‘తమ్ముడూ అదీప్‌రాజ్‌.. జగనన్నను తిడుతున్నారు.. తక్షణమే రావాలి’

పెందుర్తి, న్యూస్‌టుడే: ‘తమ్ముడూ.. అదీప్‌రాజ్‌ మీరు ఎక్కడ ఉన్నా తక్షణమే వచ్చి లబ్ధిదారులకు తాళాలు ఇప్పించండి. మన ప్రభుత్వాన్ని.. జగనన్నను తిడుతున్నారు.. ఎక్కడ ఉన్నా రాతిచెరువు ప్రాంతానికి రావాలని కోరుకుంటున్నా.. ఇట్లు మీ అక్క రాధ’ అంటూ ఓ మహిళ విశాఖ జిల్లా పెందుర్తి ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్‌రాజ్‌ను వేడుకున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో తీవ్ర కలకలం రేపింది.

రాధ ప్రస్తుతం సింహాచలం దేవస్థానం ట్రస్టు బోర్డులో.., వైకాపా సాంస్కృతిక విభాగంలోనూ సభ్యురాలిగా ఉన్నారు. విశాఖలోని వేపగుంట జోన్‌-8 కార్యాలయంలో జరిగిన సమావేశంలో లబ్ధిదారులకు పట్టాలు అందించారు. ఇళ్ల వద్దకు వెళ్తే తాళాలు ఇస్తారని పెందుర్తి ఎమ్మెల్యే అదీప్‌రాజ్‌ వేదికపై ప్రకటించారు. ఆ మేరకు సుమారు 50 మంది పెందుర్తి రాతిచెరువు ప్రాంతంలోని టిడ్కో గృహ సముదాయాలవద్దకు తమ సొంత తాళాలు తెచ్చుకుని ఇళ్ల స్వాధీనం కోసం వెళ్లారు. తమకు కేటాయించిన ఇళ్ల తాళాలు ఇవ్వాలని అక్కడ సెక్యూరిటీ సిబ్బందిని కోరారు.

తమకు ఎలాంటి ఆదేశాలూ రాలేదని సిబ్బంది చెప్పడంతో లబ్ధిదారులంతా తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే మాట ఇచ్చిన మేరకు తమకు ఇళ్ల తాళాలు ఇవ్వాలని కోరుతూ భవనాల ఎదుట నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. అందుకు సంబంధించిన వీడియోలను సామాజిక మాధ్యమాల్లో ఉంచారు. మధ్యాహ్నం 3 గంటల వరకు నిరసన తెలిపి ఎవరూ పట్టించుకోకపోవడంతో లబ్ధిదారులంతా తిరిగి వెళ్లిపోయారు. దీనిపై టిడ్కో గృహాల ఏఈ అనూష మాట్లాడుతూ.. గురువారం ఉదయం లబ్ధిదారులందరికీ ఇళ్ల తాళాలు అందజేస్తామని, కొన్ని తాళాలు కనిపించకపోవడంవల్లే బుధవారం ఇవ్వలేకపోయామని వివరించారు.


మరిన్ని