శ్రీశైలంలో జాతీయ ధార్మిక సమ్మేళనం

శివాచార్యస్వామి

కర్నూలు నగరం (ఆధ్యాత్మికం), న్యూస్‌టుడే: వచ్చే ఏడాది జనవరి 11 నుంచి 15 వరకు శ్రీశైల పుణ్యక్షేత్రంలో జాతీయ ధార్మిక సమ్మేళనం నిర్వహించనున్నట్లు శ్రీశైల జగద్గురు డాక్టర్‌ చెన్నసిద్ధరామ పండితారాధ్య శివాచార్యస్వామి తెలిపారు. గతనెల 29న కర్ణాటకలోని బెళగావి జిల్లా యడియార నుంచి ఆయన చేస్తున్న మహా పాదయాత్ర బుధవారం కర్నూలు నగరానికి చేరుకుంది. భాజపా నేత బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి, విశ్వహిందూ పరిషత్తు రాష్ట్ర అధ్యక్షుడు నందిరెడ్డి సాయిరెడ్డి, వీరశైవ ఐక్యవేదిక ప్రతినిధులు ఆయనకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో స్వామి మాట్లాడుతూ.. ధార్మిక సమ్మేళనానికి ప్రధాని మోదీతోపాటు 5 రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఆహ్వానించినట్లు తెలిపారు. ఈనెల 30 నాటికి పాదయాత్ర శ్రీశైలం చేరుతుందన్నారు. ధర్మ జాగృతి, ప్రకృతిని కాపాడటంపై అవగాహన కల్పిస్తూ, యువత చెడు వ్యసనాలకు దూరం కావాలని, వృక్ష సంపదను కాపాడాలని, సేంద్రియ సాగుపై ప్రచారం చేస్తున్నామన్నారు. పాదయాత్ర కమిటీ కన్వీనరు చంద్రశేఖరప్ప, వీరశైవ ఐక్యవేదిక ప్రతినిధులు మల్లికార్జునప్ప, వీరశేఖర్‌, మల్లికార్జునయ్య, శంకరయ్య, లలితాపీఠం పీఠాధిపతి సుబ్రహ్మణ్యం, తితిదే ప్రతినిధి మల్లు వెంకటరెడ్డి, లింగాయత్‌ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ రుద్రగౌడ్‌, కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్‌ సభలో పాల్గొన్నారు.


మరిన్ని