
భూవివాదాలు తగ్గించేందుకే హక్కుపత్రాలు
2023 డిసెంబరు నాటికి రీసర్వే పూర్తిచేస్తాం
మూడున్నరేళ్లలో ఎన్నో విప్లవాత్మక మార్పులు
నరసన్నపేట సభలో సీఎం జగన్
ఈనాడు డిజిటల్-శ్రీకాకుళం, న్యూస్‌టుడే-నరసన్నపేట: ‘రాష్ట్రంలో భూముల సమగ్ర రీ సర్వే ద్వారా భూదస్త్రాల ప్రక్షాళన జరుగుతోంది. ఇప్పటికే 2వేల గ్రామాల్లోని 7.92 లక్షల మందికి సంబంధించిన భూముల సర్వే పూర్తయింది. వారందరికీ హక్కుపత్రాలు అందిస్తున్నాం. తర్వాత 17,584 రెవెన్యూ గ్రామాలు, పట్టణాల్లోని భూ రికార్డులన్నింటినీ సర్వేచేసి 2023 డిసెంబరు నాటికి రాష్ట్రవ్యాప్తంగా ప్రక్రియను పూర్తిచేస్తాం. భూ యజమానులకు హక్కుపత్రాలు చేతిలో పెడతాం’ అని ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి తెలిపారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష పథకం రెండోవిడత భూ సర్వేను బుధవారం ఆయన ప్రారంభించారు. సర్వే పూర్తయిన గ్రామాల్లోని రైతులకు నమూనా హక్కుపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో ముందుగా నరసన్నపేట ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్, రెవెన్యూమంత్రి ధర్మాన ప్రసాదరావు మాట్లాడారు. అనంతరం ముఖ్యమంత్రి ప్రసంగించారు.
‘భూముల విలువ పెరగడంతో అక్రమాలు పెరిగిపోయాయి. వీటివల్ల ప్రజలు పడుతున్న అగచాట్లను పాదయాత్రలో చూశాను. సంపాదించుకున్న, వారసత్వంగా వచ్చిన ఆస్తిని పిల్లలకు ఇచ్చే సమయానికి ఎవరో వచ్చి గద్దల్లా తన్నుకుపోతే ఆ బాధ ఎలా ఉంటుందో ఆలోచిస్తేనే కష్టంగా ఉంది.
కోర్టుల్లోని సివిల్ కేసుల్లోనూ 80-90 శాతం భూ వివాదాలవే. వాటిని తగ్గించాలనే భూములన్నింటికీ కొలతలు వేసి, పూర్తి వివరాలతో కూడిన హక్కుపత్రాలు అందిస్తున్నాం. ఇక ఎవరో వచ్చి సర్వేనంబర్లు మార్చేయడానికి, సబ్ డివిజన్లు చేసి క్రయ, విక్రయాలు చేయడానికి ఆస్కారం ఉండదు. సర్వే పూర్తయితే భూముల క్రయవిక్రయాలు, రిజిస్ట్రేషన్ సేవలు గ్రామ సచివాలయాల్లోనే అందుతాయి. లంచాలకు తావులేకుండా చేస్తున్నాం.
విలేజ్ సర్వేయర్లకు గ్రేడ్-2 పదోన్నతి
రాష్ట్రంలోని విలేజ్ సర్వేయర్లకు పదోన్నతి కల్పిస్తున్నాం. భూసర్వేలో సమర్థంగా విధులు నిర్వహిస్తున్న సచివాలయాల్లోని సర్వేయర్లను గ్రేడ్-3 నుంచి గ్రేడ్-2గా మారుస్తున్నాం.
అందుకే మూడు రాజధానులు
గ్రామ సచివాలయాల్లో 1.3 లక్షల శాశ్వత ఉద్యోగ నియామకాలు చేపట్టాం. కుప్పం సహా 25 రెవెన్యూ డివిజన్లను కొత్తగా ఇచ్చాం. రాష్ట్రంలో రాజధాని ఒకేచోట ఉంటే జరిగే మంచి కన్నా... మూడు ప్రాంతాలు బాగుపడాలని రాజధానుల్ని మూడు ప్రాంతాలకు ఇచ్చాం. కొత్తగా 17 ప్రభుత్వ వైద్యకళాశాలలు కడుతున్నాం. ఇచ్ఛాపురం, పలాస ప్రాంతంలో కిడ్నీ బాధితుల కోసం రూ.756 కోట్లతో తాగునీరు అందించేందుకు, రూ.50 కోట్లతో కిడ్నీ పరిశోధన ఆసుపత్రి నిర్మాణానికి అడుగులు పడుతున్నాయి.
రాముడెవరో.. రావణుడెవరో..
తన భార్య కోసం యుద్ధం చేస్తే శ్రీరాముడు అంటారు. అదే పరాయి స్త్రీ మీద కన్నేసి ఎత్తుకుపోవాలని చూస్తే రావణుడు అంటారు. తనకు తాను పార్టీ పెట్టుకుని అధికారంలోకి వస్తే వాళ్లను ఎంజీఆర్.. ఎన్టీఆర్.. జగన్ అంటారు. సొంత కుమార్తెను ఇచ్చిన మామను, ఆయన పెట్టిన పార్టీని, ట్రస్టును, చివరికి ప్రజలిచ్చిన సీఎం కుర్చీని వెన్నుపోటు పొడిచి కబ్జా చేస్తే వాళ్లను చంద్రబాబు అంటారు’ అని సీఎం పేర్కొన్నారు.
ఒక్క మంచి పనైనా చేశారా: మంత్రి ధర్మాన
అంతకు ముందు మంత్రి ధర్మాన ప్రసాదరావు మాట్లాడారు. ‘తెదేపా ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో శ్రీకాకుళం జిల్లాకు ప్రయోజనం కలిగించే ఒక్క పనైనా చేశారా? చంద్రబాబు 15 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఓట్లేసి అధికారం ఇచ్చిన వెనుకబడిన జిల్లాకు ఏ గొప్ప పని చేశారో చెప్పండి. రోడ్లమీద గోతులు ఉన్నాయంటున్నారు. మీరు అధికారంలో ఉన్నప్పుడు సరైన రోడ్డు వేసుంటే మూడున్నరేళ్లకే ఎందుకు గుంతలు పడతాయి? చంద్రబాబు రాష్ట్రానికి దూరంగా, జూమ్ కెమెరాకు దగ్గరగా ఉంటారు. విశాఖలో రాజధాని పెడితే మీకు వచ్చిన ఇబ్బందేంటి? మా రాజధాని వద్దని చెప్పడానికి, అమరావతి నుంచి కొంతమందిని తీసుకొచ్చి.. మాచేత్తో మా కళ్లు పొడిపిస్తారా? పాదయాత్ర వచ్చుంటే ఈ నాలుగు జిల్లాల్లో ఏ ఒక్కరూ తెదేపాకు ఓటేసేవారు కారు’ అని అన్నారు.
సీఎం బందోబస్తులో ట్రాఫిక్ హెడ్‌కానిస్టేబుల్ మృతి
జలుమూరు, నరసన్నపేట, అనకాపల్లి పట్టణం, న్యూస్‌టుడే: నరసన్నపేటలో ముఖ్యమంత్రి సభ సందర్భంగా విధి నిర్వహణకు వచ్చిన ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్ ఎర్రంశెట్టి అప్పారావు(54) మరణించారు. మధ్యాహ్నం 12.30 సమయంలో ఛాతిలో నొప్పి వస్తున్నట్లు తోటి సిబ్బందికి చెప్పగా వెంటనే 108లో ప్రైవేటు ఆసుపత్రికి తరలిస్తుండగా దారిలోనే మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. ముఖ్యమంత్రి పర్యటన బందోబస్తులో ఉన్న మరో హెడ్ కానిస్టేబుల్ కె.వి. రమణకృష్ణ కూడా ఉదయం 11 గంటల సమయంలో గుండెపోటుకు గురయ్యారు. వెంటనే ఆయనను శ్రీకాకుళంలోని ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చి ప్రథమచికిత్స అందించి విశాఖకు తరలించారు.
బాలిక వైద్యానికి భరోసా
నరసన్నపేట, సారవకోట, న్యూస్‌టుడే: ఏడేళ్లుగా తలకు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్న చిన్నారి మీసాల ఇంద్రజను ఆదుకునేందుకు సీఎం జగన్ ముందుకొచ్చారు. విజయనగరం జిల్లా రేగిడి మండలం చినశిర్లాం గ్రామానికి చెందిన మీసాల ఇంద్రజ వయసు ఏడేళ్లు. ఈమె తల పెద్దగా పెరిగిపోతోంది. ముఖ్యమంత్రి వస్తున్నారని.. ఆమెను తల్లి కృష్ణవేణి హెలిప్యాడ్ వద్దకు తీసుకొచ్చారు. సభాస్థలికి వెళుతున్న సీఎం జగన్.. వెంటనే వాహనం దిగి వివరాలు తెలుసుకున్నారు. ఇంద్రజ తండ్రి అప్పలనాయుడు కిడ్నీ వ్యాధి బాధితుడు. బిడ్డ వైద్యానికి ఇప్పటికే రూ.4 లక్షలు ఖర్చుచేశామని, మరో రూ.20 లక్షలు అవుతుందని వైద్యులు చెబుతున్నారని సీఎంకు కృష్ణవేణి వివరించారు. దీంతో.. చికిత్సఖర్చును ప్రభుత్వం నుంచి భరిస్తామని సీఎం హామీ ఇచ్చారు. ఇంద్రజకు ఇస్తున్న పింఛను మొత్తాన్ని రూ.3వేల నుంచి రూ.10వేలకు పెంచుతామని హామీ ఇచ్చారు. అనంతరం ఇంద్రజ ఆరోగ్యంపై కలెక్టర్ శ్రీకేశ్ బి.లఠ్కర్ ఆమె తల్లిదండ్రులతో మాట్లాడారు. వైద్య పరీక్షల నిమిత్తం జెమ్స్ ఆసుపత్రికి తరలించారు.
మరిన్ని
Andhra News: ఇల్లు కూల్చివేత.. పోలీస్‌స్టేషన్ వద్ద వర్షంలో తడుస్తూ వృద్ధురాలి నిరసన
Kishan Reddy: ప్రభుత్వాలు చేయలేనివి.. సత్యసాయి చేశారు: కిషన్‌రెడ్డి
హెచ్ఎంపై దాడి చేసిన నిందితులను శిక్షించాలని ఉపాధ్యాయుల డిమాండ్
Honeytrap: వైకాపా నాయకురాలి హనీట్రాప్.. వీడియోలు, ఫొటోలు చూసి అవాక్కైన పోలీసులు!
‘తమ్ముడూ అదీప్‌రాజ్.. జగనన్నను తిడుతున్నారు.. తక్షణమే రావాలి’


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Kotamreddy: సజ్జల గుర్తుపెట్టుకో.. నాకు ఫోన్‌కాల్స్ వస్తే మీకు వీడియో కాల్స్ వస్తాయ్: కోటంరెడ్డి
-
Sports News
IND vs AUS: ఆస్ట్రేలియా జట్టులో కంగారు మొదలైంది..: మహమ్మద్ కైఫ్
-
Movies News
Sameera Reddy: మహేశ్‌బాబు సినిమా ఆడిషన్.. ఏడ్చుకుంటూ వచ్చేశా: సమీరారెడ్డి
-
India News
ఘోరం.. వ్యాధి తగ్గాలని 3 నెలల చిన్నారికి 51 సార్లు కాల్చి వాతలు..!
-
Movies News
OTT Movies: డిజిటల్ తెరపై మెరవనున్న బాలీవుడ్ తారలు
-
Politics News
Bhuma Akhila Priya: ఆళ్లగడ్డలో ఉద్రిక్తత.. భూమా అఖిలప్రియ గృహ నిర్బంధం