ఊరూరా.. ప్రభంజనం

అమరావతి రైతుల మహా పాదయాత్రకు అడుగడుగునా నీరాజనాలు

ఈనాడు డిజిటల్‌-ఏలూరు, న్యూస్‌టుడే- గోపాలపురం, నల్లజర్ల, తాడేపల్లిగూడెం: ‘ఒకటే రాష్ట్రం ఒకటే రాజధాని.. ఆంధ్రుల రాజధాని అమరావతి.. జై అమరావతి జైజై అమరావతి’ అని రాజధాని రైతులు నినదించారు. అమరావతి నుంచి అరసవల్లి వరకు చేపట్టిన రైతుల మహాపాదయాత్రకు తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలంలో జనం నీరాజనాలు పలికారు. నల్లజర్ల మండలం దూబచర్ల నుంచి సోమవారం మొదలైన మహాపాదయాత్ర ముసళ్లకుంట, పుల్లలపాడు మీదుగా నల్లజర్ల చేరుకుంది. అక్కడ భోజన విరామ అనంతరం నల్లజర్ల మండలం ప్రకాశరావుపాలేనికి వెళ్లింది. యాత్ర ప్రారంభ ప్రాంతంలో ఉన్న దూబచర్ల హైవే సమీపానికి చేరుకోగానే ఫ్లైఓవర్‌ పైనుంచి స్థానికులు పూలవర్షం కురిపించారు. నల్లజర్ల ప్రారంభంలో రైతుల పాదయాత్ర చిత్రాలతో సుమారు 150 అడుగుల ఫ్లెక్సీ ఏర్పాటుచేశారు. నల్లజర్ల నుంచి రైతులను పూలపై నడిపించారు.

పోటెత్తిన జనం...

దూబచర్ల నుంచి ముసళ్లకుంట చేరుకునేసరికి చుట్టుపక్కల గ్రామాలవారి కలయికతో దాదాపు 4 కి.మీ.పొడవునా పాదయాత్ర కనిపించింది. నల్లజర్ల మండల మహిళలు బతుకమ్మలతో వచ్చి యాత్రలో పాల్గొన్నారు. గ్రామాల్లో రైతులు దాదాపు 120 ట్రాక్టర్లతో భారీ ప్రదర్శన ఏర్పాటుచేశారు. నల్లజర్లలో అంబేడ్కర్‌ విగ్రహానికి రైతు నాయకులు పూలమాల వేసి నివాళులర్పించారు. ఇదే గ్రామంలో ఉన్న మసీదుకు వెళ్లి రైతులు, నాయకులు ప్రార్థనలు చేశారు. ప్రకాశరావుపాలెం ప్రారంభంలో రహదారిపై పెద్ద సంఖ్యలో భవానీ స్వాములు నిల్చుని స్వాగతం పలికారు. రహదారికి దూరంగా ఉన్న గ్రామాలనుంచి రైతులు, రైతుకూలీలు కాలినడకన వచ్చి యాత్రలో పాల్గొన్నారు. జగన్నాథపురం నుంచి మహిళా కోలాటం బృందం వచ్చి పాదయాత్రలో పాల్గొంది. ఏలూరు జిల్లా తెదేపా అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు, మాజీ మంత్రులు పీతల సుజాత, జవహర్‌, జడ్పీ మాజీ ఛైర్మన్‌ ముళ్లపూడి బాపిరాజు, పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, మాజీ ఎమ్మెల్యేలు ముప్పిడి వెంకటేశ్వరరావు, ఘంటా మురళి, చింతమనేని ప్రభాకర్‌, బూరుగుపల్లి శేషారావు తదితరులు పాల్గొన్నారు.


వైకాపా వాళ్లే మా యాత్రకు మద్దతిస్తున్నారు: అమరావతి ఐకాస నేతలు

‘వైకాపా వారు కూడా మా పాదయాత్రకు మద్దతు ఇస్తున్నారు. జగన్‌ కళ్లలో ఆనందం చూసేందుకే మంత్రులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు’ అని అమరావతి ఐకాస కన్వీనర్‌ శివారెడ్డి పేర్కొన్నారు. ప్రకాశరావుపాలెంలో అమరావతి ఐకాస నేతలు విలేకరులతో మాట్లాడారు. ‘జగన్‌ ప్రభుత్వం చేసిన మోసాలు చాలు. మీ శకం ముగిసింది. మీకు ప్రజలు బుద్ధి చెప్పే సమయం దగ్గరలోనే ఉంది’  అని అన్నారు. తమ పాదయాత్రను చిత్రీకరిస్తున్న డ్రోన్‌ కెమెరాలను రాష్ట్రంలో ఉన్న రహదారులు చూపించడానికి వాడితే బాగుంటుందని ఐకాస నేత తిరుపతిరావు పేర్కొన్నారు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు