ఆర్టీసీ బస్సులో ప్రసవం

కోల్‌కతా నుంచి పులివెందుల వస్తుండగా ఘటన
తల్లీబిడ్డ క్షేమం

పులివెందుల, న్యూస్‌టుడే: భర్తను కలుసుకునేందుకు కోల్‌కతా నుంచి వచ్చిన నిండు గర్భిణికి బస్సులో ప్రసవం అయిన ఉదంతమిది... వైయస్‌ఆర్‌ జిల్లా పులివెందుల ప్రభుత్వ ప్రాంతీయాసుపత్రి ఎదుట ఈ ఘటన చోటుచేసుకుంది. కోల్‌కతాకు చెందిన హజరత్‌, ముసీదా భార్యాభర్తలు. ముసీదా నిండు గర్భిణి. హజరత్‌ పులివెందుల వచ్చి గ్రానైట్‌ బండలు పరుస్తూ ఉపాధి పొందుతున్నారు. కోల్‌కతాలో ఉన్న ముసీదా... తన తల్లి రషీదా, చెల్లెలు జమీదాతో కలిసి హజరత్‌ దగ్గరకు బయలుదేరారు. తిరుపతి చేరుకున్నాక పులివెందుల వెళ్లేందుకు ఆర్టీసీ బస్సు ఎక్కారు. ప్రయాణం మధ్యలో ముసీదాకు పురిటి నొప్పులొచ్చాయి. బస్సు పులివెందుల ప్రభుత్వ ప్రాంతీయాసుపత్రి దగ్గరకు చేరుకోగానే ఆమె పండంటి ఆడ శిశువును ప్రసవించారు. ఆసుపత్రి గైనకాలజిస్టు లక్ష్మీప్రియ తన సిబ్బందితో వెళ్లి ప్రథమచికిత్స చేశారు. అనంతరం ఆసుపత్రికి తరలించారు. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారు.


మరిన్ని