పీజీ వైద్య విద్యార్థులకు తప్పనిసరి గ్రామీణ/ప్రభుత్వ సర్వీస్‌

వైద్య ఆరోగ్య శాఖ తాజాగా ఉత్తర్వులు

ఈనాడు, అమరావతి: పీజీ వైద్య విద్యార్థులకు మరోసారి గ్రామీణ/ప్రభుత్వ సేవను ఏడాది పాటు తప్పనిసరి చేస్తూ వైద్య ఆరోగ్య శాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. 2022-23 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ/ప్రైవేట్‌ వైద్య కళాశాలల్లో ‘ఎ’ కేటగిరిలో ప్రవేశాలు పొందిన విద్యార్థులు మాత్రమే ఈ సేవ చేయాల్సి ఉంటుందని ముఖ్యకార్యదర్శి కృష్ణబాబు పేర్కొన్నారు. కౌన్సెలింగ్‌ ద్వారా ప్రాధాన్య క్రమంలో తొలుత వైద్య విధాన పరిషత్‌ ఆధ్వర్యంలో నడిచే జిల్లా/సామాజిక/ప్రాంతీయ ఆసుపత్రుల్లో, అనంతరం బోధనాసుపత్రుల్లో పనిచేసే అవకాశాన్ని కల్పిస్తారు. ప్రవేశాల సమయంలోనే విద్యార్థుల నుంచి వ్యక్తిగత ‘బాండ్‌’ తీసుకుంటారు. మధ్యలో చేయనంటే రూ.40లక్షలు, సూపర్‌ స్పెషాలిటీ వైద్యులు రూ.50లక్షల వరకు జరిమానా చెల్లించాల్సి ఉంటుందని ఆ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ప్రభుత్వ కళాశాలల్లో చదివే 707 మంది, ప్రైవేటు వైద్య కళాశాలల్లో కన్వీనర్‌ కోటా (‘ఎ’ కేటగిరీ) కింద చేరే 1,142 మంది విద్యార్థులు దీని పరిధిలోకి వస్తారు. మేనేజ్‌మెంట్‌ కోటాలో చేరే విద్యార్థులను మినహాయించారు. 2022-23లో ప్రవేశాలు పొందిన విద్యార్థులు పీజీ వైద్య విద్యను 2025లో పూర్తి చేసిన బయటకు వస్తారు. వీరు వెంటనే లేదా కోర్సు పూర్తయిన 18 నెలల్లోగా పనిచేయాల్సి ఉంటుంది. జాతీయ కోటాలో కళాశాలల్లో చేరే విద్యార్థులకు సంబంధించి ఉత్తర్వుల్లో ఏమీ పేర్కొనలేదు. సూపర్‌ స్పెషాలిటీ వైద్యులకు నెలకు రూ.లక్ష, స్పెషాలిటీకి (పీజీ క్లినికల్‌) రూ.75,000, స్పెషాలిటీ (పీజీ పారా క్లినికల్‌) వైద్యులకు రూ.75వేల చొప్పున గౌరవవేతనం ఇచ్చే అవకాశం ఉంది. తాజా పరిణామాల నేపథ్యంలో నేరుగా డైరెక్టరేట్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ కార్యాలయం ద్వారా కౌన్సెలింగ్‌ జరుగుతుందా? కళాశాలల వారి ద్వారా యథావిధిగా కొనసాగించాలా? అన్న దానిపై పరిశీలన జరుగుతోంది.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు