విజయసాయిరెడ్డి సెల్‌ఫోన్‌ అపహరణ!

పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు

ఈనాడు, అమరావతి: రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి సెల్‌ఫోన్‌ అపహరణకు గురైనట్లు తాడేపల్లి పోలీసులకు ఫిర్యాదు అందింది. ఈ మేరకు బుధవారం ఉదయం ఎంపీ విజయసాయిరెడ్డి వ్యక్తిగత సహాయకుడు లోకేశ్వరరావు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఆ సమయంలో ఉన్నతాధికారులు స్టేషన్‌లో లేకపోవడంతో రిసెప్షన్‌లో విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి దానిని అందించారు. ఇదే సమయంలో స్టేషన్‌కు వచ్చిన ఎస్‌ఐ రమేష్‌ వివరాలను ఆరా తీశారు. ఈనెల 21వ తేదీ మధ్యాహ్నం నుంచి సెల్‌ఫోన్‌ కనిపించకపోవడంతో చోరీకి గురైందని, ఐఫోన్‌-12 ప్రో మోడల్‌ ఫోన్‌ ఎక్కడ పోయిందో గుర్తించలేకపోతున్నామని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై సీఐ శేషగిరిరావు పర్యవేక్షణలో విచారణ జరుగుతోంది. ఇతర వివరాలు చెప్పడానికి పోలీసులు నిరాకరించారు. ఈనెల 21న సెల్‌ఫోన్‌ కనిపించకపోతే రెండు రోజుల తర్వాత 23న ఫిర్యాదు చేయడం గమనార్హం.


మరిన్ని