వేతనాలు అందకుండా.. వేడుకలెలా?

ఆర్బీఐ వేలం సొమ్ము అందితేనే వేతనాలు

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో ఉద్యోగులకు ఈసారి దసరా పండగ.. పండగలా లేదు. సోమవారం రాత్రికి కూడా సెప్టెంబర్‌ నెలకు సంబంధించి కొందరికి జీతాలు, చాలామందికి పెన్షన్లు అందలేదు. ఎప్పుడు వస్తాయో కూడా తెలియదు. హిందూ పండగల్లో కీలకమైన విజయదశమికి పది రోజుల ముందు నుంచే శరన్నవరాత్రి వేడుకలు ప్రారంభమయ్యాయి. ఈ తరుణంలోనూ చేతికి జీతాలు అందక వేల మంది ఉద్యోగులు నిట్టూరుస్తున్నారు. కేవలం పెన్షను డబ్బులపైనే ఆధారపడ్డ రిటైర్డ్‌ ఉద్యోగులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు చక్కగా ఉన్నాయని ఇటీవలే అసెంబ్లీలో ప్రభుత్వ అధినేతలు ఘనంగా ప్రకటించారని, అలాంటప్పుడు తమకు జీతాలివ్వకపోవడం ఏమిటని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. ‘సాధారణంగా ఒకటో తేదీకల్లా మా చేతికి జీతాలు అందాలి. మూడు రోజులుగా ఉద్యోగులు నిరీక్షిస్తున్నారు. అక్కడక్కడ కొద్ది మందికి జీతాలు చెల్లించారు. ఎవరికి ఏ ప్రతిపాదికన మొదట వేతనాలు వేశారో తెలియడం లేదు’ అని వాపోతున్నారు. ఖజానా శాఖ గ్రీన్‌ ఛానల్‌లో వేతనాలు పెండింగ్‌లో ఉన్నట్లు ఆన్‌లైన్‌లో కనిపిస్తోంది. వాస్తవానికి ఖజానాలో చాలినంత ఆర్థిక నిల్వలు లేవు. ప్రభుత్వం సోమవారం రిజర్వ్‌ బ్యాంకు సెక్యూరిటీల వేలంలో పాల్గొని రూ.2,000 కోట్లు సమీకరించింది. సాధారణంగా ప్రతి మంగళవారం ఆర్బీఐ వేలం వేస్తుండగా, ఈసారి దసరా సెలవుల దృష్ట్యా సోమవారమే ఆ ప్రక్రియ పూర్తిచేసింది. ఆర్బీఐ వేలం సొమ్ము మంగళవారం సాయంత్రానికి రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు జమ అయితే, ఆ మొత్తాన్ని తొలుత ఉద్యోగుల జీతాలకు సర్దుబాటు చేస్తారని చెబుతున్నారు. పెన్షన్లు, జీతాలు అందిరికీ వస్తాయా అన్నది అనుమానంగానే ఉంది. నిజానికి గతంలో పండగల సమయంలో ఉద్యోగులు జీతం అడ్వాన్సుగా తీసుకునేవారు. తొలుత అవసరాలు తీర్చుకుని ఆనక ఆ మొత్తాన్ని ప్రభుత్వానికి తిరిగి చెల్లించేవారు. ఇటీవల జీతాలే ఆలస్యమవుతున్నందున అడ్వాన్సుల ఆలోచనే రాలేదని వేతనజీవులు వాపోతున్నారు.


జీతాలు, పెన్షన్లు అందక ఆందోళన: ఐకాస అమరావతి

ఈనాడు, అమరావతి: దసరా పండుగ వచ్చినా కొందరికి జీతాలు, పెన్షన్లు అందకపోవడంతో ఆందోళన చెందుతున్నారని ఏపీ ఐకాస అమరావతి ఛైర్మన్‌, ప్రధాన కార్యదర్శి బొప్పరాజు వెంకటేశ్వర్లు, వైవీ రావు వెల్లడించారు. రాష్ట్రం నలుమూలల నుంచి అనేక మంది ఉద్యోగులు, పెన్షనర్లు ఫోన్లు, వాట్సప్‌ ద్వారా తమ ఆందోళన తెలియచేస్తున్నారన్నారు. దీనిపై ఆర్థిక శాఖ అధికారులను సంప్రదించగా మంగళవారంలోగా జీతాలు, పెన్షన్లు జమ చేస్తామన్నారని చెప్పారు.

జీతాలు వెంటనే చెల్లించాలి: ఉపాధ్యాయ సంఘాలు

తక్షణమే జీతాలు విడుదల చేయాలని రాష్ట్రోపాధ్యాయ సంఘం, ఏపీ ఉపాధ్యాయ సమాఖ్య డిమాండ్‌ చేశాయి. దసరా అతి పెద్ద పండగ అని, మూడో తేదీ వచ్చినా 20శాతం కూడా వేతనాలు ఇవ్వకపోవడం విచారకరమని పేర్కొన్నాయి. ప్రతి నెలా జీతాల కోసం ఎదురుచూడాల్సి వస్తోందని వెల్లడించాయి.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని