రాష్ట్రంలో మళ్లీ ‘క్లస్టర్‌’ వైద్యం

ఈనాడు, అమరావతి: గతంలో అమలుచేసి, రద్దుచేసిన ‘క్లస్టర్‌ పీహెచ్‌సీ’ విధానాన్ని మార్పులతో మళ్లీ అమల్లోకి తెచ్చే విషయాన్ని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ పరిశీలిస్తోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నాలుగైదు మండలాల్లోని పీహెచ్‌సీలను కలిపి ఓ ‘క్లస్టర్‌’గా గుర్తించారు. వీటికి సమీపంలోని సీహెచ్‌సీ కేంద్రంగా ఒక డిప్యూటీ సివిల్‌ సర్జన్‌ సంబంధిత క్లస్టర్‌ పరిధిలోని పీహెచ్‌సీల పనితీరు పర్యవేక్షించారు. ఐసీడీసీ కార్యక్రమానూ క్లస్టర్‌లో ఇంటిగ్రేట్‌ చేశారు. కొంతకాలానికి ఈ విధానం రద్దయింది. ఈ నేపథ్యంలో మండల తహసీల్దార్‌/ఎంపీడీఓ తరహాలోనే పీహెచ్‌సీల పనితీరుపైనా పర్యవేక్షణ ఉండేలా చేయాలని వైద్య ఆరోగ్యశాఖను ప్రభుత్వం ఆదేశించింది. ఇప్పుడు మండలాల వారీగా కాకుండా శాసనసభ నియోజకవర్గాల వారీగా క్లస్టర్‌ విధానాన్ని అమలుచేయాలని భావిస్తున్నారు. నియోజకవర్గంలోని అన్ని పీహెచ్‌సీలను ‘క్లస్టర్‌’గా గుర్తించి సమీపంలోని ‘కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌’లో డిప్యూటీ సివిల్‌ సర్జన్‌ ఉండి వాటి కార్యకలాపాలు పర్యవేక్షించేలా చేయాలని ఆలోచిస్తున్నారు. ఇక్కడ ఉండే అధికారిని కమ్యూనిటీ హెల్త్‌ ఆఫీసర్‌గా పరిగణిస్తారు. ఈ ఆఫీసర్‌ జాతీయ ఆరోగ్య కార్యక్రమాలు, ఫ్యామిలీ ఫిజిషియన్‌, ఉప ఆరోగ్యకేంద్రాల పనితీరును పర్యవేక్షిస్తారు. పీహెచ్‌సీలలో పనిచేసే వైద్యుల్లో సీనియర్లకు కమ్యూనిటీ హెల్త్‌ ఆఫీసర్‌గా పదోన్నతి కల్పించే అవకాశం ఉంది.


మరిన్ని