స్థిరాస్తి వ్యాపారులకు దోచిపెట్టడానికే మూడు రాజధానులు

మావోయిస్టు పార్టీ ఏఓబీ జోనల్‌  కమిటీ కార్యదర్శి గణేష్‌ లేఖ

ఈనాడు డిజిటల్‌, పాడేరు: మూడు రాజధానుల పేరుతో విశాఖ నగర చుట్టుపక్కల వేలాది ఎకరాల భూములను ఆక్రమించి ముఖ్యమంత్రి తన సన్నిహితులు, పార్టీ నేతలు, స్థిరాస్తి వ్యాపారులకు దోచిపెడుతున్నారని మావోయిస్టు పార్టీ ఆంధ్రా ఒడిశా సరిహద్దు (ఏఓబీ) జోనల్‌ కమిటీ కార్యదర్శి గణేష్‌ ఓ లేఖలో ఆరోపించారు. ఈ మూడేళ్లలో రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రజల భూములను ఆక్రమించుకోవడం ఓ విధానంగా మారిపోయిందని పేర్కొన్నారు. ‘శ్రీకాకుళం జిల్లా పలాస మండలం రామకృష్ణాపురంలో సర్వే నంబర్‌ 143/1లో ప్రజలు పోరాడి సాధించుకున్న 30 ఎకరాల విలువైన భూములతో పాటు వాటి చుట్టుపక్కల రైతులవి కూడా వైకాపా నాయకులు దువ్వాడ శ్రీధర్‌, మంత్రి సీదిరి అప్పలరాజు, ఎంపీ విజయసాయిరెడ్డి కలిసి ఆక్రమించుకుని ఓ కార్పొరేట్‌ కంపెనీకి రూ.వేల కోట్లకు ధారాదత్తం చేస్తున్నారు. దీనికి వ్యతిరేకంగా ప్రజలు పోరాడుతున్నా అధికార బలంతో తప్పుడు కేసులు బనాయించి ఇబ్బందులకు గురి చేస్తున్నారు. కాశీబుగ్గ పలాస పట్టణాలకు సమీపంలోని సూదికొండ, నెమలికొండలు ఆక్రమించుకుని మట్టిని, రాళ్లను యథేచ్ఛగా అమ్ముకుంటున్నారు. విశాఖ ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆవరణలో అరాచక కార్యకలాపాలు జరుగుతున్నాయని ప్రచారం చేసి... పచ్చగా ఉండే వందలాది చెట్లను నరికేసి ఆక్రమణలకు ప్రయత్నిస్తున్నారు...’ అని వివరించారు.‘పర్యాటక ప్రాంతమైన రుషికొండపై ఏపీటీడీసీ అడ్డుగోలుగా నిర్మాణాలు చేపట్టి అక్రమాలకు పాల్పడుతోంది. లేటరైట్‌ పేరుతో వేలాది ఎకరాల్లో అడవులను ధ్వంసం చేసి నాలుగు లైన్ల రోడ్లను నిర్మించి పర్యావరణాన్ని దెబ్బతిస్తున్నారు...’ అని పేర్కొన్నారు.

గొంతు విప్పితే జైలుపాలు

‘అరకులోయ మండలం మాడగడలో ఎమ్మెల్యే గడపగడపకు వచ్చినప్పుడు తమ భూమి ఆక్రమణపై నిలదీసినందుకు గిరిజన కుటుంబంపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. వైకాపా దోపిడీ, దౌర్జన్యాలకు వ్యతిరేకంగా ఎవరు గొంతు విప్పినా జైలుపాలు చేస్తున్నారు. ఇలాంటి అరాచకాలు సృష్టిస్తున్న వైకాపా నేతలను మన ప్రాంతం నుంచి తరిమికొట్టాలి. భవిష్యత్తు పోరాటానికి సిద్ధం కావాలి. దోపిడీ, అక్రమాలకు వ్యతిరేకంగా చేస్తున్న న్యాయపరమైన పోరాటాలకు అన్ని వర్గాల ప్రజలు అండదండలు అందించాలని సీపీఐ మావోయిస్టు పార్టీ పిలుపునిస్తోంది...’ అని ఆ లేఖలో జోనల్‌ కమిటీ కార్యదర్శి గణేష్‌ పేర్కొన్నారు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు