణ మాట్లాడుతూ కర్నూలు జిల్లాలో ఒకప్పుడు 30వేల మంది చేనేత కార్మికులు ఉండగా, ప్రోత్సాహం లేక ఇప్పుడు వృత్తి మానుకునే పరిస్థితి ఏర్పడిందన్నారు. కార్మికులకు బ్యాంకు ద్వారా పావలా వడ్డీకే రుణాలివ్వాలన్నారు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు