అరుదైన వ్యాధితో బాధపడుతున్న చిన్నారికి ప్రభుత్వం బాసట

అరుదైన గౌచర్‌ వ్యాధితో బాధపడుతున్న చిన్నారి వైద్యానికి ప్రభుత్వం సాయం అందించింది. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా అల్లవరం మండలం నక్కారామేశ్వరానికి చెందిన కొప్పాడి రాంబాబు, నాగలక్ష్మిల మూడేళ్ల కుమార్తె హనీకి గౌచర్‌ వ్యాధికి ఖరీదైన వైద్యం చేయాల్సి ఉందని, ఒక్కో ఇంజక్షన్‌ ధర బహిరంగ మార్కెట్‌లో రూ.1.25 లక్షలు ఉంటుందని వైద్యులు చెప్పారు. దీంతో ఆ పేద తల్లిదండ్రులు ముఖ్యమంత్రి జగన్‌ను కలిసి గోడు వెళ్లబోసుకున్నారు. చిన్నారి వైద్యానికి ఏర్పాట్లు చేయాలని సీఎం ఆదేశించడంతో.. తొలి విడతగా 13 సెరిజైమ్‌ ఇంజక్షన్లను రాష్ట్ర ప్రభుత్వం అమెరికా నుంచి తెప్పించింది. కలెక్టర్‌ హిమాన్షు శుక్లా ఆదివారం వీటిని అమలాపురం ప్రాంతీయ ఆసుపత్రిలో చిన్నారి తల్లిదండ్రులకు అందించారు. చిన్నారి వైద్యానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.కోటి మంజూరు చేసిందని తెలిపారు. కాలేయం సహా శరీరంలోని పలు అవయవాల పనితీరును అస్తవ్యస్తం చేసే గౌచర్‌ వ్యాధి చికిత్సకు 15 రోజులకోసారి ఇంజక్షన్‌ ఇవ్వాల్సి ఉందని డీసీహెచ్‌ఎస్‌ పద్మశ్రీరాణి చెప్పారు.

- న్యూస్‌టుడే, అమలాపురం (గడియార స్తంభం)


మరిన్ని