
సంక్షిప్త వార్తలు (13)
ఎన్టీఆర్ ట్రస్ట్ ఉపకార వేతనాలకు దరఖాస్తుల ఆహ్వానం
మొయినాబాద్, న్యూస్‌టుడే: ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతిభావంతులైన విద్యార్థినులకు ఉపకార వేతనాలు అందించనున్నట్లు మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి వెల్లడించారు. డిసెంబరు 4న జీఈఎస్‌టీ-2023 పేరుతో పరీక్ష నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పదో తరగతి చదువుతున్న విద్యార్థినులు ఈ పరీక్ష రాయడానికి అర్హులన్నారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు www.ntrtrust.org వెబ్సైట్లో ఈ నెల 30వ తేదీలోగా పేర్లు నమోదు చేసుకోవాలని ట్రస్ట్ డీన్ డా.ఎంవీ రామారావు తెలిపారు. మరింత సమాచారం కోసం 7660002627/28 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.
పిచ్చిదాన్నంటూ వేధిస్తున్నారని అధికారిణి ఫిర్యాదు
బాపట్ల, న్యూస్‌టుడే: బాపట్ల జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయ సిబ్బంది రాయుడు, వినోద్ కుమార్ తనను విధులు నిర్వర్తించనీయకుండా అడ్డుతగులుతూ వేధిస్తున్నారని అదే కార్యాలయంలో పనిచేసే ఓ మహిళా అధికారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. డీపీవో రమేష్ వారికే మద్దతు పలుకుతూ తనను ఇబ్బంది పెడుతున్నారని వాపోయారు. ఈ విషయమై రెండురోజుల క్రితం ‘స్పందన’ కార్యక్రమంలో కలెక్టర్ విజయకృష్ణన్‌కు ఇచ్చిన ఫిర్యాదును ఉపసంహరించుకోవాలంటూ ఓ పత్రిక(ఈనాడు కాదు) విలేకరి శివ ద్వారా ఫోన్లో బెదిరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. బాపట్ల పోలీస్‌స్టేషన్ దగ్గర ఆమె విలేకర్లతో మాట్లాడుతూ... తన మానసిక స్థితి బాగా లేదంటూ ప్రచారం చేస్తున్నారని కంటతడి పెట్టారు. అధికారిణి ఫిర్యాదుపై కలెక్టర్ విజయకృష్ణన్ స్పందించి విచారణకు కమిటీని వేశారు. కమిటీసభ్యులు బుధవారం బాధితురాలితో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ‘రాయుడు, వినోద్‌కుమార్‌ను విధుల నుంచి తప్పించా’ అని డీపీవో రమేష్ చెప్పారు.
రేపు అంగప్రదక్షిణం టోకెన్ల కోటా విడుదల
తిరుమల, న్యూస్‌టుడే: భక్తుల సౌకర్యార్థం డిసెంబరు మాసానికి సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్ల కోటాను శుక్రవారం ఉదయం 10 గంటలకు తితిదే విడుదల చేయనుంది. భక్తులు ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకోవాలని తితిదే కోరింది.
దిల్లీలో విద్యుత్ సంఘాల ధర్నా
ఈనాడు, దిల్లీ: ప్రమాదకరమైన అంశాలతో ఉన్న విద్యుత్ సవరణ బిల్లును కేంద్ర ప్రభుత్వం వెంటనే ఉప సంహరించుకోవాలని సీఐటీయూ జాతీయ కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు ఎలమారం కరీం డిమాండ్ చేశారు. విద్యుత్ సవరణ బిల్లు ఉపసంహరణతో పాటు వివిధ డిమాండ్లతో నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ అండ్ ఇంజినీర్స్ ఆధ్వర్యంలో దిల్లీ(జంతర్‌మంతర్)లో బుధవారం విద్యుత్ ఇంజినీర్లు, ఉద్యోగులు ధర్నా చేశారు. ఈ సందర్భంగా కరీం మాట్లాడుతూ విద్యుత్ బోర్డులపై భారాలు, విద్యుత్ రంగం ప్రైవేటీకరణ అంశాలను బిల్లులో ప్రతిపాదించారని తెలిపారు.
గుండెపోటుతో సీనియర్ అసిస్టెంట్ మృతి
విద్యుత్ ఉద్యోగుల ధర్నాలో పాల్గొనేందుకు దిల్లీకి వస్తున్న వైయస్ఆర్ జిల్లా, ప్రొద్దుటూరు సీనియర్ అసిస్టెంట్ ఎం. చెన్నకేశవులు మార్గమధ్యలో రైలులో గుండెపోటుతో మరణించారు.
పంచాయతీ కార్యదర్శుల గ్రేడ్లపైనా చర్యలు తీసుకోండి
సీఎంకు ఏపీ పంచాయతీ కార్యదర్శుల సమాఖ్య విజ్ఞప్తి
ఈనాడు, అమరావతి: పంచాయతీ కార్యదర్శుల గ్రేడ్లను నాలుగు నుంచి రెండుకు తగ్గించాలని ఏపీ పంచాయతీ కార్యదర్శుల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు వి.శంకర్, ఉపాధ్యక్షులు విజయ్‌కుమార్, బీవీ రమణారెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. గ్రామ సచివాలయాల్లోని సర్వే అసిస్టెంట్ల గ్రేడ్లు 3 నుంచి 2కి తగ్గిస్తూ పదోన్నతులు కల్పిస్తామని శ్రీకాకుళం జిల్లాలో సీఎం జగన్ ప్రకటించారని అన్నారు. పంచాయతీ కార్యదర్శుల గ్రేడ్లు తగ్గించాలని చాలా ఏళ్లుగా కోరుతున్నామని వారు తెలిపారు. మంత్రులకు, ఉన్నతాధికారులకు వినతిపత్రాలు ఇచ్చినట్లు చెప్పారు. సర్వే అసిస్టెంట్లలాగే, తమ కోరికనూ ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలని కోరారు.
తహసీల్దార్ల పదోన్నతికి ప్రతిపాదనలు
మండల తహసీల్దార్లలో 192 మందికి డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతి ఇచ్చేందుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. వీరిపై క్రమశిక్షణ చర్యలు ఉంటే తెలియచేయాలని రెవెన్యూ శాఖ నుంచి జిల్లాలకు ఆదేశాలు వెళ్లాయి.
21 మంది అదనపు ఎస్పీలకు నాన్ క్యాడర్ ఎస్పీలుగా పదోన్నతి
ఈనాడు, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో 21 మంది అదనపు ఎస్పీలకు నాన్ క్యాడర్ ఎస్పీలుగా పదోన్నతి, ఆ హోదాలో పోస్టింగులను ప్రభుత్వం ఇచ్చింది. నిఘా విభాగం, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, ట్రాఫిక్, ఏసీబీ, సీఐడీ, రైల్వే, ట్రాన్స్‌కో తదితర విభాగాల్లో వీరిని నాన్ క్యాడర్ ఎస్పీలుగా నియమించింది. ఈ మేరకు హోంశాఖ ముఖ్య కార్యదర్శి హరీష్‌కుమార్ గుప్తా బుధవారం ఉత్తర్వులిచ్చారు.
ట్రాన్స్‌జెండర్ ప్రొటెక్షన్ సెల్ ప్రారంభం
ఈనాడు, అమరావతి: ఆంధ్రప్రదేశ్ సీఐడీ విభాగంలో కొత్తగా ట్రాన్స్‌జెండర్ ప్రొటెక్షన్ సెల్‌ను ఏర్పాటుచేశారు. సీఐడీ విభాగాధిపతి పీవీ సునీల్‌కుమార్ బుధవారం దీన్ని ప్రారంభించారు. ఎస్పీ కేజీవీ సరిత ఈ విభాగానికి నోడల్ అధికారిగా వ్యవహరిస్తారు.
నేటి నుంచి పాలిటెక్ ఫెస్ట్
ఈనాడు, అమరావతి: విద్యార్థుల్లో సృజనాత్మకత, వినూత్న ఆలోచనలను ప్రోత్సహించేందుకు పాలిటెక్ ఫెస్ట్ నిర్వహిస్తున్నామని సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నాగరాణి తెలిపారు. విజయవాడలో గురువారం నుంచి మూడు రోజులపాటు రాష్ట్ర స్థాయిలో ఈ ఫెస్ట్ నిర్వహిస్తున్నామని, ఇందులో 253 ప్రాజెక్టులను విద్యార్థులు ప్రదర్శిస్తారని వెల్లడించారు. రోజూ పాలిటెక్నిక్ కళాశాలలు, పాఠశాలల విద్యార్థులు 5వేల మంది సందర్శించేలా ఏర్పాటు చేస్తున్నామని, ఉత్తమ ప్రాజెక్టులను ఎంపిక చేసి బహుమతులు అందిస్తామని వివరించారు.
స్టాంపు డ్యూటీ మినహాయింపులపై ఉత్తర్వులు
ఈనాడు, అమరావతి: శ్రీసత్యసాయి జిల్లాలోని కియా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌కు కేటాయించిన భూములకు సంబంధించి స్టాంప్, బదిలీ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు నుంచి మినహాయింపునిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రాజెక్టు సైట్ (535.5 ఎకరాలు), టౌన్షిప్ (36 ఎకరాలు), ట్రైనింగ్ సెంటర్ (11.02 ఎకరాలు), ట్రక్ టెర్మినల్ (30 ఎకరాలు), రైల్వే సైడింగ్ (50 ఎకరాలు) ఉన్న భూముల విషయాల్లో మినహాయింపులిచ్చారు. కర్నూలులోని వాసవి సత్ర సముదాయ భవనం విషయంలోనూ స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయిస్తూ ప్రభుత్వం మరో ఉత్తర్వు ఇచ్చింది. విజయవాడలోని హరే కృష్ణా మూవ్మెంట్ ఇండియా ఉపాధ్యక్షుడు నుంచి వచ్చిన విజ్ఞప్తి మేరకు దేవాదాయశాఖతో జరిగే లీజు అగ్రిమెంట్‌కు కూడా స్టాంపు డ్యూటీని మినహాయిస్తున్నట్లు ప్రభుత్వం ఇంకో ఉత్తర్వులో పేర్కొంది. ఈ మధ్యకాలంలో ఇచ్చిన ఈ ఉత్తర్వులను తాజాగా ప్రభుత్వం అప్లోడ్ చేసింది.
దాల్మియాతో నైపుణ్యాభివృద్ధి సంస్థ ఒప్పందం
ఈనాడు, అమరావతి: నిరుద్యోగ యువతకు నిర్మాణ, ఆరోగ్య రంగాల్లో శిక్షణ ఇచ్చేందుకు దాల్మియా భారత్ ఫౌండేషన్(డీబీఎఫ్)తో రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా కడప జిల్లా జమ్మలమడుగులో నైపుణ్యాభివృద్ధి సంస్థ అందించే ప్రాంగణంలో డీబీఎఫ్ ల్యాబ్‌లను ఏర్పాటు చేసి, నిరుద్యోగ యువతకు శిక్షణ ఇస్తుంది.
ఎన్టీఆర్ జిల్లా దేవాదాయ అధికారిణి శాంతి రిలీవ్
ఈనాడు, అమరావతి: వేరొక జిల్లాకు సర్దుబాటు చేస్తూ ఆదేశాలు జారీ అయినా, అక్కడికి వెళ్లకుండా కొనసాగుతున్న ఎన్టీఆర్ జిల్లా దేవాదాయశాఖ అధికారిణి శాంతి ఎట్టకేలకు బుధవారం రిలీవ్ అయ్యారు. నెమలి వేణుగోపాలస్వామి ఆలయ ఈవో అయిన శాంతి ఎన్టీఆర్ జిల్లా దేవాదాయ అధికారిణిగా ఇన్ఛార్జ్ బాధ్యతలు చూస్తున్నారు. విశాఖ ఉపకమిషనర్‌గా సర్దుబాటు చేయాలంటూ ఆమె దేవాదాయ కమిషనర్‌కు అభ్యర్థన పెట్టుకోగా, అనకాపల్లి జిల్లా దేవాదాయ అధికారిణిగా సర్దుబాటు చేశారు. ఆ పోస్టింగ్ నచ్చకపోవడంతో ఆమె రిలీవ్ కాకుండా కొనసాగుతున్నారు. మరోవైపు ఎన్టీఆర్ జిల్లాకు దేవాదాయ అధికారిణిగా శ్రీకాకుళం నుంచి వచ్చిన అన్నపూర్ణ ఇక్కడి బాధ్యతలు చేపట్టి, విధులు నిర్వహిస్తున్నారు. దీనిపై ‘దేవాదాయశాఖలో పోస్టింగ్ పేచీ’ శీర్షికన ‘ఈనాడు’లో ప్రచురితమైన కథనానికి ఆ శాఖ ఉన్నతాధికారులు స్పందించారు. ప్రాంతీయ సంయుక్త కమిషనర్ సురేష్‌బాబు, ఉపకమిషనర్ విజయరాజు బుధవారం విజయవాడలోని జిల్లా దేవాదాయ అధికారి కార్యాలయానికి వచ్చి శాంతితో మాట్లాడారు. దీంతో చివరకు ఆమె రిలీవ్ అయ్యారు.
స్థిరాస్తుల లీజులకు అనుమతి తప్పనిసరి
ఈనాడు, అమరావతి: నగరపాలక సంస్థలకు చెందిన స్థిరాస్తుల లీజులకు కాలపరిమితి మూడేళ్లకు మించి.. 25 ఏళ్లలోపు ఉంటే, అలాంటి లీజులకు రాష్ట్ర ప్రభుత్వ అనుమతి తప్పనిసరి చేశారు. మూడేళ్లలోపు లీజులకు యథావిధిగా నగరపాలక సంస్థల్లో స్థాయీసంఘం ఆమోదం సరిపోతుంది. అంతకంటే మించిన లీజులపై బహిరంగ వేలం నిర్వహించి వాటి వివరాలను ప్రభుత్వ ఆమోదానికి పంపాలి. పురపాలక సంఘాల్లో ఇప్పటివరకు అమలులో ఉన్న ఈ విధానాన్ని నగరపాలక సంస్థలకూ వర్తింపజేస్తూ చట్టాన్ని సవరించారు.
ప్రాదేశిక సభ్యులకు గౌరవ వేతనం ఇంకెప్పుడు?
ఈనాడు, అమరావతి: తెలంగాణ ప్రభుత్వం మండల, జిల్లా పరిషత్ ప్రాదేశిక సభ్యుల, మండల పరిషత్ అధ్యక్షుల, సర్పంచుల గౌరవ వేతనం ఇటీవల 30% పెంచినా... ఏపీలో ప్రతి నెలా చెల్లించాల్సిన గౌరవ వేతనాల్లో జాప్యంపై వారంతా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. చాలా జిల్లాల్లో ఈ ఏడాది జనవరి నుంచి చెల్లింపులు నిలిచిపోయాయని సభ్యులు చెబుతున్నారు. మండల పరిషత్ ఎంపీటీసీ సభ్యులకు నెలకు రూ.3వేలు, జడ్పీటీసీ సభ్యులకు రూ.6 వేల చొప్పున చెల్లించాలి. మండల, జిల్లా పరిషత్ పీడీ ఖాతాలను ఆర్థికశాఖ ఆధ్వర్యంలోని సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ (సీఎఫ్ఎంఎస్)కి అనుసంధానించడంతో చెల్లింపుల్లో జాప్యమతున్నట్లు అధికారులు చెబుతున్నారు.
మరిన్ని
Andhra News: ఇల్లు కూల్చివేత.. పోలీస్‌స్టేషన్ వద్ద వర్షంలో తడుస్తూ వృద్ధురాలి నిరసన
Kishan Reddy: ప్రభుత్వాలు చేయలేనివి.. సత్యసాయి చేశారు: కిషన్‌రెడ్డి
హెచ్ఎంపై దాడి చేసిన నిందితులను శిక్షించాలని ఉపాధ్యాయుల డిమాండ్
Honeytrap: వైకాపా నాయకురాలి హనీట్రాప్.. వీడియోలు, ఫొటోలు చూసి అవాక్కైన పోలీసులు!
‘తమ్ముడూ అదీప్‌రాజ్.. జగనన్నను తిడుతున్నారు.. తక్షణమే రావాలి’


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Allu Aravind: నా కోడలు స్నేహ వర్కింగ్ ఉమెన్: అల్లు అరవింద్
-
World News
US-Mexico: భారతీయుడైతే 21 వేల డాలర్లు
-
Crime News
Andhra News: ఇంజినీరింగ్ విద్యార్థి ఆత్మహత్య.. ఘటనాస్థలానికి వెళ్లిన వార్డెన్ హఠాన్మరణం
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Sports News
PV Sindhu: ఆ స్వర్ణం కోసం అయిదేళ్లు ఎదురుచూశా: పీవీ సింధు
-
Politics News
YSRCP: ప్రతి ఇంటికీ జగన్ స్టిక్కర్!