మహాత్మాగాంధీ, లాల్‌బహదూర్‌శాస్త్రిల జీవితాలు ఆదర్శం

గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌

ఈనాడు డిజిటల్‌, అమరావతి: జాతిపిత మహాత్మాగాంధీ, మాజీ ప్రధాని లాల్‌బహదూర్‌శాస్త్రిల జీవితాలు నేటి యువతకు ఆదర్శమని గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ కొనియాడారు. గాంధీ, శాస్త్రిల జయంతి సందర్భంగా విజయవాడలోని రాజ్‌భవన్‌ దర్బార్‌ హాల్‌లో వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి ఆదివారం ఆయన నివాళి అర్పించారు. ‘అహింసతో దేశానికి స్వాతంత్య్రం తెచ్చిన ఘనత గాంధీకే దక్కుతుంది. జై జవాన్‌..జై కిసాన్‌ నినాదంతో దేశానికి లాల్‌బహదూర్‌ శాస్త్రి మార్గాన్ని చూపారు’ అని గవర్నర్‌ పేర్కొన్నారు.


యావత్తు ప్రపంచానికే గాంధీ మార్గదర్శి :ముఖ్యమంత్రి జగన్‌

మహాత్మాగాంధీ ప్రపంచానికే మార్గదర్శి అని సీఎం జగన్‌ కొనియాడారు. గాంధీ జయంతి సందర్భంగా తాడేపల్లిలోని సీఎం క్యాంప్‌ కార్యాలయంలో గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. దేశ స్వాతంత్య్రం కోసం ఆయన చేసిన పోరాటాన్ని గుర్తు చేసుకొన్నారు.


అహింసా ఆయుధంతో దేశానికి స్వాతంత్య్రం: చంద్రబాబు

అహింసా ఆయుధంతో గాంధీ దేశానికి స్వాతంత్య్రం తెచ్చారని తెదేపా అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌తో కలిసి గాంధీ చిత్రపటానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. గాంధీ చూపిన ఆదర్శ రాజకీయాలను నేటి తరం ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.

* భారత స్వాతంత్య్ర పోరాటంలో గాంధీ అగ్రస్థానంలో నిలిస్తే, రెండో ప్రధానిగా శాస్త్రి దేశానికి ఎనలేని సేవలందించారని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కె.అచ్చెన్నాయుడు ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

తెదేపా కేంద్ర కార్యాలయంలో....
మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో గాంధీ, లాల్‌బహదూర్‌శాస్త్రి జయంతి వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ అశోక్‌బాబు, తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బుచ్చిరాంప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

* కృషితో మనుషులు రుషులవుతారనే మాటకు గాంధీ నిలువెత్తు నిదర్శనమని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ కొనియాడారు.మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని